ఇదీ.. రేవంత్ మార్క్ ఎమర్జెన్సీ….గోసుల శ్రీనివాస్ యాదవ్ 98498 16817 నమస్తే తెలంగాణ
గతం వర్తమానాన్ని, వర్తమానం భవిష్యత్తును నిర్దేశిస్తుంది అంటారు. నేడు తెలంగాణ
రాష్ట్రంలో రేవంత్రెడ్డి ఎమర్జెన్సీ నడుస్తున్నది. గతంలో ఇందిరాగాంధీ
ఎమర్జెన్సీని చూసిన ఈ దేశం నాటి నియంతృత్వం, అరాచకత్వంపై పుంఖానుపుంఖాలుగా చర్చించుకుంటున్నది. వామ్మో.. ఇందిరమ్మ ఇంత దౌర్జన్యమా అనే వేల పుస్తకాలు, లక్షల రచనలు అచ్చయి, నాటి చరిత్రను ఇప్పటికీ సజీవంగా కండ్ల ముందు కదలాడేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తమన్న రోజే ఇక్కడి బుద్ధి జీవులు ఇందిరమ్మ రాజ్యపు అరాచకాలు, అమానవీయ ఘటనలను గుర్తు చేసుకున్నారు. కానీ, అదే పార్టీలో కొందరు మార్పు. ప్రజాపాలన అని రకరకాల గజకర్ణ, గోకర్ణ విద్యలతో పాటు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు.
అధికారంలోకి వస్తూనే ఆరు గ్యారెంటీలతో పాటు స్వేచ్ఛా స్వాతంత్య్రం అనే
ఏడో గ్యారెంటీని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తామని చెప్పారు. నిజానికి, ఆ ఆరు గ్యారెంటీలను పాతరేసి ఆయన ఇప్పుడు ఏదో గ్యారంటీపై ప్రధాన దృష్టిని కేంద్రీకరించినట్టున్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని తలదన్నే తరహాలో తన నిరంకుశ,
నియంతృత్వ, అపరిపక్వ పాలనతో నయా ఎమర్జెన్సీ అనే పాలసీని తు.చ. తప్పకుండా అమలు జరిపిస్తున్నరు. వ్యక్తిగత కక్షలు, ప్రతీకారం ఉండదని ప్రమాణం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాదిలో ఆయన ఆలోచన పోకడలు చూసి తెలంగాణ సమాజం నివ్వెరబోతున్నది. ప్రధాన ప్రతిపక్ష నేతలను వేటాడి వెంటాడి కేసుల్లో ఇరికి స్తుండటం ఒక ఎత్తయితే, నక్సలైట్లపై కాల్పులు, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు, ఆకలి చావులు, విద్యార్థులు విషాహార మారణ హోమాలపై, నిత్యం తల్లడిల్లుతున్న తెలంగాణపై ప్రశ్నిస్తున్న ప్రజాస్వామికవాదులపై కేసులు. నిర్బంధపు ఉచ్చు మరో ఎత్తులా పరిణమిస్తున్నది.
ప్రధానంగా అధికారంలోకి వచ్చేముందు మ్యానిఫెస్టో ద్వారా ఆరు గ్యారెంటీలు, 120 హామీలపై మాట్లాడే ప్రతీ గొంతుకను ఏదో గ్యారెంటీని అడ్డుపెట్టి మరీ కోసేస్తున్నారు. ప్రగతిభవన్ పేరును ప్రజాభవన్ మార్చి గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వం నేడు ప్రజాభవన్లోకి అందరినీ స్వేచ్ఛగా అనుమతిస్తున్నదా?
