telugudevotionalswaranjali.blogspot.com
Friday, August 11, 2023
స్వామి బ్రహ్మానంద సంక్షిప్త జీవిత చరిత్
స్వామి బ్రహ్మానంద సంక్షిప్త జీవిత చరిత్ర
దక్షిణేశ్వర కాళికాలయంలో దీర్ఘకాలం విశిష్ట సాధనలు
అనుష్ఠించిన పిదప ఒకరోజు శ్రీరామకృష్ణులు జగజ్జననిని
ఇలా ప్రార్థించారు: "అమ్మా! ఈ లౌకిక విషయ
లంపటులైన వారితో పదేపదే మాట్లాడి విసిగి
వేసారిపోయాను. తల్లీ! నాకు మార్గం ఏమిటి? నా
ఆంతర్యాన్ని గ్రహించగల నువ్వు నాకు చేదోడుగా ఉండగల
వారసుణ్ణి ఒకణ్ణి నాకు అనుగ్రహించరాదా.”
అందుకు వెంటనే, “దిగులు చెందకు నాయనా!
పరిశుద్ధాత్ములైన భక్తులు ఎందరో నిన్ను చేరనున్నారు”
అనే దివ్యవాణి వినవచ్చింది. ఆ దివ్యవాణి పలికినట్లే
త్యాగధనులైన యువకులు ఎందరో ఆయన వద్దకు
రాసాగారు. వారు తదనంతరం శ్రీరామకృష్ణుల ఆంతరంగిక
శిష్యులయ్యారు. వారందరిలోను ప్రత్యేక స్థానాన్ని పొందిన
వ్యక్తి స్వామి బ్రహ్మానంద.
స్వామి బ్రహ్మానంద పూర్వాశ్రమ నామధేయం రాఖాల్
చంద్రఘోష్. ఆయన్ను రాఖాల్ అని పేర్కొనడం కద్దు.
శ్రీరామకృష్ణులను 'ఠాకూర్' అని సంబోధించేవారు.
రాఖాల్ రాకను జగజ్జనని తమకు ముందుగానే
సూచించిన వైనాన్ని శ్రీరామకృష్ణులు ఇలా తెలియచేశారు:
“రాఖాల్ దక్షిణేశ్వరానికి రావడానికి మునుపు
ఒకరోజు తాము ధ్యానంలో నిమగ్నులై ఉండగా, జగజ్జనని
ఒక బాలుణ్ణి తెచ్చి తమ ఒడిలో కూర్చోబెట్టి, 'ఇదిగో నీ
పుత్రుడు' అన్నది. ఆ మాటలకు శ్రీరామకృష్ణులు
ఉలిక్కిపడి, 'ఆ నాకేమిటి, పుత్రుడేమిటి తల్లీ? నేను
అస్ఖలిత బ్రహ్మచారిని. అటువంటి నాకు ఏమిటీ
వైపరీత్యం!' అంటూ భయభ్రాంతులయ్యారు. అప్పుడు
ఆయన మనోస్థితిని చూసి జగజ్జనని చిరునవ్వు చిందించి,
'ఈ బాలుడు నీ మానస పుత్రుడు. త్యాగమూర్తి, లౌకికుడు
కాడు' అని అనునయించింది. ఆ తరువాత ఆయన
రాఖాల్ను చూడడం జరిగింది. అతణ్ణి చూడగానే జగజ్జనని
తన ఒడిలో కూర్చోబెట్టిన బాలుడు అతనే అని అవలీలగా
పోల్చుకోగలిగారు.”
మరొక దివ్యదృశ్యం కూడా ఆయన చూశారు. దాన్ని
గురించి ఇలా వివరించారు: “గంగానదీ జలాల మీద
వికసించిన నూరు రేకుల కమలం గాంచాను. ప్రతి రేకు
మెరిసిపోతూ ఉంది. ఆ కమలం వేదికగా కాళ్ళకి
చిరుగజ్జెలు ధరించి చిన్నికృష్ణుడు మరియు తమకు
జగజ్జనని ప్రసాదించిన బాలుడు నృత్యం చేస్తూ
కనిపించారు.” ఆ నృత్యాన్ని తిలకిస్తూ ఆయన
మైమరచిపోయారు.
1863వ సం॥ జనవరి 21వ తేదీ మంగళవారం
నాడు కలకత్తాకు సమీపంలోని శిక్రా అనే గ్రామంలో ఒక
సంపన్న కుటుంబంలో రాఖాల్ జన్మించాడు. అతడి తండ్రి
ఆనందమోహన్ ఘోష్, తల్లి కైలాస కామినీ దేవి. ఆమె
కృష్ణ భక్తురాలు. పరమ సాధ్వీమణి. వారు జమీందారులు,
కాయస్థ క్షత్రియ కులస్థులు. ఆ దంపతుల ఏకైక సంతానం
రాఖాల్. రాఖాల్కు ఐదవ ఏట మాతృ వియోగం కలిగింది.
ఆ తరువాత ఆనందమోహన్ పునర్వివాహం చేసుకొన్నాడు.
సవతితల్లియైన హేమాంగినీదేవి రాఖాల్ను ఎంతో
ప్రేమానురాగాలతో చూసుకొనేది.
రాఖాల్ స్ఫురద్రూపి. చిన్నతనం నుంచి ఆరోగ్యంగా,
అందంగా ఉండేవాడు. రాఖాల్ను తాము స్థాపించిన
బడిలోనే ఆనందమోహన్ విద్యాభ్యాసానికి చేర్పించాడు.
రాఖాల్ అటు చదువు సంధ్యల్లో ఆరితేరడంతో పాటు
ఇటు వ్యక్తిగా నిర్భీతుడు. చురుగ్గా చలాకీగా ఉండడంతో
ఉపాధ్యాయులకూ, తోటి బాలురకూ అతడంటే వల్లమాలిన
ఇష్టం. ఒక్క చదువులోనే కాదు, ఆటపాటల్లోనూ, వ్యాయామ
క్రీడల్లోనూ రాఖాల్ ప్రథముడై ఉండేవాడు. అతడి మనస్సు
అతికోమలం, ఉపాధ్యాయులు పిల్లలను కొట్టి శిక్షిస్తే
సహించేవాడు కాడు. తోటి బాలురందరితో ఎంతో
కలుపుగోలుగా ఉండేవాడు. పిల్లలను ఏ విధంగానూ
దండించక వారికి విద్యాబోధన చేసేటట్లు ఉపాధ్యాయుల
మనస్తత్వంలో కూడ తన మంచితనంతో గొప్పమార్పు
తీసుకువచ్చాడంటే అది అతిశయోక్తి కాబోదు. దీనితో
ఉపాధ్యాయులు క్రమంగా బడితపూజకు స్వస్తి చెప్పేశారు.
