నమస్తే తెలంగాణ
క్షణకాల తప్పు.. యుగయుగాలకూ శిక్ష
'లంహోమె ఇతాయెకీ సదియోంమె సజాపాయి'.. క్షణకాలంలో చేసిన తప్పులకు యుగయుగాలు శిక్ష అనుభవించవలసి వస్తుందని దీనర్థం. ఇది ఒక ఉర్దూ నానుడి. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలకు ఈ నానుడి అద్దం పడుతుంది. దశాబ్దాల పాటు పోరాటాలు, ప్రాణ త్యాగాలతో తెలంగాణ ప్రజలు స్వీయ అస్తిత్వాన్ని సాధించుకున్నారు. కానీ, గత అసెంబ్లీ ఎన్నికల్లో క్షణికావేశానికి లోనై చేసిన పనికి తన జీవితంలో ఒక్కసారైనా 'జై తెలంగాణ' అనని వ్యక్తిని రాష్ట్ర అత్యున్నత అధికార పీఠంపై కూర్చోబెట్టారు. దాని పర్యవసానంగా నేడు తెలంగాణ స్వీయ అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలు ప్రమాదంలో పడ్డాయి.
యం.డి. జమీలొద్దీన్…86862 11556
రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని శపథాలు చేస్తున్న ముఖ్యమంత్రి
రేవంత్రెడ్డి.. తెలంగాణ సాంస్కృతిక, అస్తిత్వ చిహ్నాలను గుట్టుగా చెరిపివేసే కుట్రకు తెరలేపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం దిగిపోయిన నాడు ఆంధ్రా పోలీసులు శ్రీశైలం ప్రాజెక్టును కబ్జాపెట్టడంతో మొదలైన ఈ అస్తిత్వ హననం నేటికీ కొన సాగుతున్నది. ఈ ఏడాది వర్షాకాలం తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి పోతిరెడ్డిపాడు, సాగర్ కుడి కాల్వ ద్వారా ఏపీ ప్రభుత్వం సుమారు 400 టీఎంసీల నీటిని తరలించుపోయింది. అప్పుడు చేష్టలుడిగిన రేవంత్ సర్కార్ తన తెలివినంతా తెలంగాణ అస్తిత్వ చిహ్నాల
మార్పుచేర్పులకు, తన శక్తియుక్తులను ప్రతిపక్ష నాయకులపై కేసులు నమోదు చేసి, వారిని నిర్బందించడానికి వాడుతూ తెలంగాణ రైతుల అస్తిత్వాన్ని సంక్షోభంలో నెట్టివేసింది.
సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి ద్వారా తెలంగాణ సచివాలయంలో చొరబడ్డ ఆంధ్రా పైరవీకారులతో రాష్ట్రస్థాయి కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. ఈ చొరబాటు కేవలం పైరవీకారుల వరకే పరిమితం కాలేదు. రాష్ట్రస్థాయి కీలక పదవులు కూడా చాలా వరకు ఏపీ అధికారులతో నింపుతూ పోతున్నారు. బుద్ధవనం ప్రాజెక్టు పర్యవేక్షకుడిగా మాజీ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డిని, రాష్ట్ర నీటిపారుదల శాఖ సలహాదారుడిగా ఏపీ చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు, ఏపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శ్రీనివాస్ రాజును తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడిగా, అయ్యదేవర ప్రసన్నకుమార్ను అసెంబ్లీ సలహాదారుడిగా, రెడ్కో ఎండీగా అనంతపురానికి చెందిన అని లవావిల్లను, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ జనరల్ గా నిమ్మగడ్డ రమేశ్కుమార్లను నియమించడం లాంటివి చూస్తుంటే మళ్లీ 'మా ఉద్యోగాలు మాకు కావాలి' అని తెలంగాణ ఉద్యోగులు ఉద్యమాలు చేయాల్సి వస్తుందేమోనని అనిపిస్తున్నది.