ఓ జిల్లా నుంచి ఎవ్వరైనా సచివాలయం వస్తే పోలీస్ నిర్బంధం లేకుండా స్వేచ్ఛగా అనుమతించే పరిస్థితి ఉన్నదా..? సచివాలయం 6వ అంతస్థులోకి కంచెలెందుకే సారు. సీఎంను ఓ సామాన్యుడు గానీ, ఎమ్మెల్యే గానీ అనుమతి లేకుండా కలిసే పరిస్థితి ఉన్నదా... ఇలాంటి స్వీయ ప్రశ్నలకు రేవంత్రెడ్డి నుంచి సమాధానం
రావాలి. ధర్నా చౌక్ నిషేధం ఎత్తివేశామనీ, అదే ఓ పెద్ద విశాలమైన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని నమ్మబలుకుతున్నారు. కానీ, నిజానికి ధర్నా చౌక్ ఎప్పుడూ నిషేధంలో లేదు. స్వయంగా సీఎం హోదాలో కేంద్రంపై కేసీఆర్ నిరసనకు
దిగింది ధర్నా చౌక్ వద్దే. కేసీఆర్ సర్కార్లో నిత్యం ధర్నాచౌక్ ఓ ప్రజాస్వామ్య వేదికగా ఉండేది. కానీ, ఇప్పుడు ఏడాదిలో పోలీసు రాజ్యమే నడుస్తున్నది. ఇవాళ ధర్నాచౌక్ లో ధర్నాలు చేద్దామని దరఖాస్తు చేస్తే సవాలక్ష ఆంక్షలు, ఇటీవల బీసీల కోసం భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్నా కోసం దరఖాస్తు చేస్తే కోర్టు మెట్లెక్కాల్సిన దుస్థితి. పౌరహక్కుల సంఘం యాభై ఏండ్ల మహాసభల సందర్భంగా గత మార్చిలో ఊరేగింపు జరపడానికి అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జనవరి 13న అంతర్జాతీయ పాలపాలస్తీనా సంఘీభావ ప్రదర్శన రోజున, ట్యాంక్ బండ్
మీద మఖ్దూమ్ విగ్రహం దగ్గర ప్రదర్శన జరుప బోతే విపరీతంగా పోలీసులను మోహరించి విద్యార్థి యువజనులను అరెస్టు చేశారు. భువనగిరిలో హైస్కూలు విద్యార్థినులు భవ్య, వైష్ణవిల అనుమానాస్పద మరణాలపై సరైన దర్యాప్తు
కోరుతూ చైతన్య మహిళా సంఘం ధర్నా తలపెడితే పోలీసులు దాన్ని విచ్ఛిన్నం చేశారు. హైదరాబాద్ గాంధీనగర్ లో గ్రూపు పరీక్షలకు తయారవుతున్న ఒక నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకుంటే, అక్కడ చేరిన నిరుద్యోగులు ఆందోకనకు దిగకుండా చెదరగొట్టారు. హైదరాబాద్ శివార్లలో ఒక చర్చిని మతోన్మాదులు ధ్వంసం
చేసిన ఘటనలో సమస్యను పరిష్కరించకపోగా, తమ సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించిన బాధితులనే అడ్డుకున్నారు. ఏడాదిలో ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు జర్నలిస్టుల మీద దాడుల వార్తలు వస్తూనే ఉన్నాయి. శాసనసభలో మీడియా పాయింట్ దగ్గర ప్రతిపక్ష సభ్యులు మాట్లాడకుండా అడ్డుకున్నారు. నల్లగొండ జిల్లా చింతపల్లి పోలీసుస్టేషన్లో గిరిజన యువకుడి లాకప్ డెత్ జరిగింది. ఏడాదిలోనే మంత్రి సీతక్క ఇలాఖాలోనే మూడు ఎన్ కాంటర్లు జరిగాయి. ఇక ఎస్ఐఏ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు, పొరుగు రాష్ట్రాల పోలీసులు సోదాలు, దాడులు, మనుషులను ఎత్తుకుపోవడం నిత్యకృత్యమవుతున్నాయి. జైలు నిర్బంధంలో ఉన్న లగచర్ల రైతులకు బేడీలు, ఫార్మాకంపెనీల పేరుతో భూములను లాక్కోవడం వంటి ఘటనలూ సహజమైపోతున్నాయి.
