శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానందుల వారి జననం
వైకుంఠ ఏకాదశి
డిసెంబరు 25, 1947
గీతాజయంతి
హైదరాబాద్
SWAMI SUNDARA CHAITANYANADA BIRTHDAY CELEBERATIONS
ON 25 DEC 2024 @SUNDARA CHAITANYA ASRAMAM - DUNDIGAL
PART-01
జ్ఞానికి జగతి మధుకలశం అజ్ఞానికి పుడమి విషవలయం
శ్రుతి చేస్తేనే వాయిద్యం శ్రుతి జ్ఞానమే వైభవం.
శ్రుతియే జ్ఞానం మతియే మాయ
శ్రుతి జ్ఞానంతో మాయము మాయ
రామజోగి చిట్కాలు
సుందర చైతన్యాశ్రమం
హైదరాబాద్- 500043
స్వామి సుందర చైతన్యానంద
రామజోగి చిట్కాలు
స్వామి సుందర చైతన్యానంద
(సర్వ స్వామ్యములు ట్రస్ట్ వి)
ప్రతులకు:
సర్వజ్ఞ కల్చరల్ ట్రస్ట్,
సుందర చైతన్యాశ్రమం,
హైదరాబాద్- 500043.
:(08418) 255777.
(08418) 255355
డి.టి.పి.& కవర్ డిజైనింగ్
సుందర చైతన్యాశ్రమం
ముద్రణ:
శ్రీ లక్ష్మీగణపతి బైండింగ్ వర్క్స్
కొవ్వూరు
(08813) 231575
.30/-
రామజోగి చిట్కాలు
స్వామి సుందర చైతన్యానంద
సహగామి
ఆహారం దొరక నపుడు ఎలా సంపాదించుకోవాలి? అనే ప్రశ్న మనిషిలో పుడుతుంది. తినేందుకు పుష్కలంగా ఉన్నప్పుడు ఎందుకు తినాలి? అనే ప్రశ్న ఎవరికీ ఉద్భవించదు.
ప్రాణం పోయే సమయంలో నే నెందుకు మరణించాలి? మరి కొంత కాలం నేను ఈ ప్రపంచంలో మనుగడను సాగించలేనా? అనే ప్రశ్నలు మనిషిలో కదుల్తాయి. కాని, బ్రతుకును కొనసాగించే కాలంలో నే నెందుకు జీవించాలి? ఇప్పుడే ఎందుకు మరణించకూడదు? అనే ప్రశ్నలు ఎవరికీ స్ఫురించవు.
మనిషికి ఏదో కావాలి. అది లేనపుడు ఎన్ని ఉన్నా లేనట్లే ఉంటుంది. అదేమిటో అందరికీ అర్థం కాకపోయినా, అందరూ దాని కొరకే బ్రతుకుతున్నారు. బ్రతుకులో తీపి అదే. మరణంలో చేదు కూడా అదే.
తెలియవలసింది తెలియ నపుడు ఎంత చదివినా, ఎన్ని తెలుసుకున్నా, నా కేదో తెలియడం లేదు అనే వెలితి గుండెల్లో ఒక మూల దాగే ఉంటుంది. బ్రతుకుతున్న
వాళ్ళందరూ హాయిగా బ్రతకలేక పోవడానికి గుండెల్లో పుట్టే ఈ గోకుడే ప్రధాన కారణము.
అలా కాకుండా ఉంటే,
చెట్టు లాగా ఊగుతూ మనిషి చల్లగా జీవించగలడు. పక్షి లాగా తేలికగా ఈ ప్రపంచంలో తిరగగలడు. లేడిలాగా గంతులేస్తూ విహరించగలడు. కొండ లాగా గుండె నిబ్బరంతో బ్రతకగలడు.
మరి అదేమిటి?
అదే తెలియాలి. తెలియడం జ్ఞానము. జ్ఞానము అందరికీ కావాలి. అజ్ఞానాన్ని భరించే సహనం ఎవ్వరికీ లేదు.
