INTERNET ARCHIVE ORG video download link : click here
చైతన్య మాలిక
రాతలు తలల నుండే కదుల్తాయి. కొన్నిరాతలు తలలను కదుపుతాయి. కుదుపుతాయి.
పొదుపుగా కొన్ని పద సుమాలతో ఉక్తులు అవుతాయి. స్పూర్తి పరిమళాలను తోడు
చేసుకొని సూక్తులవుతాయి. మనసులో విరబూసిన విజ్ఞాన చేమంతులే సూక్తులు.
అందమైన భావ జగత్తులో చేతనత్వముతో చలించే చేమంతులు. చైతన్య చేమంతులు.
'నిక్కమైన మంచి నీల మొక్కటి చాలు'అని గుండెలను కరిగించలేని రాతి బండలను
ఒక కవి విసిరివేస్తే,'గంగి గోవు పాలు గెరిటెడైనను చాలు' అని హృదయంలో అమృత
బిందువులను చిందించే రస గుళికలను మరొక కవి ఏరి దాచుకున్నాడు.
మనసులో రణం లేకుండా జీవించుటకు మరణం లేని మాటలను చేమంతి మాలగా తీర్చిదిద్దిన చైతన్య పొత్తము ఈ 'చైతన్యచేమంతులు' పుస్తకము.
అప్పుడప్పుడు, అలా అలా నా మనసులో కులికినవి, వేదికలపై నేను పలికినవి ఈ
పుస్తకంలో సూక్తులుగా ఉన్నాయి. ఇందులో ఉన్నవన్నీ పలుకులే అయినా,
గొప్ప పలుకుబడిని కలిగి ఉన్నాయి. ఈ సూక్తులన్నీ అర్థం చేసుకొని
ఆచరించేందుకే ఉన్నాయి. అన్నీ కాక పోయినా, కొన్ని అయినా బ్రతుకులో తొంగి
చూస్తే,జీవితంలో క్షోభ తగ్గుతుంది. జీవిలో శోభ పెరుగుతుంది. ఇవన్నీ చేమంతులు.
చైతన్య చేమంతులు. పూస గుచ్చి, మాలగా తీర్చి శ్యామసుందర భగవానుని
అలంకరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇక మనం చేయదగిన, చేయవలసిన కార్యమే
మిగిలిఉంది. చేసుకున్న వారికి చేసుకున్నంత.
అస్తు.
స్వామి సుందర చైతన్యానంద
చైతన్య చేమంతులు
1. వస్తువు ఉన్నదే అయినా, వస్తుజ్ఞానము లేనపుడు ఉన్నది లేనట్లే ఉంటుంది
ఈశ్వరుడు ఉన్నవాడే అయినా, ఈశ్వర జ్ఞానం లేనపుడు ఉన్నఈశ్వరుడు
లేని వాడు గానే ఉంటాడు.
2. జరగనివి జరగాలని జాగరణ చేసే వాని కన్నా, జరిగే వాటిని అర్థంచేసుకొని
ఆనందంగా బ్రతికే వాడే లోకంలో మిన్న. లేనివి రాలేదని ఆవేదన పడే వాని కన్నా,
ఉన్న వాటితో తృప్తి చెందే వాడే అధికుడు ఎప్పుడైనా.
3. పాలు వెన్న కాదు. కానీ పాలలో వెన్న ఉంది. వెన్న పాలలో ఉన్నట్లు
పరమేశ్వరుడు ప్రపంచంలో ఉన్నాడు. చిలికితేనే వెన్న, చింతనము లోనే వెన్నుడు.
4. తినడానికి ఎన్నయినా ఉండొచ్చు. తినే వాడికి ఆకలి ఉండాలి.
ఆసక్తి ఉండాలి. తెలుసుకోవ డానికి జ్ఞానంసిద్ధంగా ఉండొచ్చు.
తెలుసుకొనేవాడికి ఆర్తి ఉండాలి. భక్తి ఉండాలి.
భక్తి నైవేద్యంగా మారితే ముక్తిప్రసాదంగా అందుతుంది.
