శ్రీ
శ్రీ శ్రీ శ్రీ జగద్గురు కంచి పీఠాధిపతుల సందేశము
ఇరాన్ - ఇజ్రాయెల్ దేశముల యుద్ధ ప్రభావము భారత దేశమునకు, భారతీయులకు ఎటువంటి కష్టనష్టములు కలుగకుండా యోగక్షేమాలు ప్రసాదించాలని శ్రీ శ్రీ శ్రీ జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు భారతీయులను సదా “మూకపంచశతి” లోని ఈ మూడు శ్లోకములను పారాయణ చేయుమని ఉపదేశమిచ్చారు. వీనిని అర్థము తెలిసి స్తుతిస్తే సత్వరఫలాలు అందుతాయని భావ వివరణ సమగ్రముగా భారతీయుల క్షేమమునాశించి జత చేయుచున్నాను
1.వారాహీ స్తుతి
"సౌః" బీజోపాసన.
శక్తి కూట ఉపాసన
"తాడిత రిపు పరిపీడన,
భయహరణ నిపుణ హల ముసలా|
క్రోడపతి భీషణముఖీ,
క్రీడసి జగతి త్వమేవ కామాక్షి|| (ఆర్యా.శ.90)
భావము: ఈ శ్లోకములోవారాహీ దేవతా స్తుతి ఉంది. జగన్మాత కామాక్షి శత్రువులను, దండించుచున్నది. పీడించుచున్నది. శత్రువుల వలన మనలో కలిగే భయాలను పోగొట్టడంలో చాలా నేర్పరి. ఈ మాతకు నాగలి, రోకలి ఆయుధాలు. ఈ జగన్మాత ముఖం వరాహస్వామి యొక్క ముఖమువంటి వారాహీ దేవి ,భయంకరంగా ఉండి శత్రువులను దడిపిస్తూ, కామాక్షీమాతయే ఈ రూపంలో తిరుగుతున్నది. అటువంటి జగన్మాత కామాక్షికి నమస్కారము.
ఈ వారాహీ దేవి లలితాపరమేశ్వరి క్రియాశక్తి అంశ. భండాసురుని సోదరుడగు విశుక్రుడు
దేహాహంకారంతో చెలరేగే వానిని సంహరించడానికి సైన్యాధిపతిగా నియమంచింది. వారాహీ ఉపాసన జగన్మాత ఉపాసనయే. గొప్ప powerful ఉపాసన. ఈ శ్లోక పారాయణ అంటే "సౌః" బీజోపాసనయే. మహాశక్తి ఉపాసన. మహాద్భుత స్మరణము.
2. పాదారవింద శతకము (59 వ శ్లోకము)
పాదపద్మ సంస్తుతి
త్రైలోక్యమోహన చక్ర స్తుతి(శ్రీచక్రములో బయటనుండి మొదటిది. ఇది కూడ “సౌః” బీజోపాసనయే. పంచదశిలో శక్తికూటోపాసన.
కామకళోపాసన లేదా “శ్రీం”బీజోపాసన ఆత్మవిద్యోపాసన.కామకళ (క్లీం బీజోపాసన)ఉపాసన
1.దధానో భాస్వత్తాం,
2.అమృతనిలయో, 3.లోహిత వపుః 4.వినమ్రాణాం సౌమ్యో, 5.గురురపి, 6.కవిత్వం చ కలయన్ | 7.గతౌ మందే, గంగాధర మహిషి! కామాక్షి! భజతాం,
8.తమః 9.కేతుః, మాతః తవ చరణపద్మో విజయతే||
భావ వివరణ:
ఈ శ్లోకములో జగన్మాత చరణద్వంద్వములో నవగ్రహములు అధీనములై ఉన్నాయి. ఈ ఒక్క శ్లోకమును ఉపాసిస్తే “నవగ్రహోపాసన” ఫలితము లభిస్తుంది. అన్ని గ్రహాలు అనుకూల ఫలితాలను ఇచ్చి సంరక్షించే ఉపాసన.