జ్ఞానమైతే మనిషికి కావాలి. ఆ జ్ఞానము అల్పమైతే, స్వల్పమైతే మళ్ళీ గుండెల్లో గోకుడు తప్పదు. జ్ఞానం కావాలి. అట్టి జ్ఞానము అనంతంగా ఉండాలి. ఏది
తెలిసినా, తెలియనిది అంటూ ఉండే టప్పుడు ఆ జ్ఞానం అనంతం కాదు. అనంతం అర్థమైతేనే ఆనందం పూర్ణ మౌతుంది.
అనంతంలో ఏవో లేవు. అన్నీ ఉన్నాయి. ఈ ప్రపంచంలో అన్నిటికీ అన్నిటితో సంబంధం ఉంది. మనమూ ఉన్నాం. వాటితో మనకూ సంబంధం ఉంది. ఆ సంబంధాల తోనే బ్రతుకుతున్నాం. అర్థం చేసుకొని బ్రతక గలిగితే, ఏ గోకుడు
లేకుండా అనంతం వైపు ప్రాకిపోగలం. అర్థం కాకుండా బ్రతుకును సాగదీస్తే అడుగడుగునా మడుగులే కనిపిస్తాయి.
ఇక్కడ, ఈ విశ్వంలో,
ఏది ఎందుకు జరుగుతుంది? తినడం, త్రాగడం, తిరగడం, తిట్టడం, తిప్పలు పెట్టడం, అప్పులు చేయడం, ఆర్జించి కుప్పలు పోయడం, తెలిసి తెప్పలు తగ లేసుకోవడం, చేసిన తప్పులే చేయడం, ముప్పులు కొని తెచ్చుకోవడం, గొప్పలకు గుంజాటన పడటం, డప్పులు వాయించుకోవడం, రొప్పుతూ నొప్పులు పడటం - ఎప్పుడూ ఉప్పులు తింటూ నీళ్ళు నములుతూ బ్రతకడ మేనా?
ఏమిటి ఈ నాటకం? ఎక్కడ దీనికి చరమాంకం?
ఈ ప్రశ్నలు కూడా నాటకం లోనే ఉన్నాయి. నడిపే దెవరో తెలిసి రానంత వరకు ప్రశ్నిస్తూ నడవటమే. నడక ఎవరికీ తప్పదు. నడవనిదే గడవదు. గడవనిదే అనంతం గడప తెలియదు.
ఈ ప్రయాణము సుదీర్ఘమే. దారి చక్కగా తెలిసి నడిస్తే సునాయాసంగా పయనం సాగుతుంది. అనాయాసంగా అనంతం సిద్ధిస్తుంది.
బాటలోనే అందరమూ ఉన్నాం. అందరమూ బాటసారులమే. బాటలో ప్రయాణం పాటలా హాయిగా సాగాలి. ఓడలా తేలుతూ పోవాలి. అడ్డుగోడ లొస్తే ఎదురొడ్డి, ఎదనొడ్డి గాయపడటమా? తెలివిగా తప్పుకొని ముందుకు సాగడమా? అది కూడా తెలియాలి. అంతే కాదు. మరెన్నో, ఎన్నెన్నో తెలియాలి. ఇదంతా దారి
బత్తెము.
చక్కని దారిని చూపుతూ, మార్గంలో చిక్కులు పడకుండా, చిటికె వేసి చిట్కాలు అందించే వ్యక్తి బాటలో తోడుగా ఉంటే, ప్రయాణంలో ప్రయాసలు ఉండవు. ప్రమ ఉన్నచోట ప్రమోదాలే గాని ప్రమాదాలు ఉండవు.
ఆ పని చేసేందుకు, తోడుగా నడిచేందుకు, మలుపులు అందంగా త్రిప్పేందుకు, మల్లెల మాటలను తేనెల పాటలుగా మలచి దారి బత్తంగా ఈ పుస్తకాన్ని
అందిస్తున్నాం. ఒక మంచి మార్గగామిని తోడుగా పంపుతున్నామని తృప్తి చెందుతున్నాం.