5. అవసరం లేని వాటిని కోరనివాడు, భక్తి లేని వారిని చేరనివాడు,
పెద్దల మాటలను మీరని వాడు సాధకుడు. సాధ్యరూపుడైన
పరమేశ్వరుని సాధించుటలో సిద్ధహస్తుడు.
6. ప్రపంచమూ, మనమూ రెండూ సత్యమైతే, మనం వెతికేది
ఏ సత్యంకోసం? ప్రపంచం కోసమైతే, మనల్ని మనం పోగొట్టుకుంటాం.
మనకోసమైతే, ప్రపంచం మన నుండి జారిపోతుంది. ఇక్కడే ద్వైతమును
జీర్ణించుకో లేము. అందుకే, ద్వైతము భక్ష్యము కాదు అన్నది ఉపనిషత్తు
(అభక్ష్యం ద్వైత భావనమ్).
7. బండి చిన్నదైనా పెద్ద పెద్ద బరువుల్ని మోస్తుంది. చెట్టు పెద్దదైనా
చిన్న చిన్న బరువులను కూడా మోయలేదు. పెద్దతనం ఉంటే
ఉండొచ్చు. పరులను భరించే పెద్ద మనసు అందరికీ ఉండదు.
8. తప్పు చేసే వారు పరుల ముందు తల వంచుతారు. భక్తి చేసే
వారు పరమేశ్వరుని ముందు తలవంచు తారు. పరుల ముందు తలవంచేవారు
దుఃఖంతో కృంగి పోతారు. పరమేశ్వరుని ముందు తల వంచేవారు
ఆనందంతో పొంగి పోతారు.
9. ఒకరు మనల్ని చులకనచేయడం వల్ల మనం చులకనపడము. అతడు
నన్ను చులకనగాచూస్తున్నాడు అనే ఆలోచన వల్లే మనం బలహీనులమవుతాము.
10. మంచి పనులు చేసే వారందరు మంచి ఆలోచనల్ని కలిగి ఉంటారని
చెప్పలేము. కాని, మంచి ఆలోచనలు కలవారు మాత్రం ఎప్పుడూ మంచి
పనులే చేస్తారు.
11. సమస్తాన్ని పోగొట్టుకొని దీనావస్థలో కొన సాగుతున్న దశలో కూడా
శ్రీరామచంద్రుడు విభీషణునికి లంకను దానం చేశాడు. ఇవ్వ గలిగినా ఇవ్వలేనివాడు
లోభి. ఇవ్వలేని స్థితిలోకూడా ఏదో ఇవ్వ గలిగిన వాడు త్యాగి.
12. తనకు ఆశ్రయము జలమే అయినా, ఆశకు దాసియై చేప వలలో పడుతుంది. లేదా
గాలానికి చిక్కిప్రాణాలను పోగొట్టు కుంటుంది. సర్వాధారుడైన పరమేశ్వరుని
విస్మరించి ప్రపంచం వైపు పరుగులు తీసే జీవులకు మాత్రం ఇంతకన్నా ఏం
మిగుల్తుంది?
13. తమ కంటూ చూపు లేకపోయినా, తాము తొడుక్కో వలసిన చెప్పుల్ని కాళ్ళు
గుర్తిస్తున్నాయి. కాని, తమకు చూపు చక్కగా ఉన్నా, నిత్యా నిత్యాల మధ్య తారతమ్యాన్ని
కళ్ళు చూడలేక పోతున్నాయి. మనస్సు గుర్తించలేక పోతూ ఉంది.
14. దక్షుడికి యజ్ఞభూమి కూడా ఉపకరించ లేదు. అర్జునుడికి యుద్ధభూమి కూడా
సహకరించింది. అహంకార దర్పాలు పాతాళంలో పడేస్తాయి. వినయ వివేకాలు
గగనంలో విహరింప చేస్తాయి.
15. ప్రయత్నిస్తే నీ మనస్సును నీవు అర్థం చేసుకో గలవు. కాని, ఎంత ప్రయత్నించినా నీ
మనస్సుకు నువ్వు అర్థం కావు. నిన్ను మనస్సు చూపెట్టినట్లు కాకుండా, నీవు నీవుగా
నిన్ను చూసుకొనే ప్రయత్నమే శ్రేయస్కరము.