ఈ శ్లోక పదములలో వైభవము, అందు దాగిన నవగ్రహములను వివరిస్తూ ఈ శ్లోకోపాసన నవగ్రహజపమే అని తెలుపుతున్నారు. సర్వకాల, సర్వావస్థలయందు ఉపాసించదగిన ఉపాసన శ్లోకము. భోగములను, మోక్షములను ప్రసాదిస్తుంది. నవావరణ శ్రీచక్రోపాసన గర్భితము. నిత్యము ఉపాసించు వారి *యోగ క్షేమములను” జగన్మాత రక్షాకవచమై ప్రసాదించే వరదాయిని.
భావము: జగన్మాత కామాక్షి. ఆమె పాదాలను నవగ్రహాలు ఆశ్రయించియున్నాయి.
1. అమ్మ పాదాలు మనపట్ల కాంతిని వెదజల్లుతుంటాయి. అనగా (భాస్వత్త) సూర్య స్తుతి.
2.అమృతనిలయ (చంద్రుడు) చంద్ర స్తుతి.
3.ఎర్రని (లోహిత=ఎర్రని, వపువు=దేహము)దేహము కుజుడు.
4. సౌమ్యములు. శాంత నిలయాలు సౌమ్య(బుధుడు)
5.గురురపి(గురుగ్రహము) దక్షిణామూర్తి స్తుతి కూడా.
6.కవిత్వం (శుక్రుడు) చెప్పించగలవి.
7.నడకలో మెల్లన (మందః=శని, గతౌ=గమనములో). శనిగ్రహోపాసన.
8.తమః(చీకటి పోగొట్టే రాహువు) రాహూపాసన. దుర్గోపాసన.
9.కేతుః(జ్ఞాన దాయిని) కేతుగ్రహోపాసన
అటు 9 ఆవరణలు కల శ్రీ చక్రోపాసన. శివశక్త్యుపాసన.బాల, పంచదశి, షోడశీ ఉపాసన కూడా అంతర్భవించియుంది. నవరంధ్రాత్మక జీవుల దేహములను సంరక్షిస్తూ యోగక్షేమాలు ప్రసాదిస్తుంది.
********************************
స్తుతి శతకము 48 వ శ్లోకము
వాగ్భవకూటోపాసన “ఐం” బీజోపాసన
సరస్వతీ ఉపాసన
జగన్మాత ముఖకమలోపాసన
3.
“వరీవర్తు స్థేమా త్వయి మయి గిరాం దేవి! మనసో,
నరీవర్తు ప్రౌఢా వదనకమలే! వాక్యలహరీ,
చరీచర్తు ప్రజ్ఞాజనని! జడిమా నః పరజనే
సరీసర్తుః స్వైరం జనని! మయి కామాక్షి! కరుణా||”
జగన్మాత కామాక్షి వదన కమలమందు నా మనసు స్థిరమగుగాక! నా నోటినుండి అమృతవాక్కులు స్రవించుగాక! శత్రువులను మిత్రులుగా చేయుగాక! అమ్మ ఉపాసన వలన మా మాటలు అవసరమైతే ఎదుటి వారిని కట్టడి చేసే ప్రౌఢ వాక్కులై వర్ధిల్లుగాక! మాలో దాగిన సోమరితనాన్ని నిర్మూలించుగాక! మా వాక్కులు దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కల వాక్కులై ప్రవహించుగాక! జగన్మాత! అలా నీ వాక్కుల ఉపాసన నీ మనస్సును కరిగించి మాపై కరుణామృతజల్లులు వర్షించు గాక. మమ్ములను సంరక్షించుగాక!
ఏతత్ ఫలమ్ జగన్మాతృచరణారవిందార్పణమస్తు.
****************************************************************************
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.