పాటలుగా పుస్తకంలో
శబ్దంగా ఆడియోలో
శబ్దంగా, దృశ్యంగా వీడియోలో
మీ తోడు ఉండే ఈ మార్గగామి రామజోగి. మార్గంలో
మీకు ఉపకరించే ఎన్నో చిట్కాలు అతని వద్ద ఉన్నాయి.
అవే రామజోగి చిట్కాలు. అడిగితే అందుతాయి. అడుగు ముందుకేస్తే అందాలు చిందుతాయి. ఆనందాలు విందు చేస్తాయి.
వెళ్ళిరండి. మేమూ వస్తాము. అనంతంలో మళ్ళీ
కలుస్తాము.
********************************************
రామజోగి చిట్కాలు
(1) మాయామయము జగమంతా
మమకారాలే మనసంతా
ఉన్నది చూడరు ఎవ్వరైనా
లేనిదే చూస్తారు ఎప్పుడైనా
ఉన్నది బ్రహ్మము లేనిది జగము
తెలిసే దెపుడు ఈ నిజము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(2) అందరి గమ్యము ఒకటే అయినా
మార్గము లన్నీ ఒకటేనా?
చూపు లందరివి ఒకటైనా
చూచే తీరు వేరు కదా!
జ్ఞానము కలిగి చరించే వారికి
సర్వము ఈశ్వరమయము కదా!
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(3) నదులు ఉన్నవి ఉన్నవి గిరులు
నరులు మృగాలు వనములు తరువులు
ఉన్నవన్నీ పోయిన నాడు
మిగిలిన దేదో సత్యమదే
అన్నీ పోయినా ఉండును దైవము
అతని స్మరణమే శుభకరము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(4) ఉంటే ఏమి? అంటక పోతే
మంటలు మాయలు మనిషికి లేవు
ఎక్కడ లేదు ఆకాశము
అంటుట కిప్పుడు అవకాశము
ఆత్మ ఎప్పుడూ అసంగము
ఎందుకు నీకు గుణసంగము?
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(5) ఉన్నది ఏమిటి? లేనిది ఏముంది?
నీటి బుడగ ఈ జీవితము
ఆడి కొన్నాళ్ళు పెళ్ళాడి కొన్నాళ్ళు
బిడ్డలతో కొన్నాళ్ళు బాధలతో
పెరిగిన దేహము కాష్టము పాలు
తరిగిన మనసు మరుజన్మకు పెరుగు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(6) ఆది ఎక్కడో తెలిసిరాదు
అంత మెప్పుడో తెలియదు
నడుమ అన్నీ మరపులే
క్షణక్షణానికి మార్పులే
ఏది ఉండునో ఏది ఊడునో
తెలియని జగతి శోకమయం
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(7)ఆశ ఉంటే కలదు నిరాశ
కల గంటేనే కలవరము
శ్వాస లాగినా ఆశలు పోవు
అంటి ఉంటాయి మరుజన్మకు
ఆరే మనిషికి పాశము
బ్రతుకును త్రుంచే యమపాశము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(8) ఏడిపిస్తాయి వాసనలు
వేడుక నిస్తాయి ఉపాసనలు
అశాంతికి రూపాలు వేదనలు
శాంతికి మార్గాలు సాధనలు
శోకము రోగము అతి దారుణము
నామామృతమే ఔషధము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(9) భానుని వెలుగు గువ్వకు పిలుపు
తెలియని గూబకు దివి నలుపు
బ్రహ్మమయము విశ్వము సర్వము
తెలియని వానికి భ్రమమయము
గలగల పారును నదిలో జలము
గతుకుట మానదు శునకము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(10) నాడు ఉండినది నేడు ఉన్నది.
రేపు ఉండునది ఉండదగినది
అది ఇది కానిది అద్భుతమైనది.
