Sunday, August 27, 2023

#చైతన్య భగవద్గీత - 9వ శ్లోకం మరియు 10 వ శ్లోకం వ్యాఖ్యానము # Lyrical Audio & Video

శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణ మేవ చ | 
అధిష్ఠాయ మన శ్చాయం విషయా నుపసేవతే  9వ శ్లోకం
శ్రోత్రం- చక్షు:-స్పర్శనం-చ-రసనం-ఘ్రాణం- ఏవ - చ 
అధిష్టాయ-మనః-చ-అయం-విషయాన్-ఉపసేవతే 
అర్జునా! జీవుడు ఇంద్రియ మనస్సులు ఆరింటిని ఆశ్రయించుకొని విషయాలను అనుభవిస్తాడు. 
వ్యాఖ్య : ప్రయాణికులు వారికి అవసరమైన వస్తువులను జాగ్రత్తగా వెంట పెట్టుకొని వెళ్తూ ఉంటారు. వారు వెళ్ళిన చోట అవి ఉపయుక్తంగా ఉంటాయనే వెంట తీసుకొని పోతారు. తీరా చేర వలసిన చోటికి చేరిన తరువాత వెంట తెచ్చుకున్న వాటిని వినియోగించుకుంటూ ఉంటారు. అలాగే జన్మాంతరాలలో పయనించే జీవుడు పూర్వ దేహాన్ని విడిచి పెట్టే టప్పుడు ఐదు ఇంద్రియా లను, ఆరవది అయిన మనస్సును వెంట పెట్టుకొని వెళ్ళి, వాటితో కలిసి ఉత్తర దేహంలో ప్రవేశిస్తాడు. తీరా ప్రవేశించిన తరువాత, తన వెంట తెచ్చుకొనిన వాటిని వినియోగించు కుంటాడు. ఇదే ఈ శ్లోకంలో ప్రధాన మైన విషయం. విషయ ప్రపంచములో చరించే వ్యక్తి కర్మాచరణమునకు బాహ్యం లోని శబ్దాది విషయాలే హేతువులు. ఆ శబ్దాది విషయాలను అనుభవించ డానికి సాధనము లైన శ్రోత్రాది ఇంద్రియాలు, ఆరవది అయిన మనస్సు వ్యక్తిలో ఉన్నాయి. జన్మాంతరాలలో జీవుని వెంబడించి వచ్చాయి. అవే చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు, మనస్సు అనేవి (శ్రోత్రం చక్షుః స్పర్శనం, రసనం, ఘ్రాణమ్, మనః). శ్రోత్రాది పంచేంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియముతో కలిసిన మనస్సును జీవుడు (అయం) అధిష్టించి, దేహము నందుండి శబ్దాది విషయ వ్యాపారా లైన వినడము, కనడము, స్పృశించడము, రుచి చూడటము, వాసన చూడటము, ఆలోచించడము మొదలైన విషయాలను అనుభవిస్తూ ఉంటాడు (ఉపసేవతే). శ్రోత్రాది పంచేంద్రియాలతో సంబంధం కలిగిన మనస్సును ఆశ్రయించుకొని, వినాలనే కుతూహలంతో చెవితో చేరి శబ్దాలను వింటాడు. మనస్సును అధిష్ఠించి, చూడాలనే ఆసక్తితో కళ్ళతో కలిసి రూపాలను, రంగులను వీక్షిస్తాడు. మనస్సులో కొలువై, ఆఘ్రాణించాలనే అభిలాషతో ముక్కుతో కుమ్మక్కై వాసనలను పీలుస్తాడు. మనస్సులో చేరి, రుచి చూడాలనే అభిరుచితో నాలుకతో జతై రుచులను