తెలంగాణ అధికార చిహ్నం నుంచి ఘనమైన గత చరిత్రకు ఆనవాళ్లయిన చార్మినార్, కాకతీయ కళాతోరణాలను తొలగించే ప్రయత్నం చేసిన రేవంత్ భంగపడ్డారు. ప్రజాగ్రహాన్ని చూసి భయపడ్డారో లేక అధికార చిహ్నాల చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే మార్పుచేర్పులు చేసే అధికారం ఉన్నదనో తెలియదు కానీ, గత కొద్ది రోజు లుగా ఆ విషయాన్ని పక్కనపెట్టారు. ఉద్యమ సమయంలో ఎంతోమంది శిల్పులు, చరిత్రకారులు, ఉద్యమకారులు సమాలోచనలు చేసి మన సంప్రదాయం ప్రకారం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకత ఉన్న ముఖ్యమంత్రికి ఆ విగ్రహం నచ్చకపోవడంలో వింతేమీ లేదు. తెలంగాణ తల్లి విగ్రహం ఎమ్మెల్సీ కవితలా ఉన్నదని ఒక మంత్రి సెలవిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ అభివృద్ధి పనిలో చూసినా, ఏ సంక్షేమ పథకంలో చూసినా కాంగ్రెస్ నాయకులకు కేసీఆరే కనిపిస్తున్నారు. ప్రతి నీటి ప్రాజెక్టులో హరీశ్ రావు కనిపిస్తున్నారు. ఐటీ అభివృద్ధిలో కేటీఆర్ కనిపిస్తున్నారు. ఇప్పుడు మంత్రులకు తెలంగాణ తల్లి విగ్రహంలో కవిత కనిపించడం ఆశ్చర్యకరమేమీ కాదు. హైదరాబాద్లో తెలంగాణ కొత్త తల్లిని ప్రతిష్ఠించారు. మరి తెలంగాణలోని పల్లెలు, పట్టణాల్లో ఉన్న వేల తెలంగాణ తల్లి విగ్రహాలను ఏం చేస్తారో కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ మీద అక్కసుతో కొత్త తల్లిని ప్రతిష్ఠించవచ్చు. కానీ, గత 18 ఏండ్లుగా తెలంగాణలోని ప్రతి బిడ్డ మనసులో నాటుకున్న అసలు తెలంగాణ తల్లి రూపాన్ని చెరిపేయడం సాధ్యం కాదన్న విషయాన్ని అస్తిత్వ
హననకర్తలు గుర్తిస్తే బాగుంటుంది. తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన బతుకమ్మ లేకుండా, కొత్త తెలంగాణ తల్లిని తయారు చేసి మన అస్తిత్వాన్ని మల్లించే వికృత క్రీడను కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి ప్రజాక్షేత్రంలో అభాసుపాలు కాకతప్పదు.
ఈ ఏడాది కాలంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు తప్ప ఒక్క కొత్త పథకానికి శంకుస్థాపన చేయలేదు. 'టీఎస్'ను 'టీజీ'గా మార్చడం, తెలంగాణ తల్లి రూపాన్ని మార్చడం తప్ప ప్రజల బతుకు మార్చేందుకు ముఖ్యమంత్రి ఏమీ చేయలేదన్నది నగ్నసత్యం.
అధికారంలోకి వచ్చిన కొత్తలోనే మోదీ ముందు మోకరిల్లి, బడేభాయ్ అని చెప్పిన రేవంత్.. అనేక రంగాల్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండి ఎన్నో అవార్డులు అందుకున్న తెలంగాణ మాడలను కాదని గుజరాత్లోగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పిననాడే తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలుపెట్టారు. గత 10 ఏండ్లలో రాష్ట్రంలో అడుగుపెట్టని అదానీకి ఎర్రతివాచీ పరిచి తెలంగాణ పరువును గుజరాత్ కి తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చరిత్రకు చెదలు పట్టదు. చెరిపేస్తే కేసీఆర్ లాంటి చరితార్థుల చరిత్ర చెదిరిపోదు. తుగ్లక్ తన రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చి పిచ్చి తుగ్లక్ గా పేరుపొందాడు. అలాగే ఇలాంటి నిర్ణయాల వల్ల పాలకులకే నష్టమన్న సంగతిని గ్రహించాలి. ఇప్పటికైనా ప్రజల జీవన ప్రమాణాలు, వారి స్థితిగతులను మార్చే ప్రయత్నం చేయాలి. వ్యక్తిగత కక్షల కోసం తెలంగాణ అస్తిత్వం చిహ్నాలను మార్చే ప్రయత్నం చేస్తే చరిత్రలో పిచ్చి తుగ్లక్కు గా నిలిచిపోవడం ఖాయం.
No comments:
Post a Comment
Note: Only a member of this blog may post a comment.