Friday, August 29, 2025

#అచ్చులు_హల్లులతో_గణపతి_పూజ #సేవ – తెలుగు భాషా ఉత్సవాలు 29-31 ఆగుస్ట్ 2025-శీర్షిక : నా తెలుగు భాష#కవి_పేరు_తుమ్మ జనార్దన్_జ్ఞాన్

   

అమ్మ చేతిలో తయారైన 

ఆగణనాధుడు

ఇప్పుడే బయలుదేరాడు 

ఈరోజే వస్తున్నాడు

ఉమాపుత్రుడికి ఉండ్రాళ్ళు సిద్దంగా ఉంచండి 

ఊరూరా స్వాగతమంటూ...

ఎలుక వాహనమెక్కి 

ఏతెంచినాడు మన ఏకదంతుడు 

ఐకమత్యము నేర్పి ఆదరించ

ఒక్కమారు పిలువాగానే గజకర్ణుడు

ఓ ఓ యంటూ వడివడిగా వచ్చినాడు 

ఔరా మన గణపతిని 

అంబాసుతుడిని భక్తితో

అహర్నిశలు  కొలుద్దాం.


కమ్మనైన పాయసాలు నీకు కవీశా

ఖర్జూరం, అరటి, జామ, దానిమ్మ ఫలాలు

గణనాధుని మ్రొక్కి దీవించమంటూ

ఘుమఘుమలాడే పిండివంటలూ

కంకణమ్ (కంకణం) కట్టుకొని 

చక్రాల రథముపై ఊరేగిస్తూ చతుర్భుజుని

ఛత్రము పట్టి విఘ్నురాజుని 

జంబూ ద్వీపం భారత ఖండం అంతా

ఝండాలు అలంకరించి దండాలు చేస్తూ 

జ్ఞానమిమ్మని గణనాయకుడికి మ్రోక్కుదాం

టక టకా టకా టకా అడుగులే వేస్తూ 

ఠంఠం ఠం ఠం డప్పులే మ్రోగ్రగా

డమరుక ధ్వానాలతో 

ఢంకా నినాదాలతో తోడ్కోనివద్దాం

గణనాయకునికి వందనాలిడదాం

తండోప తండాలుగా చేరి 

కథ విందాం గణపతిది

దయజూపు మాపైన గణాధ్యక్షా 

ధనధాన్యాలిమ్మని దూమ్రవర్ణుని

నందివాహనుడి సుతుని ప్రార్థిద్దాం

పత్రిపూజతోడ వక్రతుండుని కొలిచి

ఫలము ప్రతిఫలము ఆశించక సేవించుదము

బంగారు పంటలతో రైతులను గావమని

భజనలు చేసి భక్తితోడ 

మము బ్రోవమందాము విఘ్నేశ్వరుడిని

యక్షగానముల కీర్తించుదము ద్విముఖుడిని

రక్షనజేయుము తక్షణమే మము ముక్తిదాయ

లక్షణమైన అక్షర సంపదలిమ్మని లంబోదరుని

వరములిమ్మని వేడుదము వరాప్రదుని 

శశివర్ణుని శంకర సుతున్ని శాంతినిమ్మని

షరతులేమి లేని బ్రతుకునిమ్ము విఘ్నహర్తా

సదా సద్భుద్ది నొసగు సిద్ధి వినాయకా 

హరిద్రా హరించు మాలోని అరిషడ్వర్గాలను

కళంకములు రాకుండా దీవించు యోగాదిపా

క్షమించు మా తప్పులను ఆశ్రిత వత్సలా

ఱంపము కోతవంటి రంధి లేకుండ జూడు వికటా.

..మనందరికీ గణపతి అండగా ఉండాలని ఆశీస్సులు 

మెండుగా అందాలని కోరుకుంటూ... 😊💐🎉

వినాయక చవితి శుభాకాంక్షలు 💐💐💐🙏


        ✍️ తుమ్మ జనార్దన్ (జ్ఞాన్) 


***********************************************************


సేవ – తెలుగు భాషా ఉత్సవాలు 29-31 ఆగుస్ట్ 2025

[తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి 

పంతులు జయంతి సందర్భంగా]

కవి పేరు    : తుమ్మ జనార్దన్ (జ్ఞాన్)

