“ శ్రీకృష్ణుడు మురళిని ఎందుకు వదలడు “
శ్రీ శ్రీ శ్రీ స్వామి విద్యాప్రకాశానంద గిరి - “కథా ఫలే”
శ్రీ కృష్ణమూర్తి తన నిత్యజీవిత వ్యవహారమందు అనేక వస్తువులను ఉపయోగించుకొనుచున్నను, ఒకవస్తువును మాత్రము నిరంతరం తనవద్దనే ఉంచుకొనుచుండెను.
అదియే మురళి,దానిని శ్రీ కృష్ణుడు ఏకాలమందును వదలక అహర్నిశము తన చెంతనే పెట్టుకొనుచుండెను.
కొద్ది సేపు ఆహ్లాదకరముగ, శ్రోతలు తన్మయులగునట్లు ఆ మురళిని వాయించి, తదుపరి ఆ పిల్లనగ్రోవిని తన చెవి పైననో, బొడ్డునందో దోపుకొనుచుండెను.
అంతియేకాని ఆ మురళిని దూరముగ ఎన్నడును
ఉంచుటలేదు. ఈ పరిస్థితి రుక్మిణీదేవి గమనించి ఒకప్పుడు తనలో నిట్లు వితర్కించుకొనెను- ఈ పిల్లనగ్రోవి నిరంతరము శ్రీ కృష్ణునకు అతి సమీపముగ వర్తించుచున్నది. శ్రీ కృష్ణుడు దానిని వదులుటలేదు.దానిపుణ్యమేమియో!
సతతముశ్రీకృష్ణునిసాన్నిధ్యశ్రీనిఅనుభవించుసౌభాగ్యములభించుట సామాన్యమా?ఎన్ని జన్మముల తపఃఫలితమో అది. నేను కూడ శ్రీ కృష్ణునకు ఒకింత దూరముననేయున్నాను గాని అంత సమీపమున లేను, నాకంటె మురళి ఎంతో సన్నిహితత్వమును అనుభవించుచున్నది.
భగవంతుడు దానిని వదలుటలేదు. ఆహా! ఎంతటి అదృష్టము!అట్టి సద్గతి లభించుటకు ఏమి పుణ్యము చేయవలెనో?నిరంతర శ్రీ కృష్ణసాన్నిధ్యభాగ్యము కలుగుటకు ఎట్టివ్రతములనాచరింపవలయునో ఏ విధమైన తపము సల్పవలయునో! మురళి ఈజన్మములో ఈ ప్రకారముగ శ్రీకృష్ణునకు అతి సన్నిహితముగ రాగల్గుటకు పూర్వజన్మ పుణ్యమే కారణమై ఉండును.కాబట్టి ఆ పుణ్యమేదియో తెలుసుకొనినయెడల నేనుకూడ ఈ జన్మలో అట్టి పుణ్యమాచరించి భావికాలమున ఆ లోకైకప్రభువునకు ఇంకను సమీపముగ వర్తింపగల్గుదును'. ఈ ప్రకారము చింతనచేసి రుక్మిణీదేవిఆ మురళితో తద్విషయమును గురించి చర్చించుటకై సమయము కొఱకు వేచియుండెను.శ్రీ కృష్ణుడు ఆ మురళిని ఎపుడైన దూరముగ పెట్టియుంచినచో అపుడు దానితో ఏకాంతముగ మాట్లాడిఅన్నియు తెలిసికొనవచ్చునని తలంచుచుండెను.రుక్మిణి యొక్క ఆంతర్యమును గ్రహించి శ్రీ కృష్ణుడొకనాడు తాను నిదురబోవుచున్నట్లు నటించి ఆ
మురళిని దూరముగ విసరివైచెను.సమయము కొఱకు నిరీక్షించుచున్న రుక్మిణీదేవితక్షణమే దానిని తీసుకొని ఒకానొక ఏకాంతస్థలమునకరిగి, దానికి ప్రాణ ప్రతిష్ఠచేసి మాట్లాడు శక్తిని ప్రసాదించి దానితో నిట్లు సంభాషించెను.
"ఓ మురళీ! నీవు పూర్వజన్మలో ఏమిపుణ్యము చేసి
నావు? ఏయే వ్రతములను సలిపినావు? ఎట్టి దానధర్మాలను కావించినావు? ఏయే తీర్థములను సేవించినావు? ఏ దేవతలనారాధించినావు? ఈ జన్మలో నీవు జగత్ర్పభువైన శ్రీ కృష్ణుని దివ్యసాన్నిధ్య శ్రీని నిరంతరము అనుభవింపగల్గుట పూర్వజన్మలో నీవు చేసిన అలౌకిక పుణ్యము యొక్క ప్రభావమే యగును.