ఆటల పోటీల్లో పాల్గొని తన క్రీడానైపుణ్యాన్ని రాఖాల్
ఎంతగా ప్రదర్శించేవాడో, చిన్నప్పటి నుండి మొక్కల
పెంపకం, తోట వేయడంలోనూ అంతే సరదాను
కనబరిచేవాడు. ఈ విషయంలో అచ్చంగా తండ్రి పోలికే.
మామూలు పిల్లల మాదిరి చదువు సంధ్యలు,
ఆటపాటలతోనే అతడు సరిపెట్టుకొనేవాడు కాదు. తన
తోటి బాలురనందరినీ వెంటబెట్టుకొని ఊరి పొలిమేరలోని
కాళికాలయం వద్ద ఉన్న మారేడు చెట్టుక్రిందకు చేరేవాడు.
స్వయంగా కాళీ ప్రతిమను తయారుచేసి, అక్కడ
ప్రతిష్ఠించి, పూజాదికాలు చేసి పరవశుడయ్యేవాడు.
శరన్నవరాత్రులలో దుర్గాపూజ జరుగుతున్నప్పుడు
మండపంలో పూజారి వెనుక కూర్చుని పూజా విధానాన్ని
తదేకంగా పరికిస్తూ తన్మయుడయ్యేవాడు. సంధ్యా
సమయాన దేవికి హారతి ఇచ్చేటప్పుడూ అదే తీరు. అతడికి
గానం అంటే ప్రాణం.
అప్పుడప్పుడు నేస్తాలందరితో కలిసి ఒక ఏకాంత
ప్రదేశంలో కూర్చుని దేవి సంకీర్తన చేసేవాడు. మైమరచి
పాడేవాడు. కొత్తపాట ఏదన్నా వింటే చాలు, దాన్ని
నేర్చుకొనే వరకు మరో ధ్యాస ఉండేది కాదు.
ప్రాథమిక పాఠశాల చదువు పూర్తికాగానే రాఖాల్కు
ఆంగ్లవిద్యాభ్యాసం చేయించాలని తండ్రి ఎంచి, అతణ్ణి
కలకత్తాలోని ట్రైనింగ్ అకాడమీలో చేర్చాడు. అప్పుడే
రాఖాలు, నరేంద్రునితో (కాలాంతరంలో స్వామి
వివేకానంద) మొట్టమొదట పరిచయం కలిగింది. అప్పటికే
నరేంద్రుడు విద్యార్థి నాయకుడు. ఇద్దరూ సమవయస్కులే.
ప్రథమ కలయికలోనే మిత్రులైపోయారు. క్రమంగా ఆ
మైత్రి ప్రగాఢమై శాశ్వతమైపోయింది.
వారిద్దరూ ఒకే వ్యాయామ క్రీడా మైదానంలో కుస్తీలు,
మల్లయుద్దాలు, సాముగరిడీలు నేర్వసాగారు. నరేంద్రుని
స్నేహంతో రాఖాల్ మెల్లమెల్లగా బ్రహ్మసమాజానికి కూడ
రాకపోకలు చేయసాగాడు. ఆధ్యాత్మిక చింతన,
భగవద్ధ్యానం, వేదాంత చర్చలు. 'దేవుడే మన తండ్రి.
ఆయన్ను తెలుసుకోవడం ఎలా?' ఇవే ఆలోచనలు.
ఎక్కువసేపు ధ్యానంలో మగ్నుడయ్యేవాడు.
అందుకే కాబోలు శ్రీరామకృష్ణులు ఇలా అంటూ
ఉండేవారు: "ఈ రాఖాల్కు పుట్టుకనుంచీ దైవచింతనే.
అంత మనోనిగ్రహం కలగాలంటే, అంత దైవధ్యానం
చేయాలంటె ఎంతో సాధన, వెనుక ఎన్ని జన్మల సాధనో
ఉండి ఉండాలి సుమా!”
ఈ వివిధ కార్యకలాపాలలో, దైవధ్యాసలో
మునిగిపోయి ఉన్నందున రాఖాల్కు చదువుపట్ల దృష్టి
సన్నగిల్లసాగింది. ఇది తండ్రి దిగులుకు కారణమైంది.
రాఖాల్ను తన దారికి తీసుకురావడానికి ఎన్నో విధాల
చెప్పి చూశాడు, మందలించాడు కూడ. కాని ప్రయోజనం
లేకపోయింది. చివరకు బంధుమిత్రుల, శ్రేయోభిలాషుల
సలహాలు సంప్రదింపులతో రాఖాల్కు వివాహం చేయాలని
తండ్రి నిర్ణయించుకొన్నాడు. అందుకు తగ్గట్లు
అనుకూలమైన సంబంధం కుదరింది. వధువు పేరు
విశ్వేశ్వరి. రాఖాలు విశ్వేశ్వరితో వివాహం జరిగిపోయింది.
ఆ వివాహం రాఖాల్ శ్రీరామకృష్ణుల సన్నిథికి చేరడానికి
తొలిమెట్టయింది.
రాఖాల్ బావమరది మనోమోహన్ మిత్ర. అత్తగారు
శ్యామసుందరీ దేవి. ఈ కుటుంబం మొదటి నుంచీ
శ్రీరామకృష్ణుల భక్తకోటిలోనిది. అందుచేత 1881వ సం||
మధ్యకాలంలో అత్తవారింటికి వచ్చిన రాఖాల్ను
బావమరది మనోమోహన్ మిత్ర, శ్రీరామకృష్ణుల దర్శనం
చేయించాలని దక్షిణేశ్వరానికి తోడ్కొని వెళ్ళాడు. అప్పటికి
శ్రీరామకృష్ణులు ఎదురు చూస్తూవున్న శుభతరుణం
అరుదెంచినది.