--------------------------------------------------- 

శీర్షిక : నా తెలుగు భాష

‘అ’తో మొదలైంది నా తెలుగు భాష 

‘అమ్మ’తో మొదలైంది నా మాతృభాష

నాన్న తో ఎదిగింది నా అమ్మ భాష

గురువుతో పెరిగింది నా అమృత భాష

నా వాక్కులో నిలిచింది నా అమర భాష

నన్ను పెంచి మురిసింది మురిపాల భాష

నన్ను నన్నుగా చూపింది నా ముద్దు భాష

ప్రతి గోరు ముద్దలో ఒదిగిన ప్రేమైక భాష

నన్నుద్ధరించింది నా సుమధుర తెలుగు భాష,


ఎన్ని భాషలు నేర్చిననేమి మాతృభాషకు సాటిరాదు 

భాషలన్నింటిలోనూ తెలుగుకేదీ పోటీకాదు

నా భాష నా యాస తెలంగాణా, ఆంద్ర, రాయలసీమ

ప్రాంతానికో యాస, జిల్లా జిల్లాకో యాస 

ఏ ప్రాంతమైనా ఏ రాష్ట్రమైనా ఒక్కటే నా తెలుగు. 


నా అమ్మ నుడి తెలుగు, గోదారి సుడి తెలుగు

ప్రాణహిత ప్రాణమై, తుంగభద్రకే భవితగా

భీమా ప్రవాహమై, పెన్నా వెన్నెలై  

కృష్ణమ్మ పరుగులా, మంజీరా మమతలా 

సాగుతున్నది చూడు నా సుందర తెలుగు భాష.  


త్యాగయ్య కీర్తనలు, అన్నమయ్య కృతులు,

రామదాసు రచనలు, క్షేత్రయ్య గాత్రం నా తెలుగు

వాక్కులే గేయమై, గేయమే వాక్కుగా అలరారినది 

అద్వైతానుభూతికి ఆధారమైనది నిలిచినది 

సంగీత సాహిత్య సారధి నా తెలుగు భాష .


నన్నయ్య, తిక్కన, ఎర్రన, పోతన, వేమన, 

శ్రీశ్రీ, శ్రీనాథుడు, గురజాడ, తిరుపతి వేంకట కవులు, 

విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కాళోజీ

రాయప్రోలు సుబ్బారావు, దాశరధీ, సినారె, జాషువా,

ఎందఱో ఇంకెందరో నాటి నేటి మేటి కవులు

నచ్చి, మెచ్చి పోషించిన భాష, నా తెలుగు భాష.


రాయల ఆస్థాన రాణియై ఏలినది

దేశభాషలందు లెస్సగా వెలిగినది

రాతి శాసనమై గతము తెలిపిన భాష

కులవృత్తులకు నాడు కుబుసమైన భాష


తాళపత్రాలలో పదిలమైన భాష

ఉద్యమాలకు శంఖారవమైన భాష

కవి కోకిలల కన్తాభారణమైన భాష

ఉగాది ఉత్సవ ఉత్సాహమీ భాష.


సామాన్యులకు జ్ఞాన రూపమైన భాష

హరికథా, బుర్రకథ కాధారమైన భాష

అనంత సాహిత్య సాగరం నా భాష

దేశభక్తి యుక్తి ముక్తి సాధనం నా భాష.


యోగా అనుబంధంగా, యోగమే ప్రధానంగా 

శబ్దార్థ ప్రభోధంగా, పలుకుల ప్రవాహంగా, 

సుమధుర సంగీతంలా సాగే సెలయేరులా

పద్యం, అవధానం ప్రత్యేకతలతో భాసిల్లు భాష 

అద్భుత కళాకృతుల వ్రాత, ఇది తెలుగువారి తలరాత.


ప్రకృతి ప్రసన్న కృతిలా సాగే సుస్వర సునాదం

జనపదం నుండి జానపదమై, ఎంకి పాటైనదీ

నాట్యవిన్యాసమై, నవరసపోషనై 

గ్రామాలు, నగరాలు, దేశాలు దాటినది 

పేట నుండి అగ్రరాజ్యాలవరకు పీటమేసిన భాష. 


అందుకే నేనంటా, ఏదేశమేగినా ఎందుకాలిడినా 

మరువబోకు తెలుగు మాట, నీ వెలుగు బాట

నీ మాటలో దాగుంది తల్లి తెలుగమ్మ

నీ వారసత్వంగా అందించుమాయమ్మా.


తెలుగుకొచ్చిన తెగులు నీవు కాబోకు

అన్ని భాషలనూ ఆదరించు, మాతృ భాష నీవు మరువబోకు 

నీ భాష నీ యాస నీ తెలుగు, నీ సంస్కృతి

నీ సంస్కృతిని కాపాడి చాటుకో నీ స్వంత వ్యక్తిత్వము. 

-------------------------------------------------------------- 60 లైన్స్

 


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.