అన్నిటికీ ఆధారమైనది
ఆరని దీపము అఖండము
జీవుల గమ్యము చైతన్యము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(11) మనిషే కాదు చీకటిలో
ఛాయ కూడా కనబడదు
మహిమే కాదు మోహములో
మాయ కూడా కనిపించదు
వెలుగుల లోనే విచారము
తానే వెలుగును వివేకము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(12) మతి గలవాడే మానవుడు
మతి పతియైతే వానరుడు
అంతా మతి యైతే శ్రుతి ఎందుకు?
శ్రుతి ఉంటేనే యతి ముందుకు
మాయలే మతికి రాస్తాలు
మహిమలు శ్రుతికి నేస్తాలు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(13) ఆద్యుడు ఎవరో తెలియని నాడు
ఆలయమే మనకు ఆశ్రయము
అనంతుడు తానని తెలిసిన వాడు
ఏది కాదు ఆలయము?
విశ్వమంతా సుందరము
ఏది చూసినా శివమయము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(14) ఎక్కడో లేడు దేవుడు
నీ లోనే నీకు తోడున్నాడు
భక్తి ఉంటే పలుకుతాడు
జ్ఞానము ఉంటే కనిపిస్తాడు
దయగా హృదయంలో ఉంటాడు
దారి చూపుతూ నడిపిస్తాడు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(15) గిరగిర కాలము తిరిగినా
తెగదు జీవేశ్వర బంధం
ఆయువు వాయువు ఎంత వీచినా
ఆరదు ఎన్నడు అమరదీపం
అనంతమైనది ఆత్మస్వరూపం
మధురం మధురం అతి మధురం
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(16) బ్రతుకు పువ్వు కావాలి
పువ్వే నవ్వుగా రావాలి
పలుకులు కావాలి పూలరేకులు
కమ్మని భావాలు పరిమళాలు
సుమ సౌందర్యమే జీవనము
నిత్యానందమే మకరందము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(17) బ్రతుకు ఆశ మరణ భయము
తొలగిన వారే మహాత్ములు
భేదబుద్ది లేని వారికి
ఎవరున్నారు శత్రువులు?
కట్టెలో అగ్ని కట్టెనే కాల్చును
పాపము పాపిని దహించును
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(18) తొమ్మిది ద్వారాలు తనువుకు
నోరే ద్వారము తగవుకు
కావాలి నోరు మంచిది ఊరు
ఆగును పోరు అశాంతి తీరు
పోరు నష్టము పొందు లాభము
మనసుకు విందు పెద్దల వాక్యము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(19) మోపే వారు నిందలు ఎందరో
మోసే వాడివి కాబోకు
కాకి కూతలు ఎవరికి మధురము
కోకిల రవమే కమనీయము
సహనమె సంపద పగయే ఆపద
సద్గతి కిదియే సోపానము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(20) పిలిచిన వారికి పలికేవాడు
వలచిన వారికి వెలు గతడు.
భయమును తలచి భయపడకు
భగవంతుని పిలిచి పద ముందుకు
ఎన్నో దిక్కులు అందరికీ
దేవుడే దిక్కు భక్తునికి
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(21) దయిత లెందరో దశరథరాజుకు
జానకి ఒకతే శ్రీరామునికి
పెద్దల గుణాలు అనుసరణీయాలు
దోషాలు కావు అలంకరణాలు
గుణదోషాలు లేని దేవరికి?