16. భక్తి అనేది ప్రేమ ప్రవాహం. ఉన్న చోటే ఉండదు. నిరంతరం చలిస్తూ ఉంటుంది.
చలింప చేస్తూ ఉంటుంది. ఒక దశలో మనలను జ్ఞానకడలిలో కలసి పోయేలా,
కరిగిపోయేలా చేసి తరింప చేస్తుంది.
17. నాకు ఇది ఉంది అనుకునే వాడికి నాకు మరేదో లేదు అనేది కూడాఉంది. నాకు
ఏదీ లేదు అనుకునేవాడికి నాకు మరేదో లేదు అనేది కూడా లేదు. కనుక, 'లేదు' అనేది
లేనివాడు వాస్తవానికి ఉన్నవాడే. అన్నీ ఉన్నవాడే. అంతా ఉన్నవాడే.
18. అరటి పండును తినిన తరువాత తొక్కను ఏం చేస్తామో, సారరూపుడైన
పరమేశ్వరుని గ్రహించిన తరువాత ప్రపంచాన్ని అదే చేయాలి. తొక్కపై మనకు ద్వేష
ముంటుందా? అలాగని ఆసక్తి ఉంటుందా? ప్రపంచం విషయంలో కూడా అలాగే
ఉండాలి.
19. ధన మున్నా మద మెరుగనివాడు, జన మున్నా గుణ మరగనివాడు మనీషి. ఏదో
ఓనాడు అతడే అవుతాడు మహర్షి.
20. బుద్ధితో తెలుసుకొనేది ప్రపంచజ్ఞానము. బుద్ధిలో తెలిసేది పరమాత్మ జ్ఞానము.
పరమాత్మది సర్వ జ్ఞానము, జ్ఞానమైనా పరమాత్మ జ్ఞానం లోనే ఇమిడి ఉంది.
21.రాత్రంతా ప్రపంచంలో చీకట్లు ముసురుకున్నా, మన కంటిలో చీకటి లేకపోతే
తెల్లవారగానే వెలుగులు కళ్ళముందు ఆరబోసు కుంటాయి.
22. ఆలోచనల నుండి విడిపడటం అసంగత్వం కాదు. అది యోగం. ధ్యాన యోగం.
ఆలోచనలు ఉన్నా సంగత్వం లేదని తెలియడమే అసంగత్వం. ఇది జ్ఞానం. ఆత్మజ్ఞానం.
23. నిశ్శబ్దాన్ని పాటించడం కర్మ. నిశ్శబ్దమై ఉండటం జ్ఞానం. అదే మౌనవ్యాఖ్యానం.
పరమాత్మను ప్రకటించే మౌన వాక్యం.
24. ఉన్నది ఏదైనా, అది నీవైనా కావాలి. లేదా, నీ అనుభవంగా నైనా ఉండాలి.
మొదట నీవు ఉంటే, ఆతరువాత అనుభవాలు కలుగుతాయి. అనుభవాలు లేక
పోయినా
నీవు ఉంటావు. అనుభవంఉంటే నష్టంలేదు. అనుభవమే జ్ఞానము అనుకుంటే
లాభంలేదు.
25. ఏదో చెయ్యాలి అనే ఆలోచనకన్నా, ఎలా ఉండాలి? అనే ప్రశ్నపడితే, లేదా ఆలోచన
పుడితే, ఆ క్షణంనుండే జీవితం ఒక అందమైన మలుపుతిరుగుతుంది.
26.మనం కష్ట పడటానికి మరొకరు ఉండాలి అనే నియమ మేమీ లేదు.
కష్ట పడే మనసు ఉండాలే గాని, ఎవరూలేక పోయినా, అది కష్ట పడుతూనే
ఉంటుంది. ఏదో ఊహించుకొని వ్యథచెందుతూనే ఉంటుంది. పరులను కష్ట పెట్టే
మనస్సు ఎవ్వరూలేకపోతే తననే తాను కష్టపెట్టుకుంటుంది. మనం కష్ట పడకుండా
మరొకరిని కష్టపెట్ట లేము.