అనుభవిస్తాడు. మనస్సులో నిలిచి, స్పృశించాలనే స్పృహతో త్వగింద్రియంతో, అంటే చర్మముతో చెట్ట పట్టా లేసుకొని వస్తువులను తాకుతూ ఉంటాడు. ఈ విధంగా మనస్సులో సదా మనుగడను సాగిస్తూ, ఒక్కొక్క ఇంద్రియముతో ప్రత్యేకంగా కలుస్తూ, ఆయా విషయాలను జీవుడు అనుభవిస్తూ ఉంటాడు. ఇంద్రియ మనస్సుల ద్వారా జీవుడు విషయాలను అనుభవిస్తున్నాడు. కనుక పంచేంద్రియాలు, ఆరవది అయిన మనస్సు జీవునికి భోగ సాధనాలుగా ఉన్నాయి. పనిముట్లుగా ఉపకరిస్తున్నాయి. పని వాడు పనిముట్టుకన్నా అన్యమైన వాడు. అలాగే, జీవుడు ఇంద్రియ మనస్సుల కన్నా భిన్నమైన వాడు. ఇంద్రియ మనస్సులు సూక్ష్మ శరీరానికి సంబంధించినవి. పూర్వానుభవాలకు సంబంధించిన వాసనలన్నీ సూక్ష్మదేహం లోనే ఉంటాయి. మనస్సు లోనే ఉంటాయి. జీవి నూతన దేహంలో ప్రవేశించే టప్పుడు పూర్వ వాసనలతో నిండి ఉన్న మనస్సుతో కలిసే ప్రవేశిస్తాడు. పూర్వ కర్మలకు సంబంధించిన ఫలాలనుకూడా మనస్సే, అనగా సూక్ష్మదేహమే అనుభవిస్తుంది. పుణ్య పాప ఫలాలను భోగిస్తుంది. ఈ సూక్ష్మదేహంతో తాదాత్మ్యం చెందడం చేత జీవుడు భోక్తగా, ద్రష్టగా, శ్రోతగా, జ్ఞాతగా తెలుస్తూ ఉంటాడు. వాస్తవానికి భోక్త మనస్సే గాని జీవుడు కాడు. కనుక సూక్ష్మ శరీరము జీవునికి ఉపాధిగా తెలుస్తూ ఉంది. బహిర్ముఖాసక్తి శబ్దాది విషయాలన్నీ బాహ్య ప్రపంచం లోనే ఉన్నాయి. పూర్వ వాసన లన్నీ విషయ సంబంధం గానే ఉన్నాయి. దానికి తోడు ఇంద్రియాలు కూడా బాహ్య దృష్టి కలవి గానే సృష్టింపబడి ఉన్నాయి. సృష్టికర్తే అలా సృజించాడు అన్నది వేదం. 
మ॥ పరాంచి ఖాని వ్యతృణ త్స్వయం భూః తస్మా త్పరాజ్ పశ్యతి నాంతరాత్మన్ | బ్రహ్మదేవుడు ఇంద్రియాలను బహిర్ముఖం గానే సృష్టించాడు. అందుచేత మనిషి బాహ్యాన్నే చూస్తాడు. అంతరాత్మను చూడలేడు అన్నది కఠోపనిషత్. మనం పూర్వ శ్లోక వ్యాఖ్యానంలో చెప్పుకున్నట్లు, ఇంద్రియ మనస్సులను భగవత్కార్యాలలో పవిత్రంచేసుకుంటే, తత్సంబంధమైన తాత్విక వాసనలే మనస్సులో నిక్షిప్తమై ఉంటాయి కనుక, బహిర్ముఖ మయ్యే సహజ స్వభావము ఇంద్రియ మనస్సులకు ఉన్నప్పటికీ, పూర్వ వాసనా జనిత పుణ్య సంస్కారం చేత అవి అంతర్ముఖమై, అంతరాత్మ వైపు పయనించే అవకాశం సాధకులకు లభ్య మౌతుంది. ఈ విధంగా పరమాత్మ స్వరూపుడైన జీవుడు దేహగతుడై ఉన్నా ఎందుకని మనుషులు గ్రహించలేక పోతున్నారు? చెబుతున్నాడు. 