నిర్దోషము సాధ్యము భగవంతునికి
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(22) అమృతము వంటి ఔషధమైనా
పథ్యము చెడితే విషమయము
ఎంత చదివినా ఎన్ని నేర్చినా
వినయము చెడితే వికృతము
ఫలవృక్షాలు వంగును క్రిందికి
మేఘజలాలు జారును అవనికి
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(23) ఏది నచ్చదో ఇతరులు చేసిన
అది ఇతరులకు చెయ్యబోకు
ఇతరులు ఏది చేసిన సుఖమో
అది ఇతరులకు చేసి చూపు
బాగు తెలిసి బ్రతుకుటయే
మహాభారతములో సారము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(24) వెతల వైపు నడవకు
నడిచొచ్చిన వెతలకు జడవకు
ఆశల వలలో చిక్కకు
ఆపద లొచ్చిన జంకకు
పట్టిన పాదము విడువకు
పలికిన నామము మరువకు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(25) శోకమయము లోకము
అనుభవించుటే మానవజన్మము
ఆశించడము నిరాశ చెందటము
గుండెలు పిండుతు బ్రతకటము
లోకము కాదు స్థిరవాసము
సొంతము తెలియుట శాంతము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(26) వచ్చినదెపుడో తెలియదు ఎవరికి
పోయే రోజుందని తెలియనిదెవరికి?
దారాసుతులు ధన దాయాదులు
కలిసి రాలేని రోజు అది
మట్టిలో కాయము కలవాలి
తోడొచ్చే దేమిటో తెలియాలి
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(27) సంపదలు కావాలంటారు
ఆపదలు రాకూడ దంటారు
లేనివి రమ్మంటే వస్తాయా?
కానివి వద్దంటే ఆగుతాయా?
చేసిన పుణ్యాలే చెబుతారు
పాపాలను దాచి పెడతారు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(28) పతి పుణ్యంలో సతికి సగం
పాపం రాదు సగ భాగం
వెలగాలి అందుకే పతిదైవం
నిలవాలి కుటుంబం ఆదర్శం
మూడు గుణాల ముడులు త్రెంచుటకు
ముడి పడ్డాయి మూడుముళ్ళు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(29) కులము జాతి సిరిసంపదలు
నిలకడ కావు మనతో రావు
గుణమే కులము సమతే జాతి
మానవతే మనిషికి నీతి
ధర్మము తప్పిన దానవులు
నోచుకోరు దైవ కరుణకు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(30) బ్రతుకంతా రోదన ఆయె
సాధన సాగే క్షణమేది?
వెలుగు లన్నీ వెతలాయె
వేదన తీరే దారేది?
పరుగిడు కాలం ఆగదు
సాధన తెలిసి సాగాలి
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(31) దండ వేసినా దండాలనినా
రోజూ పూజలు చేసినా
మనసు లేని స్మరణము
మనిషికి కాల హరణము
భావము లేని హృదయము
దేవుడు లేని ఆలయము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(32) మంచి కానిది మాయ మైనది
చెరిగి పోవునది భవ బంధము
ఒరిగి పోనిది కరిగి పోనిది
తరగనిది భక్తి అందము
భవబంధాలు భయ రూపము
భక్తి అందాలు అభయము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(33) బ్రతుకే ఒక నాటకము
నడిపేవాడే నాయకుడు
పాత్ర పోషణే నటనంతా
స్వేచ్ఛ లేనిదే పలుకంతా
తెలిసి కులికితే పొర తొలగు
తెలియకనే తెర మరుగు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(34) ఎత్తిన జన్మలు ఎరిగిన కర్మలు
మోసిన బరువులు ఎన్ని యని?
దించుకొనుటకే ఈ జన్మము
తల వంచి దించుటే కర్తవ్యము
తెంచుకోవాలి అజ్ఞానము
నింపుకోవాలి విజ్ఞానము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(35) కాలంలో ఎవరు మిగలరు
కోరిన వన్నీ జరగవు
జీవిత కాలము అతి స్వల్పము
జీవికి ఆశలు పెను భారము
ఆశలు లేని వారే లేరు
ఆశ లెన్నడు తీరేవి కావు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(36) నీవు నే నను భేదాలు
ఉర్వి లోన ఉత్సవాలు
ఊపిరి ఆగి ఊరేగిన నాడు
ఉండవు కాటిలో తేడాలు
పోయిన నాడు ఉండనివి
పోనపుడు ఎందుకు ఉన్నవి?