తమకు కలిగిన దివ్యదర్శనం వలన శ్రీరామకృష్ణులు
రాఖాల్ను అపేక్షగా పలుకరించారు. “పేరేమిటి?” అని
అడిగారు. “రాఖాల్” అనగానే, “ఆ, ఔను గోపబాలుడే”
అంటూ ఆనందంతో ఆయన పులకించిపోయారు. పిదప
కుశల ప్రశ్నలు వేశారు. అప్పుడప్పుడు వస్తూ ఉండమని
వాత్సల్యపూరితంగా మరీమరీ చెప్పారు.
ఆ క్షణం నుంచీ రాఖాల్ చెవిలో 'వస్తూ ఉండు'
అన్నమాట మారుమ్రోగసాగింది. 'ఆ పలకరింపులో
ఎంతటి ఆప్యాయత!' అని మనస్సులో పదేపదే
అనుకొన్నాడు. ఇక ఆనాటి నుంచీ పాఠశాలకు సెలవులు
ఇస్తే చాలు, తిన్నగా దక్షిణేశ్వరం వచ్చి వాలేవాడు. అక్కడ
శ్రీరామకృష్ణులు అంతకంటే ఆరాటంతో తన మానస
పుత్రుని రాకకోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉండేవారు.
“ఇక్కడికి రావడంలో ఇంత ఆలస్యం చేయాలా నాయనా?”
అంటూ సుతిమెత్తగా మందలించేవారు. అందుకు రాఖాల్
ఏం జవాబు చెబుతాడు? మౌనం పాటించేవాడు.
రెప్పవాల్చకుండా ఒకరిని ఒకరు గంటల పర్యంతం
అలా చూస్తూ ఉండిపోయేవారు. అదో అపురూప
దివ్యానుభూతి. ఆ భావనాప్రపంచంలో లీనమైపోయేవారు.
తల్లి లేని రాఖాల్, శ్రీరామకృష్ణులలో తల్లిని గాంచాడేమో!
అతడికి మాతృప్రేమ లభించిందేమో మరి!
ఆ కారణంగానేమో అప్పటికి పెద్దవాడే అయినా
రాఖాల్ శ్రీరామకృష్ణుల వద్ద చంటిపిల్లవాడిలా
ప్రవర్తించేవాడు. మారాం చేసేవాడు, మంకుపట్టు
పట్టేవాడు. ఆయన వద్ద ఎంతో చనువుగా, వాత్సల్యంతో
మెలిగేవాడు. అతడు తరచు దక్షిణేశ్వరానికి వస్తూ
ఉండేవాడు.
అప్పట్లో జరిగిన ఒక వింత సంఘటన గురించి
శ్రీరామకృష్ణులు ఇలా ముచ్చటించేవారు:
అప్పటికి రాజాల్ యువకుడేగాని అతడి ప్రవర్తన
మాత్రం ఒక్కొక్కప్పుడు మూడు నాలుగేళ్ళ బాలునిదిగా
ఉండేది. నన్ను కన్నతల్లిగా భావించేవాడేమో? ఉన్నట్టుండి
పరుగెత్తుకు వచ్చి నా ఒళ్ళో చతికిలబడేవాడు. సంతోషం
పట్టలేక ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. తన ఇంటికి తిరిగి
పోవాలన్న మాట అటుంచి, నా ఒళ్ళోనుంచి ఒక్క అడుగు
ముందుకు వెళ్ళేందుకు కూడ సుతరాం ఇష్టపడేవాడు
కాదు. నేను కూడ పుత్రవాత్సల్యంలో మగ్నుడనైపోయి
అతడికి వెన్న, పాయసాన్నాలు స్వయంగా నా చేత్తో
తినిపించేవాణ్ణి. అప్పుడు అతడు నా చిన్నికృష్ణయ్య, నేను
యశోదను.
చదువుపట్ల, ఇంటిమీద ధ్యాసే అతడికి ఉండేది కాదు.
దక్షిణేశ్వరం నుండి ఇంటికి వెళ్ళాలనే బుద్ధి పుట్టేది కాదు.
రాఖాల్ విషయంలో అతడి తండ్రి ఆనంద
మోహన్ ఘోష్ అనుకొన్నది ఒకటి, జరిగింది మరొకటి.
ఏకైక పుత్రుడు చదువు సంధ్యలు నేర్చి, ఇంటిపట్టున
ఉంటూ, ఇల్లువాకిలి ఆస్తిపాస్తులు చూసుకొంటూ
ప్రయోజకుడై వంశాన్ని ఉద్దరిస్తాడనుకొన్నాడు తండ్రి.
కాని రాఖాల్ పారమార్థిక చింతనలో తప్ప ఈ లోకంలోకి
దిగిరాడాయె! అలాగే వదలిపెట్టేస్తే ఏకంగా సన్న్యాసం
పుచ్చుకొంటాడేమోనని ఆనందమోహన్ మనస్సు పరిపరి
విధాల పరితపించింది. ఎంతగానో అతడు కలవరపడ్డాడు.
రాల్ దక్షిణేశ్వరం నుండి తిరిగి రాగానే తండ్రి
ఇక దక్షిణేశ్వరం వెళ్ళడానికి వీలులేదని గట్టి కట్టడి చేశాడు,
ఆదేశించాడు. కాని రాఖాల్, శ్రీరామకృష్ణులను
చూడకుండా ఉండలేడాయె! ఆయన్ను చూడాలని అతడి
మనస్సు తహతహలాడిపోయేది.
అక్కడ దక్షిణేశ్వరంలో శ్రీరామకృష్ణులు తన
ముద్దుబిడ్డడు కనబడకపోయేసరికి కంట
తడిబెట్టుకొన్నారు. జగజ్జనని వద్ద, “అమ్మా! రాఖాల్ను
చూడాలని నా మనస్సు ఆరాటం చెందుతున్నది. రాఖాల్ను
ఇక్కడకు రప్పించవా తల్లీ!” అంటూ వాపోయారు.
ఆనందమోహన్ ఏదో పనిలో తలమునకలై ఉండడం
చూసి రాఖాల్ చెప్పాపెట్టకుండా, గుట్టుచప్పుడు కాకుండా
యథాప్రకారం దక్షిణేశ్వరానికి వచ్చేశాడు, అక్కడే
ఉండిపోయాడు.
అప్పటి నుండి తండ్రి, కుమారుని మనస్తత్త్వం మెల్లగా
అర్థం చేసుకోసాగాడు. కాని అలాగే వదలిపెట్టలేక, తీరిక
చేసుకొని కొన్ని రోజుల తరువాత దక్షిణేశ్వరం వెళ్ళాడు.