ఉత్రామన్తం స్థితం వాపి భుజ్ఞానం వా గుణాన్వితమ్ | 
విమూఢా నానుపశ్యన్తి పశ్యన్తి జ్ఞానచక్షుషః 10వ శ్లోకం 
ఉత్య్రామంతం-స్థితం-వా-అపి-భుంజానం-వా-గుణాన్వితం విమూఢా:-న-అనుపశ్యంతి - పశ్యంతి - జ్ఞానచక్షుషః 
అర్జునా! వెళ్ళేవాడు, ఉండేవాడు, అనుభవించే వాడు, గుణయుతుడు అయిన జీవాత్మను అజ్ఞానులు తెలుసుకో లేరు. జ్ఞాన నేత్రం కల వారు దర్శిస్తారు. 
వ్యాఖ్య :ఈ లోకంలో సనాతనుడైన జీవుడు తన అంశయే, తన స్వరూపమే అని భగవంతుడు ఏడవ శ్లోకంలో చెప్పడం జరిగింది. దేహాది సంఘాతానికి ప్రభువైన జీవుడు పూర్వ దేహాన్ని విడిచిపెట్టే టప్పుడు గాని, మరొక శరీరంలో ప్రవేశించే టప్పుడు గాని, పుష్పము నందలి సుగంధమును వాయువు వెంట పెట్టుకొని పోయినట్లు, ఇంద్రియ మనస్సులను వెంట పెట్టుకొని పోతున్నాడు అని ఎనిమిదవ శ్లోకంలో ప్రవచించడం జరిగింది. దేహగతుడై ఉన్నప్పుడు కూడా మనస్సును అధిష్ఠించి, ఇంద్రియాలతో ప్రత్యేకంగా సంగమిస్తూ, విషయాలను జీవుడు అనుభవిస్తున్నాడు అని తొమ్మిదవ శ్లోకంలో ప్రసంగించడం జరిగింది. ఈ విధంగా దేహాన్ని పరిత్యజించేటప్పుడు గాని (ఉత్కామన్తం, పరిత్యజన్తం దేహం పూర్వోపాత్తం), దేహస్థితుడై ఉన్నప్పుడు గాని (స్థితం వా దేహే తిష్ఠన్తం), గుణాలతో కూడి విషయాలను అనుభవిస్తు న్నప్పుడు గాని (భుజాన వా శబ్దాదీన్, సుఖదుఃఖ మోహాణ్యైః గుణైః అనుగతమ్) - వీటన్నిటిలో జీవుని సన్నిధి సుస్పష్టంగా కనిపిస్తూ ఉండినా (అత్యన్త దర్శన గోచర ప్రాప్తం ) . ఎందుకని మానవులు గుర్తించలేక పోతున్నారు? ఎందుకని దర్శించలేక పోతున్నారు? అనేది ఆశ్చర్యకర మైన ప్రశ్న. ఈ సమస్య ప్రస్తుత శ్లోకంలో పరిష్కరింప బడుతూ ఉంది. భగవంతుడు అందరికీ కావాలి. కాని, భగవంతుణ్ణి అందరూ తెలుసుకో లేరు. మోక్షం అందరికీ కావాలి. కాని మోక్షమేమిటో అందరూ అర్థంచేసుకోలేరు. అవసరమైతే అందరికీ ఉంది. కాని తీరే ఉపాయం అందరివద్ద లేదు. జీవుడు ఆత్మస్వరూపమే కదా! జీవుని అస్తిత్వం అంతటా సుస్పష్టంగా ఉన్నా, ఎందుకని దర్శించలేక పోతున్నారు? ఈ దుస్థితిని చూచి భగవంతుడు కూడా చలించి పోతున్నాడు