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(37) నిలవదు ప్రాణము దేహములో
తరగదు ప్రేమ దైవములో
ప్రాణము పోసేది దైవము
పారబోసేది దేహము
దేహము లోనే చిత్తము
చిత్తము లోనే దైవము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(38) కల లున్నాయి అంధునికి
కలవర ముంది అందరికి
కళ్ళున్నాయి మూత పడుటకు
మనసుంది మూగ బోవుటకు
ఉన్నవి ఉండవు కలకాలం
కాలము కదిపే మాయాజాలం
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(39) చీకటి ముసిరిన చింతల నడుమ
ఆడిన ఆటలు చాలవా!
మృత్యుపాశము వెంట నున్నది.
సత్యమార్గమును గనలేవా?
తెర పడిందా తనువే లేదు.
మర్మము నెరిగి సాగిపో
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(40) కంటిలో పాపను నిలిపిన వాడే
ఒడలును వేడిగా ఉంచాడు.
నొసటి రాతను వ్రాసినవాడే
చేతికి వ్రాతను నేర్పాడు
ఊపిరి పోసిన ఉమానాథుడు
గుండెను గుడిగా మలచాడు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(41) వచ్చేనాడు తల్లి ఒక్కతె
మోసెను సులువుగ నవమాసాలు
పోయేనాడు నలుగురు చేరి
బరువుగ మోయాలి తనువును
బ్రతికి పెంచింది బరువేనా?
జ్ఞానము జీవికి కరువేనా?
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(42) మోసము తెలియదు మోసముగా
వంచన అగుపించు మంచిదిగా
సాధువుగా లంకేశుడు
పసిడి లేడిగా మారీచుడు
మాటల వెనుక మర్మములు
మహిలో ఎన్నో మోసాలు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(43) ఎవరో మెచ్చాలని భావిస్తే
అక్కడే ఘర్షణ ఆరంభము
ఒకరిని మరొకరు నచ్చకపోతే
నచ్చని మనసే నొచ్చుకొను
నీకు నీవుగా తృప్తిపడాలి
అదియే జీవన సౌందర్యము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(44) శివుని ఆనతి లేనిదే
కుట్టదు ధరణిలో దోమైనా
చేసిన పుణ్యము లేకుంటే
పుట్టదు శివునిపై మనసైనా
లేనిది ఎప్పుడు దరి రాబోదు
ఉన్నది ఎన్నడు దూరము కాదు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(45) ఆశ నిరాశల ఊయలలో
ఊగింది మనసు ఉసూరు మంటూ
ఆశే లేని జీవికి
ఉండదు నిరాశ ఎన్నటికి
ఆశ ఉంటే ఉండనీ
శివుడే ఆశలో నిండనీ
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(46) ఈ జగతి ఒక రంగస్థలము
నటులు ఎందరో ప్రేక్షకు లందరు
పెట్టిరి బాధలు బాధలు పడిరి
వేడుక చూచి ఎటకో ఏగిరి
తరలి పోయిరి తనువులు విడిచి
వేదిక వెలిగె మరో ఆటను వలచి
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(47) అందరు బ్రతికే ఇల ఒక్కటే
ఎవరికి వారి కల ఒక్కటే
ఏ కల అయినా ఇల లోనే
కల బొమ్మలు కదిలేది తెర పైనే
మేలుకొన్నచో కరుగును కలలు
తెరను చూచితే తొలగును బొమ్మలు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(48) ఏ పువ్వులో తేనె ఉన్నదో
తెలియనిదా మధుపము!
ఎవరి కుండలో వెన్న ఉన్నదో
తెలియని వాడా కృష్ణయ్య!
మనసు వెన్నగా మారిననాడు
మన వెంటే మాధవుడు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(49) రాయబారిగా కృష్ణుడేగినా
కురురాజు మనసు కరిగినదా
సుయోధనుడు సున్నితమైతే
రణరంగానికి తావుందా!
కయ్యము లేని కురుక్షేత్రమున
గీతామృతము దక్కేదా!