రాఖాల్ తిరిగి ఇంటికి రాడని మనస్సు తెలుపుతూ
ఉన్నప్పటికీ, తోడ్కొని రావాలనే ఉద్దేశంతో మనస్సు
దిటవుపరచుకొనే ఆనందమోహన్ అక్కడకు వెళ్ళాడు.
దూరం నుంచి ఆనందమోహన్ ఘోషన్ను చూస్తూ
రాఖాల్ భయంతో వణకిపోతున్నాడు. శ్రీరామకృష్ణులు,
రాఖాల్తో, “చూడు రాఖాల్. మీ తండ్రిగారు వస్తున్నారు.
ఎందుకు భయంతో వణకిపోతున్నావు?” అన్నారు.
“తల్లితండ్రులు ప్రత్యక్షదైవాలు నాయనా! ఎదురు వెళ్ళి
ఆయనకు నమస్కరించు. ఆ జగజ్జనని అనుగ్రహం ఉంటే
అడ్డంకి ఏముంటుంది?”
రాఖాల్ ప్రవర్తనకూ, ఆదరసత్కారాలకూ
ఆనందమోహన్ ఎంతో ముగ్ధుడయ్యాడు. రాఖాల్
ముఖంలో ఎంతో ఆనందం, సంతృప్తి వెల్లివిరిశాయి.
రాఖాల్కు పరిపూర్ణ మాతృప్రేమ ఇక్కడ లభించింది
అనుకొన్నాడు ఆనందమోహన్. తల్లిలేని తన బిడ్డ మనోవేదన
తలుచుకొని అతడి హృదయం ద్రవించిపోయింది.
అంతటి అనురాగధామం నుండి తన బిడ్డను
బలవంతంగా తోడ్కొనిపోవడం భావ్యం కాదని, అది
అనుచితమని ఆనందమోహన్ ఘోష్కు తోచింది. అందుకని
రాఖాలు అతడి అభీష్టాన్ని అననుసరించి దక్షిణేశ్వరంలో
విడిచిపెట్టి తాను వచ్చిన దోవనే తిరిగి వెళ్ళిపోయాడు.
వెళ్ళేటప్పుడు శ్రీరామకృష్ణులతో, “మహాశయా!
అప్పుడప్పుడు ఇంటికి వచ్చి కనబడుతూ ఉండవలసిందిగా
దయచేసి రాఖాల్కు చెప్పండి. అదే పదివేలు" అని మాత్ర
చెప్పి వెళ్ళాడు.
తండ్రిగారి ఆ చిన్ని కోర్కెను తీర్చే నిమిత్తం రాఖాల్
ఎప్పుడైన చుట్టపుచూపుగా ఇంటికి వెళ్ళి, తిరిగి
దక్షిణేశ్వరానికి వచ్చేసేవాడు. దక్షిణేశ్వరమే అతడి
నివాసస్థానం అయింది.
అలా కొంతకాలం గడిచింది....
సంధిగ్ధావస్థలో రాఖాల్ అత్తగారు శ్యామసుందరీదేవి
కుమార్తె విశ్వేశ్వరిని తోడ్కొని ఒకరోజు దక్షిణేశ్వరానికి
వచ్చింది.
విశ్వేశ్వరి ముఖలక్షణాలు గమనించగానే
శ్రీరామకృష్ణులు ఆమెది సామాన్యమైన పుట్టుక కాదని
గ్రహించారు. భర్త పారమార్థిక మార్గానికి అడ్డురాని
త్యాగరూపిణి అనీ, ఆమె దైవీబాలయే అనీ ఆయన
అవగతం చేసుకొన్నారు. ఆనందంతో "మన కోడలు
వస్తున్నది, కానుక ఇచ్చి దీవించమని” శారదామాత గదికి,
ఆయన కబురు పంపారు. అది చిత్రమైన బాంధవ్యం కదా!
రాఖాల్ అహర్నిశలూ భగవద్ధ్యానంలో మగ్నుడై
ఉండడం చూసి శ్రీరామకృష్ణులు ఆనందపరవశులై తమ
శిష్యరత్నానికి ఎన్నో యోగ రహస్యాలు తెలిపారు.
మంత్రోపదేశం చేశారు. రాఖాల్కు ఒక్కొక్కప్పుడు ధ్యాన
సమయంలో స్థిరచిత్తం లేకపోవడాన్ని గమనించి నాలుక
జాపమని తమ వ్రేలితో నాలుకమీద ఏదో వ్రాసి ఆ
అవరోధాన్ని అరికట్టేశారు. అయినప్పటికీ అతడికి లౌకిక
వాంఛలేశమాత్రం ఉన్నట్లు ఆయన గ్రహించారు. ఇంటికి
వెళ్ళి వస్తూ ఉండమని ప్రోత్సహించారు. కాని
అచిరకాలంలోనే రాఖాల్ పూర్తిగా విరక్తుడైనాడు. తమ
యోగశక్తిచే ఇతరుల మనోభావాలను అవలీలగా అవగతం
చేసుకోగల శక్తిమంతుడయ్యాడు.
ఒక రోజు రాఖాల్కు బాగా ఆకలి వేసింది. తినడానికి
ఏమీ లేదు. "ఏదైనా తినడానికి ఉంటే బాగుంటుంది.
అబ్బ, చాల ఆకలిగా ఉంది” అన్నాడు రాఖాల్. వెంటనే
శ్రీరామకృష్ణులు గంగ ఒడ్డుకు గబగబా వెళ్ళి, “ఓ గౌర్దాసీ!
(గౌరీమా, శ్రీరామకృష్ణుల భక్తురాలు) త్వరగా రావాలి.
మా రాఖాల్కు ఆకలి వేస్తోంది, భరించలేకుండా ఉన్నాడు”
అంటూ ఎలుగెత్తి కేకపెట్టారు. కాస్సేపట్లో గౌర్దాసీ పడవలో
పట్టుకువచ్చింది. అది చూసి
శ్రీరామకృష్ణులు సంతోషం పట్టలేక చిన్నపిల్లవాణ్ణి
పిలిచినట్లు, "ఓ రాఖాల్! ఇలా చూడు, తినుబండారాలు
వచ్చేశాయి. ఆకలితో విలవిల్లాడిపోయావు కదా! ఇక వెళ్ళి
ఆరగించు" అంటూ రాఖాల్ను పిలిచారు.