అని ఈ సందర్భంలో శ్రీశంకరాచార్యస్వామి అనితర సాధ్యంగా భాష్యంలో ప్రవచించారు. అయ్యో! మానవులకు ఎంత కష్టమొచ్చి పడింది అని భగవంతుడు జాలి పడుతున్నాడట (అహో కష్టం వర్తతే ఇతి అనుక్రోశతి చ భగవాన్ !). సామీప్యమే గాని సందర్శనం లేదు మరణానంతరము, దేహాంతరమును పొందుతున్న జీవుడు లింగ శరీరమును, లేదా సూక్ష్మ శరీరమును వెంట పెట్టుకొని పోవడం వల్లనే కదా స్థూలదేహం శవంగా పడి ఉంది? జీవుడు సూక్ష్మ దేహాన్ని వెంట పెట్టుకొని పోతున్నాడు అంటే, సూక్ష్మదేహం తన కన్నా అన్యమైనది అని అర్థం కాదా? స్థూలదేహం చలించడానికి కారణమైన లింగ దేహమును ఆకర్షించి (కర్షతి) వెంట తీసుకొని పోతున్న జీవుడు స్థూలదేహం కన్నా, లింగదేహం కన్నా కూడా విలక్షణుడు అని తెలుస్తూనే ఉన్నాడు కదా? దర్శనీయుడు గానే ఉన్నాడు కదా? దేహంలో జీవుని యొక్క అస్తిత్వము లింగ శరీరము ఉండటం చేతనే నిరూపించ బడుతుంది. మరొక ఋజువు అవసరం లేదు. అందుకే సూక్ష్మ శరీరాన్ని లింగ శరీరం అన్నారు. లింగం అంటేనే గుర్తు లేదా చిహ్నము అని అర్థము. జీవుడు ఉన్నాడు అనడానికి లింగ దేహమే గుర్తు (లింగ్యతే అనేన ఇతి లింగమ్). జీవించి ఉన్నప్పుడు చలిస్తూ ఉండిన స్థూలదేహం మరణానంతరం శవమై అచలంగా ఎందుకని పడి ఉంది? లింగ శరీరం స్థూల శరీరం నుండి విడిపడి పోయింది కనుక. సూక్ష్మదేహం స్థూలదేహంతో సంయుక్తమై ఉన్నప్పుడు స్థూలదేహం జీవిస్తూ ఉండింది కనుక జీవుడు ఉన్నాడని స్పష్ట మౌతూ ఉంది. సూక్ష్మదేహం విడిపడి పోగానే మరణం సంభవించింది. కనుక జీవుడు ఉన్నాడా, లేక ఉత్క్రమించాడా? అని తెలుసుకోవడానికి లింగదేహమే గుర్తు. లింగదేహం ఉంటే జీవుడు ఉన్నాడని అర్థం. లింగదేహం పోతే జీవుడు కూడా స్థూలాన్ని విడిచి పెట్టాడు అని అర్థం. లింగ దేహాన్ని వెంట పెట్టుకొని వెళ్ళాడనేది సుస్పష్టం. మరణానంతరం కూడా జీవాత్మ ఉందని ఇంత స్పష్టంగా తెలుస్తూ ఉన్నా, మరణాన్ని జీవునికి ఆపాదించి అవివేకంతో మనుషులు దుఃఖిస్తున్నారు. అందుచేత జీవుడు ఉన్నట్లు తెలుస్తూ ఉన్నా, విమూఢులై (విమూఢాః) గుర్తించలేక పోతున్నారు ( న అనుపశ్యన్తి). 
