Sunday, August 13, 2023

నమస్తే తెలంగాణ - జిందగీ #భారత పాటకు జేజేలు..

https://docs.google.com/document/d/1McSlQR5lEToGYXQbVdJtufx8ESl00qg3zkn7sNuyVVo/edit?usp=sharing నమస్తే తెలంగాణ - జిందగీ భారత పాటకు జేజేలు.. హో లోపే సచ్చాయీ రహతీ హై జహా దిల్ మే సఫాయీ రహతీ హై హమ్ ఉస్ దేశ కే వాసీ హై.. జిస్ దేశ్ మే గంగా బహతీ హై| ॥ హిందీ సినీగీత రచయిత శైలేంద్ర రాసిన ఈ గీతం ప్రతీ భారతీయుడి హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. 'ముఖంలో నిజాయతీ, మనసులో స్వచ్ఛత కలగలసిన దేశవాసులం మేము.. ఇక్కడ పవిత్ర గంగానది ప్రవహిస్తుంటుంది' అని భారతదేశ ఔన్నత్యాన్ని నాలుగు పంక్తుల్లో చెప్పాడు ఆ గీత రచయిత, ..భారత పాటకు జేజేలు.. ఉందిలే మంచికాలం ముందుముందునా.. అందరూ సుఖపడాలి నందనందనా..' స్వాతంత్య్ర భారత వైభవాన్ని చాటిచెబుతూ, భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్దేశిస్తూ సాగిపోయే పాట ఇది. ఐదారు దశాబ్దాలు వెనక్కి వెళ్తే.. ప్రతి సినిమాలో ఓ దేశభక్తి గీతం వినిపించేది. ఓపాట స్వతంత్ర సమరంలో వీరుల త్యాగనిరతిని చాటిచెబితే.. మరో గీతం మన కర్తవ్యాన్ని గుర్తుచేసేది. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంలో ఆ పాటలను తలచుకుందాం.. మదినిండా మన మూడురంగుల జెండాను ఆవిష్కరించుకుందాం.. ‘మేరే దేశ్ కీ ధర్తీ సోనా ఉగ్ లే .. ఉగ్ లే హీరే మోతీ.. మేరే దేశ్ కీ దర్శీ'.. ఉప్కార్ చిత్రంలో గుల్షన్ బావ్ రా రాసిన గీతమిది. అవును మన మట్టిలో పసిడి తళుకులు వెలుగులీనుతాయి. ఈ నెలలో నవరత్నాలు దొర్లుతాయి. 'యే దేశ్ హై వీర్ జవానోఁకా.. అల్బేలొంకా.. మస్తానోమ్కా’ అని సాగే ప్రేరణాత్మక గీతం పంద్రాగస్టు, ఛబ్బీస్ జనవరి నాడు వీధివీధినా మార్మోగుతుంటుంది! 'యే మేరే ప్యారే వతన్.. యే మేరే బిచ్ డే చమన్.. తుఝపే ఖుర్బాన్.. పాట మనసారా వింటే ఈ గీతాన్ని ఆవిష్కరించిన మన్నాడే స్వరం.. సర్వం దేశానికే అర్పించమని ఉపదేశిస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ పాటలోనే ‘ఇక్కడి గిరిపాదాలను ముద్దాడుతూ వీచే గాలికి నందనం చేస్తున్నా.. అని వర్ణించిన తీరుకు ఈ పాట రచయిత ప్రేమ్ ధావనక్కు వందనం చేయకుండా ఉండలేం. 'సబ్ సే ప్యారీ సుబాహ్ తేరీ, సబ్ సే రంగీ తేరి శామ్..' అంటూ మలయమారుతంగా సాగిపోయే ఈ గీతం 'కాబూలీవాలా' సినిమాలోనిది. మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించకముందు 1943లో విడుదలైన కిస్మత్ సినిమాలోని 'దూర్ హటో దూర్ హటో యే దునియావాలో.. హిందుస్థాన్హమారా హై!' పాట నాటి సమరయోధుల పోరాట ఘట్టాన్ని ఆవిష్కృతం చేస్తుంది.. స్వాతంత్ర్య పోరాటంలో భగత్ సింగ్ ది ప్రత్యేక శకం. ఆయన జీవిత కథ ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. వాటిలో ఒకటి 1965లో విడుదలైన 'శహీద్'. ఈ చిత్రంలోని పాటలన్నీ పంద్రాగస్టు ప్లే లిస్ట్లో చోటుదక్కించుకున్నవే. 'యే వతన్ యే వతన్ హమ్ కో తేరీ కసమ్..", 'మేరే రంగ్ దే బసంతీ చోలా హో ఆజ్ రంగ్దే..' పాటలు జాతికి పునరంకితం కావాలనే సందేశాన్నిస్తాయి. 'ఛోడో కల్ కీ బాతే.. కల్ కీ బాత్ పురానీ.. నయే దౌర్ మే లిఖేంగే మిల్కర్ నయీ కహానీ.. హమ్ హిందుస్థానీ' పాట గొప్ప సందేశాన్నిస్తుంది. "నిన్నటి మాటలు పదిలిపెట్టు.. మేం కొత్త చరిత్ర లిఖిస్తామ'ని చెప్పే ఈ పాట ఈ తరానికి గీతోపదేశం వంటిది. ఇలా బాలీవుడ్ చిత్ర సీమలో లెక్కకు మించిన దేశభక్తి గీతాలు గుబాళించాయి. ప్రతి దశకంలోనూ పదేసి దేశభక్తి చిత్రాలు, పాటలు నిర్మాతలకు కలెక్షన్లతోపాటు ప్రేక్షకులకు కర్తవ్యాన్ని బోధించాయి. భావితరాలకు స్ఫూర్తినిచ్చాయి. తెలుగు వీర లేవరా… భారత మాతకు జేజేలు.. పలికిన పాటలు మన తెలుగు సినిమాల్లో కోకొల్లలు. బ్లాక్ అండ్ వైట్ రోజుల నుంచీ నేటి వరకు ఎగురుతున్న జెండాను చూస్తూ రొమ్మువిరుచుకొని పాడుకునే గీతాలు ఎన్నో వచ్చాయి. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన 'సిపాయి చిన్నయ్య'లోని 'నా జన్మ భూమి ఎంత అందమైన దేశము. . నా ఇల్లు అందులోనా కమ్మని ప్రదేశము.. ' ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతం. ఈ పాట వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ రేడియోలో వారానికో రెండుసార్లయినా ప్రసారమవుతుంటుంది. 'చెడు అనవద్దు.. చెడు వినవద్దు.. చెడు కనవద్దు.. ఇది బాపూజీ పిలుపు..? పాట ప్రతి భారతీయుడినీ మేలుకొలుపుతుంది. 'గాంధీ పుట్టిన దేశం.. రఘురాముడు ఏలిన రాజ్యం.. అది సమతకు మమతకు సందేశం..' గీతం మనిషి మనిషిగా బతకాలని, ఏనాడూ నీతికి నిలవాలని బోధిస్తుంది. 'మరపురాని కథ' సినిమాలోని 'కన్ను చెదురు పంజాబు గోధుమల చెన్నపురికి అందించెదము.. నేయిగారు నెల్లూరు బియ్యమును నేస్తముగా చెల్లించెదమూ' పాట మనదేశ అస్తిత్వమైన భిన్నత్వంలో ఏకత్వాన్ని' చాటుతుంది. స్వతంత్ర సమరయోధుడు అల్లూరిజీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన 'అల్లూరిసీతారామరాజు' సినిమాలోని 'తెలుగువీర లేవరా..' పాట దేశాభివృద్ధికి దీక్షబూనేలా ప్రోత్సాహాన్నిస్తుంది. 'నేనూ నా దేశం' చిత్రంలోని 'నేనూ నా దేశం పవిత్ర భారత దేశం..` పాట భారతావని వైవిధ్యాన్ని విశదపరుస్తుంది. దేవులపల్లి రాసిన 'జయ జయ జయ ప్రియ భారత జనయిత్రీ..! గీతం దివ్యగానమై వీనుల విందు చేస్తుంది. ' ‘అమెరికా అబ్బాయి' సినిమాలోని 'ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. తల్లి భారతి ఖ్యాతిని.. ఖండాంతరాల్లో వినిపించమంటుంది. ఇంద్రగంటి శ్రీకాంతశర్మ రాసిన 'తేనెల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచెదమా..' పాట వీరుల త్యాగఫలాన్ని గుర్తుచేస్తూ, మన స్వేచ్ఛకు మూలాన్ని చెబుతుంది. ఆ మహనీయులను మన మనసుల్లో నిలుపుకొని. ముందుకెళ్లాలని సూచిస్తుంది. 'నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువు మరవద్దు' గీతం జాతిని నడిపి, నీతిని నిలిపిన మహనీయులను మరవద్దని హెచ్చరిస్తుంది. ఎన్టీఆర్ నటించిన 'మేజర్ చంద్రకాంత్' సినిమాలో జాలాది రాసిన 'పుణ్యభూమి నా దేశం నమో నమామి.. ధన్యభూమి నా దేశం సదా ''స్మరామి' పాట తల్లి భారతి దాస్య విముక్తి కోసం అసువులు బాసిన మహామహుల మహోజ్వలిత చరితను కండ్లముందు ఉంచుతుంది. 'మగువ శిరమున మణులు పొదిగెను హిమగిరి.. కలికి పదములు కడలి కడిగిన కల ఇది’ అంటూ పరదేశీ చిత్రంలో వేటూరి రాసిన పాట మనదేశాన్ని 'జగతి సిగలో జాబిలమ్మ'గా నిలబెట్టింది అంటే అతిశయోక్తి కాదు. ఇలా దేశభక్తి సినీగీతాలెన్నో జనగళాల్లో జయజయధ్వానాలు చేస్తున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర ఉత్సవాల్లో ఘనంగా వినే దేశభక్తి గీతాలు ఆ పూటకే మర్చిపోతే ఏ ప్రయోజనమూ ఉండదు! జాతీయ పతాకం రెపరెపలాడుతున్నప్పుడు ఉప్పొంగిన జాతీయవాదం నిరంతరం ప్రతిధ్వనించాలి. జాతీయ గీతం ఆలపిస్తున్నప్పుడు పొందిన అనుభూతి మనసులో ఇగిరిపోకుంటే.. మన జెండా ఎగిరినంత కాలం సగర్వంగా తలెత్తుకోవచ్చు.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Sri Vinayaka Chavithi Puja Vidhanam & Katha

  Vinayaka Chavithi Pooja Vidaanam, Story Vinayaka Chavithi Pooja Vidaanam Vinayaka Chavithi is also known as Vinayaka Chaturthi is the Hind...