ఇక తన పాలనలో రాష్ట్రం పూర్తిగా నేరయమై పోయిందనడానికి తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్రెడ్డి విడుదల చేసి వార్షిక క్రైం రేట్ లెక్క.లే నిదర్శనం. 2,945 అత్యాచారాలు, 241 హత్యలు, 379 ఆత్మహత్యలతో ఓవరాల్ క్రైంరేటు దాదాపు 10 % పెరిగింది. గతేడాది 2,13, 121 కేసులు నమోదైతే, 2024లో 2,34, 158 కేసులు నమోదయ్యాయి. ఇక సైబర్ క్రైం గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. వీటన్నిం టిపై అజమాయిషీగా నిర్వహించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి వ్యవహరిస్తూ కేవలం ప్రధాన ప్రతిపక్ష నేతలనే టార్గెట్ చేస్తున్నది.
పదే పదే ఇందిరమ్మ రాజ్యం అంటున్న ఈ సర్కారులో పోలీస్ రాజ్యమే నడుస్తున్నది. ఆరు గ్యారెంటీలపై ప్రశ్నిస్తున్న ప్రధాన ప్రతిపక్ష నేతలను సీఎం రేవంత్ టార్గెట్ చేసి కేసుల్లో ఇరికిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై 10 కేసులు నమోదు చేసి అరెస్ట్ సాకుల కోసం అనేక రకాలుగా రంధ్రాన్వేషణ సాగిస్తున్నారు. కేసీఆర్పై రాజకీయ కక్ష పెంచుకొని రాజకీయాలను పూర్తిగా ప్రతీకారాత్మకంగా మార్చేయడం గమనార్హం. బీఆర్ఎస్ సీనియర్ నేత, ఫైర్
బ్రాండ్ హరీశ్ రావు గొంతు నొక్కే ప్రయత్నం అడుగడుగునా జరుగుతున్నది.
ఆయనపై ఆరు కేసులు నమోదు చేసి రాక్షసానందం పొందుతున్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడి చేయడమే కాకుండా, ఎక్కడ ఏ ఘటన జరిగినా,
ఎవ్వరే కేసుల్లో ఇరుకున్నా హరీశనే రోజూ గృహ నిర్బంధం చేయడం పరిపాటిగా మారింది. సీఎం రేవంత్ తన పాలనా కాలమంతా కేటీఆర్ అరెస్ట్, హరీశిపై కేసులు, మాజీ సీఎం కేసీఆర్ పై విచారణలకే కేటాయిస్తుండటం తెలంగాణ సమాజం
నిశితంగా గమనిస్తున్నది. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సహా ఎర్రోళ్ల శ్రీనివాస్ వంటి ఉద్యమకారులపై కావాలని కేసులు పెట్టి సెలవు రోజుల్లో అరెస్టు చేస్తూ, సీఎం వికృత ఆనందాన్ని పొందుతున్నారు.
ఏడాది కాంగ్రెస్ పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదనడానికి అనేక ఉదాహరణలున్నాయి. రైతులను ఈ సర్కారు మోసం చేసిందనదానికి రైతు రుణమాఫీ, రైతు భరో సాలే ప్రత్యక్ష ఉదాహరణలు,
కేసీఆర్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు దేశవ్యాప్తంగా ఒక రోల్ మాడల్ గా నిలిచింది. దీని పేరును రైతు భరోసాగా మార్చి ఏడాదికి 10 వేలు కాకుండా 15 వేలు ఇస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలందరూ ప్రజల దగ్గరకు వెళ్లి పదే పదే చెప్పారు. వరంగల్ లో జరిపిన భారీ బహిరంగ సభలో రైతు డిక్లరేషన్ పేరిట 15 వేలు
ఇస్తామని రాహుల్ గాంధీ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాహుల్గాంధీ మాత్రమే కాదు, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గే వంటివారు కూడా. పాల్గొన్న ప్రతి సభలో రూ.15 వేలు ఇస్తామని చెప్తూనే వచ్చారు.