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(50) వానలు కురియును వేసవిలో
మాణిక్యము లుండును మట్టిలో
ఎప్పుడు ఎవరికి ఏది జరుగునో
ఎవరికి ఏది ఎప్పుడు లభించునో
తెలియునా చేసే వానికి
తెలియకుండునా చేయించే వానికి
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(51) వికారి నైనా బికారి నైనా
ఈసడించదు దర్పణము
పేదనైనా పామరు నైనా
పారద్రోలదు దైవము
దైవమే మనిషికి శరణము
తెలియని నాడే మరణము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(52) సర్వము సర్వేశ్వరుడే అయినా
కృష్ణుడు దైవము - కంసుడు అగునా!
ఉన్నతాలలో ప్రథమోపాసన
ప్రగతికి సుగతికి ఆధారము
విశిష్టమైనది ఈశ్వర మహిమ
విభూతి సుందరుని వైభవము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(53) ఆలోచనలు ఎన్నో ఉన్నవి
చేసేవాడు ఒకడేలే
ఏ ఆలోచన దేని కదే
ముడిపడి మనసున ఉన్నవిలే
అదియే అందము ధర్మబంధము
తెలిసి బ్రతికితే ఆనందము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(54) జీవ కణాలు ఎన్నో జీవిలో
జీవ మొక్కటే ప్రతి జీవిలో
దేహములో కణముల సహకారము
విశ్వములో అణు వణువున ధర్మము
వ్యక్తి లోనే విశ్వము ఉన్నది
ధర్మము లోనే దైవము ఉన్నది
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(55) కాశి గంగలో కాయ విడిచితే
కైలాసము క్రిందికి దిగి రాదు
కాయముపై మమకారము తొలగితే
కన్నుల ముందే కైవల్యము
న్యాయము తెలిసిన త్యాగములో
పండును బ్రతుకు ఇది సత్యము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(56) జ్ఞానికి జగతి మధుకలశం
అజ్ఞానికి పుడమి విషవలయం
శృతి చేస్తేనే వాయిద్యం
శ్రుతి విజ్ఞానమే వైభవం
శ్రుతియే జ్ఞానం మతియే మాయ
శ్రుతి జ్ఞానంతో మాయము మాయ
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(57) ఎండిన బావి నిండుతుంది
విరిగిన మాను చిగురిస్తుంది.
వాలిన పొద్దు ఉదయిస్తుంది
తీరిన ఆకలి తిరిగొస్తుంది
రాలిన పువ్వు విరబూయదు
కాలిన మాయ వికసించదు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(58) జీవాత్మ ఒకటి వేరుగా ఉంటే
విశ్వాత్మ ఎవరికి తెలిసేది?
జీవాత్మ విశ్వాత్మ ఒకటైతే
జీవాత్మకు వేరుగా విశ్వమేది?
జీవుడైనా విశ్వమైనా
ఆత్మకు అన్యము కాలేవు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(59) నింగి నేల వేరైనా
నేలకు నింగి దూరమౌనా?
మహిమ మనిషి వేరైనా
మనిషికి మహిమ వేరగునా
మహిమతో మనగలిగిన నాడు
మనిషే మహిమ మహిలోన
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(60) మోక్షము కూడా క్షరమైతే
దానిని పొంది ఫలమేమి?
అక్షరమై అది స్థిరమైతే
పొందే యత్నం ఎందుకని?
పోయేది లేదు వచ్చేది కాదు
ఉన్నది ఉన్నట్లు తెలియాలి
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(61) వస్తు వొక్కటే వెలుగు ఒక్కటే
చూచే కళ్ళు రెండున్నాయి
సత్య మొక్కటే జ్ఞాన మొక్కటే
దృగ్దృశ్యములు రెండైనాయి
ఎన్ని ఉన్నా కల ఒక్కటే
మేలుకొంటే తానొక్కడే
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(62) సమస్యలు ప్రపంచానివి అయితే
నీ కెందుకు పరిష్కారాలు?
నీవే నీకు సమస్యగ మారితే
నీకు సమాధానం నీవే కదా!
ఆరాటాలు పోరాటా లెందుకు?