ఆ మాటలు విని రాఖాల్ రోషంతో ఇలా అన్నాడు:
"ఔను, ఆకలి వేసింది కనుక అలా అన్నాను. అందుకని
మీరు ఆ విషయం ఊరంతా తెలిసేలా చాటింపు వేయాలా?
సిగ్గుచేటు.” అందుకు శ్రీరామకృష్ణులు, "అవును, నీకు
బాగా ఆకలివేసింది కనుక చెప్పాను, తప్పేమిటి? ఇక
వెళ్ళి ఆరగించవయ్యా!” అంటూ బుజ్జగించారు. బిడ్డడి
ఆకలి తీర్చగలిగింది తల్లే కదా!
ధ్యానంలో లీనమైపోతే రాఖాల్కు దినచర్య కూడ
జ్ఞప్తికి వచ్చేది కాదు. ఆ సందర్భంలో శ్రీరామకృష్ణులు,
"ఈ స్థితిని చేరుకొన్న ఈ కుర్రవాడు నాకు ఏం
సేవచేయగలడు? నేనే లేచి వెళ్ళి అతడికి మంచినీళ్ళు
అందించవలసిన పరిస్థితి ఎదురవుతూంటే” అనేవారు.
కాలచక్రం గిర్రున తిరుగసాగింది....
"ఒక బహుళ చతుర్దశి నాడు ధ్యానంలో మగ్నుడైన
రాఖాల్ను శ్రీరామకృష్ణులు అతడి ఛాతీమీద తమ చేతులతో
నిమిరి బాహ్యస్మృతికి తీసుకురావలసి వచ్చింది. ఆ
తరువాత శ్రీరామకృష్ణులు మౌనసమాధి పాటించారు;
పిదప మౌనభంగం చేసి ఇలా అన్నారు: “ఇంత సేపూ
నాకు జగజ్జనని, భక్తులు ఎంతవరకు ఆధ్యాత్మికంగా
పురోగమించారో చూపిస్తూ వచ్చింది. రాఖాల్ను గురించి
అయితే, అతడు ఎంతో ఎదిగాడు. ఆ విషయాలన్నీ
గుప్తమైనవి, బయటకు వెల్లడించరాదు.”
1885వ సం|| శ్రీరామకృష్ణులకు కంఠంలో వ్రణం
బయలుదేరింది. తరువాత దాన్ని క్యాన్సర్గా నిర్ధారించారు.
చికిత్స నిమిత్తం ఆయన్ను కాశీపూర్ ఉద్యానగృహానికి
తరలించారు. అక్కడ ఆయన నిత్యం కొంతసేపు
ఏకాంతంగా నరేంద్రుడితో భవిష్యత్తులో నిర్వర్తించవలసిన
కార్యప్రణాళికల గురించి ముచ్చటిస్తూ ఉండేవారు.
శిష్యులందరూ శ్రీరామకృష్ణులకు అమిత శ్రద్ధాభక్తులతో
సేవలు ఒనరించసాగారు. ఆ సందర్భంలో ఒకరోజు
రాఖాల్ శక్తి సామర్థ్యాలు, దీక్ష పట్టుదల, గాంభీర్యాన్ని
ప్రస్తావిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా మెచ్చుకొన్నారు: "ఈ
రాఖాల్టి రాజబుద్ధి. సంకల్పిస్తే ఒక మహాసామ్రాజ్యాన్నే
పరిపాలించగల ప్రతిభావంతుడు.”
శ్రీరామకృష్ణుల పలుకులలో ఆంతర్యాన్ని గ్రహించిన
నరేంద్రుడు వెంటనే, “ఇకనుంచీ మనందరం రాఖాల్ను
'రాజా' అని పిలుద్దాం” అన్నాడు. శిష్యులందరూ
ఏకగ్రీవంగా అందుకు ఆమోదించారు. అప్పటి నుండి
రాఖాల్ను, వట్టి 'రాజా' అనే కాక 'మహారాజా’
అత్యంత ఆదరాభిమానాలతో పిలువసాగారు.
ఇది ఇలా ఉండగా, రాఖాల్కు పరంపరగా
భావసమాధి స్థితులు, అనేక దివ్యదర్శనాలు, యోగసిద్ధులు
కలుగసాగాయి.
ఎందరు ఘనవైద్యులు చికిత్స చేసినా, ఎంతటి
సేవాశుశ్రూషలు శిష్యబృందం అందించినా శ్రీరామకృష్ణుల
ఆరోగ్యం కుదుటపడక, నానాటికీ క్షీణించసాగింది. చివరకు
1886వ సం|| ఆగష్టు 16వ తేదీ శ్రీరామకృష్ణులు
మహాసమాధి చెందారు.
తదనంతరం సోదర శిష్యులతో కలిసి
వరాహనగరంలో తాము ఏర్పాటు చేసుకొన్న మఠంలో
రాఖాల్ శాస్త్రవిధిన సన్న్యాసాశ్రమం స్వీకరించాడు. రాఖాల్,
స్వామి బ్రహ్మానంద అయ్యాడు. '1
**************************************************
-1. శ్రీరామకృష్ణుల మహాసమాధి తదనంతరం సన్యాసం
స్వీకరించిన ప్రత్యక్ష శిష్యులు, వారి సన్న్యాస నామాలు:
నరేంద్రుడు.......స్వామి వివేకానంద
రాఖాల్..........స్వామి బ్రహ్మానంద
**************************************************
స్వామి బ్రహ్మానంద తీవ్ర వైరాగ్యంతో తీర్థయాత్రలు
సలిపారు, భిక్షాటనం చేశారు, విశేషంగా తపస్సు
ఒనరించారు.