హృదయాకాశ మాత్రస్య వినాశే దేహనాశతః 
వ్యర్థం భూతాని శోచన్తి నష్ట ఆత్మేతి శంకయా ॥ 
హృదయ పుండరీకంలో పరమాత్మ స్వరూపమైన జీవాత్మ ఉండటం చేత దేహము జీవించింది. మరణంలో దేహము నశిస్తూ ఉంది. దేహ నాశము వల్ల హృదయాకాశము నశిస్తుందే గాని, హృదయ స్థితుడు, సనాతనుడైన జీవుడు నశించడం లేదు. దేహమే ఆత్మ అనే భావం దేహాత్మ భావం. ఈ దేహాత్మ భావం వల్లనే దేహము నశిస్తే జీవాత్మ నశించినట్లు మానవులు దుఃఖిస్తున్నారు. ఉన్నప్పుడు కూడా లేనట్లే వెనుకటి దేహము నుండి ఉత్క్రమించి, మరొక దేహంలో లింగ శరీరంతో పాటు ప్రవేశించిన జీవుడు, ఆ దేహంలో శబ్దాది విషయాలను అనుభవిస్తున్నాడు. అలాగే సత్త్వరజస్తమో గుణాలతో కలిసి సుఖదుఃఖ మోహాలను అనుభవంలో అవలోకిస్తున్నాడు. మనస్సును అధిష్ఠించి విషయాలను ఇంద్రియాల ద్వారా అనుభవిస్తున్నాడు ( మనః ప్రత్యేకమ్ ఇంద్రియేణ సహ అధిష్ఠాయ దేహస్థః విషయాన్ శబ్దాదీన్ ఉపసేవతే). జడమైన ఇంద్రియ మనస్సులు దృశ్యములు. దృగ్రూపుడైన జీవాత్మ చైతన్యము. జీవ చైతన్యం యొక్క ప్రభావం చేతనే జడమైన దృశ్య వర్గము చలిస్తూ ఉంది. చెట్టుకొమ్మలు చలిస్తూ ఉంటే, వాయువు ఉందని గుర్తిస్తున్నామా లేదా? ఫ్యాను తిరుగుతూ ఉంటే, విద్యుచ్ఛక్తి ఉందని గుర్తిస్తున్నామా లేదా? మరి స్థూల, సూక్ష్మ దేహాలు చలిస్తూ ఉంటే, అందుకు కారణమైన జీవాత్మ దేహంలో భాసిస్తున్నాడని గుర్తించ మెందుకని? దీనికి కారణము అవివేకము. వివేకము లేక పోవడము. వివేకము లేని వారు మూఢులు. విమూఢులు. అందుచేత జీవిత కాలంలో స్థూల సూక్ష్మ దేహ వ్యాపారాదులలో జీవాత్మ సుస్పష్టంగా తెలుస్తూ ఉండినా, వివేకము లోపించిన కారణంగా విమూఢులు దర్శించలేక పోతున్నారు (విమూఢాః న అనుపశ్యన్తి). జ్ఞానులకు దర్శనీయం అవివేకం వల్ల, అజ్ఞానం వల్ల, మూఢత్వం వల్ల జ్ఞానం లేని వారు సుస్పష్టంగా దర్శన గోచర మవుతున్నా జీవాత్మను తెలుసుకోలేక పోతూ ఉంటే, జ్ఞానచక్షువులు గల విజ్ఞానులు ఆత్మను చక్కగా దర్శిస్తున్నారు అంటున్నాడు ( పశ్యన్తి జ్ఞాన చక్షుషః). విమూఢులు ఆత్మ దర్శనం చేయలేక పోవడానికి అజ్ఞానము కారణము. విజ్ఞానులు ఆత్మను దర్శించడానికి జ్ఞానమే కారణము. జ్ఞానమును ప్రమ అంటారు. ప్రమను, అనగా జ్ఞానమును కలిగించేది ప్రమాణము. అదే శాస్త్రము. వేదాంత శాస్త్రము. ప్రమాణం ఉన్నప్పుడు ప్రమ కలగక పోవడ మనేది ఉండదు. అట్టి వేదాంత శాస్త్ర జ్ఞానమును గురూపదేశం వల్ల ఎవరైతే గ్రహిస్తారో వాళ్ళకి జ్ఞానం ప్రాప్తిస్తుంది. వారి బుద్ధి జ్ఞానమయ మవుతుంది. వారి దృష్టి జ్ఞానదృష్టిగా