అవలోకించి శాంతించు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(63) నిప్పు పెట్టిన వ్యక్తిని అయినా
ముట్టినచో నిప్పు కాల్చును
ధర్మము విడిచి చరించువారికి
లభించదు దేవుని కనికరము
ధర్మము నందే వైభవము
తప్పిన ధర్మము వైకల్యము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(64) పలికే మాట మనిషికి ఉంది
మాట వెనుక మనసుంది
మనసును దోచిన మాధవుడే
మనసుకు మనసై వెలిగాడు
దాగుడుమూతల దామోదరుడు
యెదలో ఒదిగి నిలిచాడు.
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(65) వెలుగు నీడ - పగలు రేయి
సంపదల వెనుక ఆపదలు
పగిలేది కుండ వాడేది దండ
చితుకును బ్రతుకు అతక కుండా
పోయే వాటిని పారిపోనీ
ఉండే సత్యము వెలగనీ
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(66) నిన్నటి విషయము యోచించాలన్నా
నేడు ఇక్కడే చేయాలి
రేపటి మాట చర్చించాలన్నా
ఇక్కడే ఇప్పుడే జరగాలి
గతము రాదు భావి తెలియదు
వర్తమానమే వినియోగము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(67) మాట వినని మనసును
నియమిస్తేనే యోగము
మనసే మనసును నియమించునా
విలపించే శిశువే లాలించునా?
తిరిగే మనస్సును తిరగనీ
చూస్తూ సాక్షిగా ఉండిపో
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(68) చేయక తప్పవు కర్మములు
చేసి చూడాలి ఫలములు
అనుకూలములు సుఖములు
ప్రతికూలములు శోకములు
రాగద్వేషాలే సందడులు
రాలిననాడు పండుగలు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(69) అవసర మందరికి ఆచారము
లోపల సాగాలి విచారము
విచారము లేని ఆచారము
విప్పి చూడ అనాచారము
చేనుకు కంచే సదాచారము
పైరు పెట్టుటే సమాచారము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(70) పువ్వుకు రంగును నీటికి రుచిని
నిప్పుకు కాంతిని ఇచ్చిన దేవుడు
అన్నిట తననే చూడమని
సర్వము తానుగా మారాడు
ఎన్నున్నా తనన్నిటిలో
పువ్వులో తావిగా ఉన్నాడు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(71) వినిన చెవులు వినపడవు
వినాలనే భ్రాంతి విడిపడదు
చూచిన నేత్రాలు పోయాయి
చూడాలనే ఆత్రము పోలేదు
తినిన పళ్ళు ఊడినవి
తినాలనే ఆశ వీడలేదు
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(72) కాలము లేదు ధ్యానములో
ధ్యానము నిలవదు దేశములో
ధ్యానములో దైవము ఉంటే
దైవము లోనే ధ్యానము
మరపు లేక మనుగడ సాగితే
జీవన మంతా ధ్యానమయం
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(73) పలుకుట తెలియని అవివేకి
పలవరిస్తాడు విస్తారముగా
పలుకుల మర్మము తెలిపే జ్ఞాని
ప్రవచిస్తాడు విపులముగా
రెండూ కాని సామాన్యుడు
మితముగా పలకాలి హితముగా
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(74) జాలి లేక ఈశ్వరుడు
పిలిచినా రాడని అభియోగము
గాలి రూపమున దేవుడు
ఉన్నాడని తెలియుట భాగ్యము
గాలి ఏమిటి జాలి కాదా!
గాలి పోగా బ్రతుకు ఖాళీ కాదా!
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
(75) తెగని బంధములు తీరని ఋణములు
వీడని మమతలు కలతల కలలు
వగచిన ఆగదు వలచిన మరణము
మునిగే ఓడలు చేర్చవు తీరము
పరిణామశీలము ప్రపంచము
పూర్ణానందమయము పరమార్థము
రామ రామ జయ రాజారామ్
రామ రామ జయ సీతారామ్
******************************
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.