కాబట్టి ఓ మురళీ!ఆ పుణ్యకార్యములేవియో ఇపుడు
నాకు తెలియజేసినచో నేనును వానిని ఆచరించి నీవలెనే శ్రీ కృష్ణునకు అతి సమీపమున చేరగల్గుదును. సంతతము అతని సాన్నిధ్యభాగ్యమును అనుభవింపగల్లు
దును. కావున తొందరగా చెప్పుము. నీవు పూర్వజన్మములో ఏమిపుణ్యము చేసినావు?"
రుక్మిణీదేవి యొక్క యా పలుకులను విని మురళి-
"అమ్మా నాకేమీ తెలియదు.పుణ్యమును గురించి గాని, పాపమును గురించి గాని పరిజ్ఞానము నాకి సుమంతైనను లేదు. అసలు పూర్వజన్మలో నేనెవరనో కూడ నాకు తెలియదు. క్షమించు తల్లీ!" అని సమాధానము చెప్పగా, రుక్మిణీదేవి అందులకంగీకరింపలేదు.
ఏదియో మహత్తర పుణ్యమును అది ఆచరించియే
యుండునను నమ్మకము రుక్మిణీదేవికి కలదు.
అందుచే మరల ఆమె ఆ మురళిని ఆ విషయమై నొక్కి ఎందుకు వదలడునొక్కి ప్రశ్నింప,చివరకు ఆ మురళి- "అమ్మా! నా స్వరూపమెటువంటిటో ఒక్కసారి చూడుము! నా లోపల ఏమియున్నదో బాగుగ పరికింపుము. తదుపరి నీకే తెలియగలదు" అని సమాధానమిచ్చెను.
వెంటనే రుక్మిణీదేవి ఆ మురళిని పైకెత్తి లోన ఏమియున్నదో జాగ్రత్తగ పరీక్షించెను.కాని ఆ మురళి లోపల ఏమియులేదు. వట్టి ఆకాశము (Vacuum) మాత్రము గోచరించెను.
అపుడు రుక్మిణీదేవి మురళితో-
"అమ్మా! నీ లోపలచూచినాను.ఏమియు లేదు. కేవలము ఖాళీగనున్నది"అని పలుక అంతట మురళి "ఆ ప్రకారము నాలో ఖాళీగఉండుటయే నాయొక్క విశేషము.నాలో ఏవిధమైన సరుకును నేను పెట్టుకొనలేదు.
వస్తుజాలమునంతటిని పరిత్యజించి నాయంతరంగమును దృశ్యరహితముగ నొనర్చుకొంటిని.కనుకనే నేను శ్రీ కృష్ణునకు సన్నిహితుడనైతిని. నా వలెనే ఎవరైనను సరియే తమ యంతఃకరణమునందలి వాసనాజాలమును, దుస్సంస్కారములను, ప్రాపంచిక విషయసంకల్పములను తొలగించి వైచి, మనస్సును నిర్విషయముగగావించి నిస్సంకల్పస్థితిని బడయుదురో అట్టివారు భగవంతునకు అతిసమీపముగ వర్తింపగల్గుదురు. మనశ్శుద్దియే అంత:కరణము యొక్క నిర్మలత్వమే దైవప్రాప్తికి
హేతువు"- అని గంభీరముగ పలికెను.
మురళి యొక్క ఆ హేతువాద సమన్విత వచనము
లను విని రుక్మిణీదేవి పరమానందభరితయై తన
యంత:కరణమునుగూడ ఆట్లు సునిర్మలమొనర్చుటకును, నిస్సంకల్పముగ, చిదాకాశమయముగ గావించుటకును మనసున నిశ్చయించుకొనెను.
భగవత్రాప్తికి మనోనిర్మలత్వమే ఏకైక కారణమని
ఈ ఇతిహాసం ద్వారా స్పష్టమగుచుండుటవలన
ముముక్షువులు తమచిత్తశుద్ధికై తీవ్ర కృషి సల్పి ఈ జన్మమునందే దైవసాన్నిధ్యాన్ని అనుభవించుదురుగాక! .*********
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.