మారుతుంది. దీనినే శాస్త్ర పరిభాషలో జ్ఞాన చక్షువు అంటారు. ఇట్టి జ్ఞానచక్షువు గల వారు అంతటా స్పష్టంగా భాసిస్తున్న ఆత్మను సహజంగా దర్శిస్తారు (యే తు ప్రమాణ జనిత జ్ఞాన చక్షుషః తే ఏవం పశ్యన్తి జ్ఞాన చక్షుషః వివిక్త దృష్టయః ఇత్యర్థః). వీరే వివేకులు. ఆత్మను చక్కగా అవలోకించే వారు. వివేకులు జ్ఞాన చక్షువు కల వారు కావడం చేత ఆత్మను దర్శిస్తారు. ఈ జ్ఞానం శాస్త్రం నుండి వారికి ప్రాప్తించింది. ఇది ప్రమాణ జనిత జ్ఞానము. మరి విమూఢులు ఆత్మను దర్శించలేక పోవడానికి కారణం అజ్ఞానము అని అంటున్నాము కదా! జ్ఞాన మైతే శాస్త్రము నుండి వస్తుంది. మరి అజ్ఞానం ఎక్కడ నుండి వస్తుంది? వెలుతురు దీపం నుండి వస్తుంది అని చెప్పగలం. చీకటి ఎక్కడి నుండి వస్తుంది అంటే ఏమి చెప్ప గలం? చీకటి ఎక్కడి నుండో రాదు. ఉంటుంది. రాకుండానే ఉంటుంది. అజ్ఞానం కూడా అంతే. అజ్ఞానం ఎక్కడి నుండో రాదు. ఉంటుంది. రాకుండానే ఉంటుంది. అదెలా? ఎక్కడో ఒక చోట నుండి అజ్ఞానం వచ్చి ఉండాలి. లేదా ఒక సమయంలో కదిలి ఉండాలి అంటారా! ఏమో! ఇది అంతు పట్టని విషయం. అందుకే అజ్ఞానాన్ని అనాది అన్నారు. అనాది అంటే ఆది లేనిది అని అర్థము. ఆది లేని దానికి అంతం కూడా ఉండదు కదా! మరి అజ్ఞానం ఎలా పోతుంది? జ్ఞానం ఎలా వస్తుంది? చీకటి ఎప్పటి నుండి ఉంది? దాని ఆది ఎక్కడ? తెలియదు. మరి అనాదిగా ఉన్న చీకటి, దీపం వెలిగించ గానే అంతం అవుతుందా లేదా? అజ్ఞానం కూడా అంతే. అజ్ఞానం ఫలాన సమయంలో ఆరంభమైంది అని ఎవరైనా చెప్పారనుకోండి. దాని అర్థమేమిటి? అంతకు ముందు అజ్ఞానం లేదు అని అర్థం. అప్పుడే అది ఆరంభం అనబడుతుంది. సరే, అజ్ఞానం ఆరంభం కాక ముందు అజ్ఞానం లేదు. మరేముంది? జ్ఞాన ముంది. అంతేనా? అంతే. మరి, జ్ఞాన మున్నప్పుడు, అజ్ఞాన మెలా ఉంటుంది? లేని అజ్ఞానం ఎలా ఆరంభ మౌతుంది? ఈ ప్రశ్నల సుడిలో దూరడం కన్నా, అజ్ఞానం అనాది అనే వాస్తవాన్ని అంగీకరించి పుడులకు, ముడులకు దూరంగా ఉండటం మంచిది. అజ్ఞానము అనాదే అయినా, జ్ఞానప్రాప్తిలో అంతమై పోతుంది. మరి, ప్రమాణ విచార ఫలితంగా శాస్త్ర జ్ఞానాన్ని పొందుటకు ప్రయత్నించిన వారందరికీ ఆత్మదర్శన మవుతుందా? ఏమో! కావచ్చు. కాకపోవచ్చు. చదవండి.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

AYYAPPA SONGS LATEST VIDEOS UPDATED #MUST WATCH

Sharanamayyo Sharanamayyappa Full Song | Ayyappa Swamy Song 2024 | Rampur Sai, Shekar Nani, Anika Link:  https://youtu.be/oyfRKKqdN1o?si=t5a...