ఒకసారి జగన్నాథ క్షేత్రంలో స్వామి బ్రహ్మానంద
భిక్షాటన చేస్తూ ఉండగా చూసి బలరాం బోస్
(శ్రీరామకృషుల గృహస్థ శిష్యులలో ప్రసిద్ధుడు) అక్కడి
తమ భవనంలో బసచేయమని, సదుపాయంగా
ఉంటుందని ఎంతో ప్రాధేయపడ్డాడు. కాని జీవితలక్ష్యాన్ని
***********************************************
యోగీన్=స్వామి యోగానంద; నిరంజన్=స్వామి నిరంజనానంద
లాటూ=స్వామి అద్భుతానంద; బాబూరాం=స్వామి ప్రేమానంద
తారక్=స్వామి శివానంద; హరి=స్వామి తురీయానంద
శరత్=స్వామి శారదానంద; శశి=స్వామి రామకృష్ణానంద
కాళీ=స్వామి అభేదానంద; గంగాధర్=స్వామి అఖండానంద
గోపాల్ (పెద్ద)=స్వామి అద్వైతానంద; శారదా ప్రసన్న=స్వామి త్రిగుణాతీతానంద
సుబోద్=స్వామి సుబోధానంద హరి=స్వామి విజ్ఞానానంద
సాధించడంలో స్థిరసంకల్పుడైన వ్యక్తి సౌకర్యాలు.
సదుపాయాలు ఆశిస్తాడా?
ఉత్తర భారతంలో తపస్సుకు బయలుదేరినప్పుడు
. సోదర శిష్యుల నాయకుడైన నరేంద్రుడు (స్వామి
వివేకానంద) తమ 'మహారాజు'కు ఏం ఇబ్బంది
కలుగుతుందోనని సుబోధానందుడనే సోదర శిష్యుణ్ణి
స్వామి బ్రహ్మానంద వెంట పంపాడు. నర్మదానదీ తీరాన
వెలసివున్న ఓంకారనాథ క్షేత్రంలో స్వామి బ్రహ్మానంద తీవ్ర
తపస్సు ఒనరించారు. ఆరు రోజులపాటు సమాధి స్థితిలోనే
ఉండిపోవడం జరిగింది. మరో సందర్భాన పంచవటిలో
సంకీర్తన చేస్తూ మూడు రోజులు సమాధి మగ్నులయ్యారు.
సంస్థ ద్వారకా బృందావన యాత్రలు చేసి బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడై
నిరంతర తపోనిష్ఠలో మహారాజు అన్నపానాదులనే
విస్మరించడం చూసి, శ్రీరామకృష్ణులకు ప్రీతిపాత్రుడూ,
మహనీయుడూ అయిన విజయకృష్ణ గోస్వామి,
మహారాజును ఇలా అడిగారు: "స్వామీ! ఆధ్యాత్మిక
జీవనానికి అవసరమైనంత ఆశించదగినదంతా మీకు మీ
గురుదేవులే అనుగ్రహించారు కదా! అయినప్పటికీ మీరింకా
ఎందుకింత తీవ్రతపోధ్యానాదులు అనుష్టిస్తున్నారు?”
అందుకు స్వామి బ్రహ్మానంద చిన్నగా నవ్వుతూ, “ఆయన
నాకు ప్రసాదించిన ఆస్తిని స్థిరాస్థిగా చేసుకోవడానికి” అని
జవాబు ఇచ్చారు.
స్వామి బ్రహ్మానందది తనివితీరని సాధన.
1893వ సం|| స్వామి వివేకానంద అమెరికాలోని
చికాగో నగరంలో నిర్వహించిన విశ్వమత మహాసభలో
హిందూమత ప్రతినిధిగా పాల్గొన్నారు. ఆ మహాసభలో
హిందూమత ప్రాశస్త్య వైశిష్ట్యాలను గురించి అద్భుత రీతిన
ప్రసంగించి, విజయ దుందుభి మ్రోగించిన వైనం
లేఖామూలంగా, వార్తాపత్రికల మూలంగా స్వామి
బ్రహ్మానందకు తెలిసినప్పుడు ఆయన సంతోషం వర్ణనాతీతం.
అప్పుడు స్వామి బ్రహ్మానంద తమ
మహాతపోఫలితంగా సామ్రాజ్యాధిపతులై, లోక సంక్షేమం
నిమిత్తం శ్రీరామకృష్ణ సంస్థకు సంబంధించిన
మహత్తరమైన బాధ్యతలను నిర్వహిస్తున్న తరుణం.
ఆ తరువాత రెండేళ్ళకు స్వామి వివేకానంద అమెరికా
నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. కలకత్తాలో స్వామి
వివేకానందకి ఘన స్వాగతం పలుకడానికి ఒక గొప్ప
బహిరంగ సభ ఏర్పాటైంది. ఆ మహాసభలో స్వామి
బ్రహ్మానంద, స్వామి వివేకానందులను పుష్పమాలాలంకృతుని
గావించారు. అప్పుడు స్వామి వివేకానంద 'గురువత్
గురుపుత్రేషు' అంటూ స్వామి బ్రహ్మానందకి
పాదాభివందనం చేశారు. అప్పుడు సమయ స్ఫూర్తితో
స్వామి బ్రహ్మానంద, 'జ్యేష్ఠభ్రాతా పితృసమః' అంటూ
స్వామి వివేకానందకి ప్రణామం చేశారు. వారి పరస్పర
ప్రేమానురాగాలు వర్ణనాతీతం.
భారతీయుల సంక్షేమానికై అమెరికన్ భక్తులు ఒసగిన
ధనానికి 'మహారాజే ధర్మకర్త' అని ప్రకటించి స్వామి
వివేకానంద స్వామి బ్రహ్మానందకి ఆ బాధ్యతను అప్పగించారు.
ఒకప్పుడు రాల్, నరేంద్రులను పోలుస్తూ
శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “నరేంద్రుడు ఒర నుంచి
దూసిన జ్ఞానఖడ్గం, రాఖాల్ జగన్మాత ఒళ్ళోని పసిబిడ్డడు.”
స్వామి వివేకానంద వేదాంత కేసరి, ఆయన సందేశం
శంఖారావం.
స్వామి బ్రహ్మానంద రకరకాల పుష్పాలను వికసింపచేసి
దివ్య ఫలసస్యాలను సమకూర్చే మంచులా, మౌనిగా
ప్రశాంతిని మౌన హృదయాల మీద చిలకరిస్తూ
ఆత్మప్రభావాన్ని అభివ్యక్తం చేశారు.
స్వామి వివేకానంద భారతదేశ జాగృతికి పునాది
నిర్మిస్తే, స్వామి బ్రహ్మానందులు వాటి మీద బ్రహ్మాండమైన
భవంతిని నిర్మించారు.
స్వామి వివేకానందుల ధీర వీర ప్రజ్ఞాపాటవాలు
ఎంతటి జడునినైనా జాగృతం చేయగలిగితే, స్వామి
బ్రహ్మానందుల జ్ఞాన దృష్టి అతడికి తరుణోపాయం
చూపగలిగింది.