27. మంచి ఆలోచనలు చేయలేకపోవడం శాపం కాదు కానీ, చెడు ఆలోచనలు
చేయడం మాత్రంపాపమే. చూస్తేనే కనిపించేవి చూడకపోతే అగుపించవు.
28. జన్మించడం మన చేతిలో లేదు. జీవించడం మన చేతి లోనే ఉంది.
పరిస్థితుల్ని మనం శాసించ లేము.ప్రవర్తనను మనం నియంత్రించుకోగలం.
29. వెన్న ఉన్న చోటే నెయ్యి ఉంది. గురువు ఉన్న చోటే గోవిందుడున్నాడు.
గురుదేవుని సన్నిధిలో ప్రాప్తించే అక్షయ నిధియే దేవ దేవుడు.
30. వచ్చే జ్ఞాపకాలను ఆపడం మనిషికి ఎలా సాధ్యం కాదో, వచ్చిన
జ్ఞావకా లతో కలిసి హాయిగా జీవించడం కూడా అలాగే సాధ్యంకాదు. విచారము
లేకుండా విషాదమురాదు. ఆలోచనల నుండే ఆవేదనలు పుట్టు కొస్తాయి.
31. భగవంతుడు భవిష్యత్తులో ఎప్పుడో, ఎక్కడో కనిపించే వాడుకాడు. ఇప్పుడు, ఈ
క్షణంలో కూడా భగవంతుడు మనతో కలిసే ఉన్నాడు.భగవంతుడు ప్రత్యేకంగా
వచ్చేవాడుకాడు. పనిగట్టుకొని పోయే వాడూకాడు. సదాశ్వాసలాగా
కలిసిఉండేవాడు. ఇదేజ్ఞానం. ఈశ్వరజ్ఞానం.
32. భగవంతుణ్ణి అర్థం చేసుకొనే శక్తిమనకు లేదు. కాని మన బాధలను,
బాధల్ని పోగొట్ట మని మనం వినిపించేమొరను భగవంతుడు అర్థం
చేసుకుంటాడు. భక్తు డైన వానికి ఇదేశ్రీరామ రక్ష.
33. ఇచ్చేందుకు వస్తువుల్ని, ఇచ్చేచేతుల్ని, ఇవ్వాలనే చిత్తాన్ని అన్నిటినీ
పరమాత్మే మనకు అనుగ్రహించాడు.అవన్నీ ప్రసాదాలే. వాటిని అలాగే
వినియోగించు కోవాలి. అదేసమర్పణము.
34. అవసరాలు ఉండొచ్చు. ఉంటాయి కూడా. అలాగని, ఆశలు ఉండ నవసరం లేదు.
అవసరాలకు అవధు లుంటాయి. ఆశలకు హద్దులుండవు. ఆశ పెరిగేదే గాని తరిగేది
ఉండదు. తోడు పెట్టినా, తోడు పడినాపెరుగుతూనే ఉంటుంది. పెరుగులా
గడ కడుతూనే ఉంటుంది. శాంతితరుగు తూనే ఉంటుంది.
35. నాహం కర్తా హరిః కర్తా - నేను ఏదీచేయడం లేదు. అంతా శ్రీహరే
చేస్తున్నాడు. ఈ భావన బుద్దిలో కదలగానే నీవు చేసే వాడివి కాకుండా, చేసే
వాడిని చూచే వాడివి అవుతావు.
36. జీవితంలో ఏది నీది? ఎవరు నీవారు? నీ కున్నది నీది అవుతుందేగాని, నీది
కావాలి అనుకున్నది నీదికాదు. ఆశించి పొంద లేనిది నీదికానపుడు, పొంది పోగొట్టు
కొనేది మాత్రం నీది ఎలా అవుతుంది?
37. మనుషులు జలాన్ని పానంచేస్తారు. దేవతలు అమృతాన్ని పానంచేస్తారు.