ఇక ప్రగల్భాల రేవంత్ రెడ్డి అయితే కేసీఆర్ ఇచ్చే ముష్టి 10 వేలు ఎందుకు? మా ప్రభుత్వం రాగానే ఎకరాకు 15 వేలు ఇస్తామని ఊరూరా తిరిగారు, రాహుల్ గాంధీ
సహా కాంగ్రెస్ అగ్రనేతలందరూ చెప్తున్నారు కాబట్టి అమలు చేస్తారని ప్రజలు అమాయకంగా వీరి మాటలు. నమ్మారు. దగా చేయటం కాంగ్రెస్ డీఎన్ఏలో ఉన్నదనే విషయాన్ని తెలంగాణ రైతాంగం మర్చిపోయింది.
ఎన్నికలు అయిన తర్వాత వాయిదాల పర్వం ప్రారంభమైంది. సోనియాగాంధీ పుట్టినరోజుకు కానుకగా ఇస్తామన్నారు. రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి కాబట్టి తర్వాత ఇస్తామన్నారు. వాయిదాలు వేసి వేసి ఇప్పుడు రూ.15వేలు కాదు. రూ. 12 వేలు మాత్రమే ఇస్తామని రేవంత్రెడ్డి సర్కారు నిసిగ్గుగా ప్రకటించింది. అది కూడా వ్యవసాయయోగ్యమైన భూములకు అని కొందరు మంత్రులు బహిరంగంగా
చెప్తున్నారు. కానీ, వ్యవసాయ యోగ్యమైన భూములంటే ఏమిటో చెప్పటం లేదు.
అంతే కాదు. సాధారణంగా రైతులకు వానకాలం నాట్లకు పెట్టుబడులు అవసరమవుతాయి. ఆ సమయంలో ప్రభుత్వం భరోసా ఇవ్వకుండా
రూ.11 వేల కోట్లు ఎగ్గొట్టింది. ఇప్పుడు యాసంగిలో షరతులతో కూడిన పంపిణీ
చేస్తానంటున్నది. తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునేందుకు కాంగ్రెస్ కబంధహస్తాల నుంచి బయటపడే వరకు ఎత్తిన పిడికిలి దించకుండా కాంగ్రెస్ పోకడలపై యుద్ధానికి సిద్ధంకావాలి. తెలంగాణ మట్టి బిడ్డలకు తెలంగాణ
తల్లి ఉగ్గుపాలతోనే ప్రశ్నించడం నేర్పింది. ప్రపంచంలో ఎన్నో విప్లవ సామాజిక ఉద్యమాలకు నాయకత్వం వహిస్తుంది నేటికీ తెలంగాణ బిడ్డలే. వర్గ పోరాటమైనా, వర్ణ పోరాటమైనా భూమి కోసం, భుక్తి కోసం, విముక్తికోసం ప్రపంచంలోనే పోరాటం చేసిన చరిత్ర తెలంగాణకున్నది. ఇట్లా కొట్లాడిన తెలంగాణ బిడ్డలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తా, ప్రశ్నిస్తే జైలుకు..పంపిస్తా అంటే తెలంగాణ సమాజం ఎన్నిసార్లు జైలుకెళ్లడానికైనా, ఎన్నిసార్లు కేసులు ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నదని
తెలుసుకోవాలి తెలంగాణ సర్కారు పెద్దలు. ప్రజాపరిపాలన అని చెప్పి ఈ రోజు తెలంగాణలో రేవంత్ ఎమర్జెన్సీ నడుస్తున్నది. నాడు దేశంలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ, నేడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎమర్జెన్సీ.. బుద్ధిజీవులు, శ్రమజీవులు, శ్రామికులు, విద్యార్థులు, యువకులు ప్రశ్నించాల్సిన మోకా వచ్చింది.
ప్రజల కోసం.. ప్రజాస్వామ్యం కోసం..ప్రశ్నిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం....
(వ్యాసకర్త: బీఆర్ఎస్ సీనియర్ నాయకులు)
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.