“మన 'రాజా' మహోన్నతమైన ఆధ్యాత్మిక శక్తికి
పెన్నిధి” అంటూ స్వామి వివేకానంద వక్కాణించారు.
1902వ సం|| ప్రారంభంలో స్వామి వివేకానంద,
స్వామి బ్రహ్మానందులను శ్రీరామకృష్ణ మఠం మరియు
మిషన్ సంస్థలకు (Sri Ramakrishna Math & Mission)
సర్వాధ్యక్షుని గావించారు.
నలభై సంవత్సరాలు కూడ నిండకుండానే స్వామి
వివేకానంద 1902వ సం॥ పరమపదించారు. శ్రీరామకృష్ణ
సంస్థల భారం యావత్తు స్వామి బ్రహ్మానంద
భుజస్కంధాలమీద పడింది.
అంతకు మునుపే కలకత్తాలోని బేలూర్ ప్రధాన
మఠంగా మద్రాసులో ఒక మఠం, హిమాలయాల్లో ఒకటి
స్థాపించబడినాయి. అమెరికాలో న్యూయార్క్,
శాన్ ఫ్రాన్సిస్కోలలో వేదాంత కేంద్రాలు వెలశాయి.
భవన నిర్మాణం, క్షామ నివారణాది సేవాసంఘ
కార్యనిర్వహణ, విద్యా విధానం, గ్రంథ ప్రచురణ
ఒక్కటేమిటి మఠం చేపట్టిన సమస్తమైన కార్యక్రమాల్లో
స్వామి బ్రహ్మానంద అమూల్యమైన సలహాలు అందిస్తూ
తమ ప్రజ్ఞాపాటవాలను పూర్తిగా అందునిమిత్తం
వినియోగించసాగారు.
మఠ సేవాసంఘ ప్రధాన కార్యదర్శియైన స్వామి
శారదానంద, స్వామి బ్రహ్మానందుల అభిప్రాయాలను
శిరసా వహించేవారు.
శ్రీరామకృష్ణ సేవాసంఘాలలో విఖ్యాతి గాంచిన కాశీ
సేవాసంఘ కేంద్రానికి స్వామి బ్రహ్మానంద శంఖుస్థాపన
చేశారు. బెంగుళూరులో వెలసిన శ్రీరామకృష్ణ ఆశ్రమానికి
ప్రారంభోత్సవం జరిపారు. అక్కడి పూజామందిరంలోకి
హరిజనులు, నిమ్నజాతులవారు రావడం చూసి ఆయన
పరమానందభరితులయ్యారు. స్వయంగా హరిజనవాడకు
వెళ్ళి వారిని ప్రోత్సహించి, దీవించి వచ్చారు. కేరళలోని
తిరువనంతపురంలోను, ఒరిస్సాలోని సుప్రసిద్ధ క్షేత్రమైన
భువనేశ్వర్లోని శ్రీరామకృష్ణాశ్రమాలకు స్వామి
బ్రహ్మానందులే శంఖుస్థాపన చేశారు. 1917వ సం॥
మద్రాసులోని శ్రీరామకృష్ణ మిషన్ స్టూడెంట్స్ హోమ్
నూతన భవన నిర్మాణానికి కూడా ఆయనే శంకుస్థాపన
చేశారు.
ఈ రీతిలో స్వామి బ్రహ్మానంద పర్యవేక్షణలో, ఆయన
అందించిన స్ఫూర్తితో దేశంలో అనేక ప్రాంతాల్లో
వైద్యశాలలు, సేవాశ్రమాలు, ధార్మిక సంస్థలు చిరస్థాయిగా
నెలకొల్పబడ్డాయి. ఈ మహోన్నత సేవాకార్యాల
నిర్వహణలో ఉంటూనే, స్వామి బ్రహ్మానంద తీర్థయాత్రలు
చేశారు, తపమాచరించారు, దైవసందర్శనం పొందారు.
సమాధి స్థితులు కూడా పొందారు.
ప్రథమంలో శిష్యులను, ఉపదేశార్థులను అనేక
సంవత్సరాలు పరిశీలించిగాని స్వామి బ్రహ్మానంద వారికి
ఉపదేశం చేసేవారు కారు. కాని కాలక్రమంలో
విశాలహృదయంతో అడిగిన వారికి మంత్రోపదేశం చేశారు.
ఇలా ఆయన శిష్యవర్గం విస్తృతమైంది. కొందరైతే
మహారాజు నుంచి స్వప్నంలో కూడ మంత్రదీక్ష పొందారట.
ఆయన ధైర్య స్థైర్యాలు అపరిమితం. ఒకప్పుడు
రంకెలు వేస్తూ పిచ్చిగా పరిగెత్తివచ్చే ఎద్దు, మరొకప్పుడు
ఒక పెద్దపులి, గంభీరంగా నిలబడ్డ మహారాజును
సమీపించి పక్కకు తప్పుకుపోయాయి. ఆయనలోని
అద్భుతశక్తికి ఈ సంఘటనలు తార్కాణాలు.
మహరాజ్ ఎంత గంభీరులో అంతటి హాస్యరస
ప్రియులు కూడ. కళ్ళు మూసుకొని ధ్యానమగ్నుడైన శిష్యుని
ఎదుట పళ్ళూఫలాలుగాని, మిఠాయిలుగాని పెట్టించి,
అతడు కళ్ళు తెరవగానే, “చూశావా నాయనా! నీ
తపోఫలాన్ని” అంటూ చమత్కరించేవారు. హాస్యంతో
వేదాంతాన్ని రంగరించి శిష్యులకు బోధించేవారు.
ఇక్కడ ఒక హాస్య సంఘటనను పేర్కొనడం
అసంగతం కాబోదు. తమ సోదర శిష్యుడైన స్వామి
అఖండానందతో ఒకసారి తమాషా చేశారు. బేలూరు
మఠంలో మరికొన్నాళ్ళపాటు ఉండమంటే, స్వామి
అఖండానంద తమ ఆశ్రమానికి వెళ్ళి తీరవలసిందేనని
పట్టుబట్టారు. సరే అని, వేకువనే వచ్చి పల్లకీ తెచ్చి స్టేషన్కు
తోడ్కొనిపోవడానికి బోయీలను నియమించినట్లే
నియమించి, వారి చెవిలో మహారాజు ఏదో
గుసగుసలాడారు. బోయీలు “వొహొం వొహొం ఓం.....