మహాత్ములు జ్ఞానామృతాన్నిపానం చేస్తారు (అర్ధ రసం పిబన్తః). అందుచేత మహాత్ములు
జీవన్ముక్తులై శోభిస్తారు.
38. వివేకము అనేది అనుభవాలను పొందటం వల్ల కలిగేది కాదు; అనుభవాలను
అర్థం చేసుకోవడంవల్ల మిగిలేది; దివ్యంగా వెలిగేది.
39. వైరాగ్య మంటే ఉన్న వాటినిత్యజించడము కాదు. అవసరం కానివి
మనస్సులో చేరకుండా జాగ్రత్తవహించడమే వైరాగ్యము.
40. ఏ ధనమైనా వ్యయమే. క్షయమే. జ్ఞానమొక్కటే అక్షయ ధనం. ఈసత్యము నెరిగిన
వారే ధన్యులు. ఎరుగని వారు అన్యులు.
41. జగతికి చీకట్లు తెలియనివికావు. జీవికి ఇక్కట్లు క్రొత్తవి కావు.
ఈ ప్రపంచంలో ఎవడైనా బాటసారే. ఈ జగతి ఎవరి కైనా ఎండమావే.
42. బుద్ధి పారిపోతేపోనీ. భగవంతుడు జారి పోకుండాచూసుకో. చాలు.
43. ఏవో లేవని దుఃఖిస్తూఉంటాము. అవి మనకు అవసరాలుకావని, అందుకే
మన వద్ద లేవనే సత్యాన్ని అర్థం చేసుకోము.
44. పరమాత్మ మనల్ని సేవకులుగా సృష్టించ లేదు. మనమే
ఆ మహితాత్ముని ప్రభువుగా ఎన్నుకున్నాం.
45. నేత్రాలు మూసి పడుకున్ననిన్ను నిద్ర తన ఒడి లోకి తీసుకున్నట్లు,
అంతర్ముఖు డవై ధ్యానంలో నిలిచిన నిన్ను పరమాత్మ
తనలోకితీసు కుంటాడు. దైవాన్ని చేరా లంటే ధ్యానంచేసితీరాలి.
46. ప్రపంచం ఉండొచ్చు. కాని, దానిని గ్రహించే నీ కన్నా వేరుగాప్రపంచం
ఉండ లేదు. అది - ఇది; అక్కడ - ఇక్కడ; అప్పుడు - ఇప్పుడు
అనేవి తెలుస్తూ ఉండినా, అవేవీ చైతన్యమును దాటి పోలేవు.
47. ప్రవాసంలో విద్య మిత్రుడు. గృహంలో భార్య మిత్రురాలు.
రోగంవచ్చినపుడు ఔషధము మిత్రుడు. మరణానంతరం ధర్మమే మిత్రుడు.
మిత్రు డెవరో కాదు. మేలు చేసే వాడు మిత్రుడు. మేలుకొలిపేవాడు మిత్రుడు.
48. జీలకర్ర చేదు. బెల్ల మేమో తీపి. వాటిని ఇరువురూ కలిసిఅనుభవించాలని
ఒకరి తలపై మరొకరు పెట్టుకుంటారు. ఆ తరువాత, ఎవరి తలలువాళ్ళు
పట్టుకుంటారు. అదే సంసారమంటే.
49. బాలకృష్ణుని ఎన్ని కష్టాలుచుట్టు ముట్టాయో మనకుతెలియదా? అన్నిటినీ నవ్వుతూ
ఆలింగనం చేసు కున్నాడు. ఎవరినీద్వేషించ లేదు. దేనికీ భయపడ లేదు.
మందహాసాన్ని చిందిస్తూ అందరికీ ఆనందాన్ని పంచాడు. మనం కృష్ణ
భక్తులం. మనమూ అలాగే జీవిద్దాం.
50. పరమాత్మ పాదారవిందమే సర్వులకు ఆధారము. కాని, భక్తులైన
భ్రమరాలకు ఆ చరణార విందము ఆధార స్థానమే కాదు;
ఆనందనిలయము కూడా.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.