వొహొం వొహొం ఓం” అని నినాదాలు చేస్తూ తెల్లవారే
వరకు తెరల మరుగున ఉన్న స్వామి అఖండానందని
బేలూరు మఠ ఆవరణ చుట్టూ ప్రదక్షిణలు చేయించి
సూర్యోదయం అయ్యేసరికి మఠం ముంగిట పల్లకీని
దింపారట. మహారాజు కుశల ప్రశ్నలతో ఎదురేగి రాగా
సోదర శిష్యులు ఇద్దరూ ఒకర్నొకరు ఆలింగనం చేసుకొని
పసిపిల్లల్లా నవ్వుకున్నారు.
స్వామి బ్రహ్మానంద ఈ తీరులో ఒకవైపు హాస్యచతురులై
ఉండీ, మరోవైపు భగవద్భావపరిపూర్ణులై విరాజిల్లారు.
శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: “పరిపక్వమై, మధుర
రసభరితమై ఆకుపచ్చగా కనిపించే రసాల జాతికి చెందిన
మేలురకం మామిడిపండు వంటివాడు మా రాఖాల్!"
స్వామి బ్రహ్మానంద అవసానదశలో కొంతకాలం
తీవ్రవ్యాధిగ్రస్తులైనారు. అయినా ఆయన ముఖారవిందం
మాత్రం దివ్యతేజోవిరాజమానమై భాసిస్తూ ఉండేది. తమ
దర్శనార్థం వచ్చిన శిష్యులను, భక్తులను దగ్గరకు పిలిచి,
దీవించేవారు. వచ్చిన ప్రతి వ్యక్తికీ ఏదో ఒక సూక్తి చెప్పి
మరీ పంపించేవారు.
శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులలో ఒకరైన స్వామి
విజ్ఞానానంద, మహరాజ్ దివ్యదర్శనాలను గురించి ఇలా
ప్రస్తావించారు: “దేవుళ్ళు, దేవతలు పురాణ కల్పితాలు
కావు. మహరాజ్ దేవతలను దర్శించి వారితో
సంభాషించేవారు. అందుచేత నాకీ విషయం స్పష్టమైంది.”
స్వామి బ్రహ్మానంద ఉన్నట్టుండి సమాధి స్థితిపొంది,
బాహ్యచైతన్యం కలిగాక, “కృష్ణపరమాత్మను చూడగలిగాను.
గత ఏ జన్మలోనో నా నేస్తం. నేను ఆ గోపాలుని రాఖాల్ను.
గజ్జలు తెచ్చి కాళ్ళకు కట్టండి, ఘల్ ఘల్ మంటూ
చేస్తాను” అని అనేవారు.
ఇలా అంటూనే ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఇలా
పలికారు: “నా ఆట అయిపోయిందంటున్నాడు. కృష్ణుడు
రమ్మని పిలుస్తున్నాడు. వచ్చేయమంటున్నాడు.... అవిగో
నా గురుదేవుల పాదాలు. అడుగో వివేకానందుడు...
ప్రేమానందుడు, యోగానందుడు. నా సోదర శిష్యులంతా
అరుగో (అప్పటికి వారందరూ స్వర్గస్థులైనారు).”
1922వ సం|| ఏప్రిల్ 10వ తేదీన స్వామి బ్రహ్మానంద
భౌతికంగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. బేలూరు
మఠ ఆవరణలోనే స్వామి భౌతిక కాయానికి
అంత్యక్రియలు జరిగాయి. పిదప అదేచోట స్వామి స్మారక
మందిరం నిర్మించారు. ఆ మందిరంలో స్వామి
ధ్యానమగ్నులై నెలకొని ఉన్నట్లు చలువరాతి విగ్రహాన్ని
ప్రతిష్ఠించారు.
స్వామి శిలాప్రతిమను చూస్తూ ఉన్న ప్రతి వ్యక్తి
చెవిలోను స్వామి ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకొంటూ
అన్న ఈ తుది పలుకులు మార్మోగుతూ ఉంటాయి:
“విచారించకండి నాయనలారా! నేనెప్పుడూ మీ వెంట
ఉంటాను.”
దక్షిణ కాలిఫోర్నియాలోని వేదాంత సంఘాధ్యక్షులైన
స్వామి ప్రభవానందతో, శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైన
స్వామి శివానంద, స్వామి బ్రహ్మానంద మహత్తును గురించి
పలికిన ఈ మాటలు నిత్యసత్యాలు: "భగవంతుని పుత్రుణ్ణి
దర్శించడం, భగవంతుణ్ణి దర్శించినట్లే అన్నమాట
విస్మరించరాదు సుమా!”
శిష్యులకు స్వామి బ్రహ్మానంద ఇలా హెచ్చరిక చేశారు:
“భగవత్సాక్షాత్కారమే జీవిత పరమోద్దేశం.
ఆనందసాగరమగ్నులై అమృత స్వరూపులు కండి. భక్తి
జ్ఞానాలను పరిపూర్ణంగా సముపార్జించుకొని
మానవునిలోని మాధవుణ్ణి సేవించండి.”
Subscribe to:
Post Comments (Atom)
AYYAPPA SONGS LATEST VIDEOS UPDATED #MUST WATCH
Sharanamayyo Sharanamayyappa Full Song | Ayyappa Swamy Song 2024 | Rampur Sai, Shekar Nani, Anika Link: https://youtu.be/oyfRKKqdN1o?si=t5a...
-
SRI BHAGAVATM_EPISODES_DOWNLOAD LINK: https://mega.nz/#F!AZZxhJQB!K8sQpIbEaPoY_1cFb7YYL SRI BHAGAVATAM ETV EPISODES Loading...
-
LORD SHIVA SONGS MY COLLECTION https://my.pcloud.com/publink/show? code=kZvotdZe0aFbupW6CuMi2OlPgPOrLUIyN4y నేను సేకరించిన lord shiva ...
-
ఏ పల్లె పిల్లోడో ఏ తల్లి బిడ్డోడో అయ్య కడుపు సల్లగుండా రాజ్యము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల బడ్డాడో అరవై ఏళ్ళ గోస దీసి సంబుర ...
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.