Friday, July 21, 2023

ఆత్మపరీక్ష - పారమార్థిక పారిజాతాలు

ఆత్మపరీక్ష - పారమార్థిక పారిజాతాలు శిష్యుడు : నేను సాధన చేస్తూ ఉన్నానే కాని నాకు జపతపాదులలో ఆసక్తి జనించడం లేదు, విశ్వాసం కుదరడం లేదు, స్వామీ! వాటిలో ఆసక్తి, విశ్వాసం కుదరాలంటే ఏం చేయాలి? స్వామి : ఆసక్తి అన్నది ఉన్నట్టుండి ఎక్కడనుంచో ఊడిపడదు నాయనా! అందుకు ప్రయత్నం అవసరం, తీవ్రంగా ప్రయత్నించాలి. ఆసక్తి జనించడానికి నీ సామర్థ్యాలను వినియోగించాలి. లౌకిక విషయాలనుంచి నీ దృష్టిని వినియోగించాలి. లౌకిక లంపటాలకై నీ శక్తిసామర్థ్యాలను వ్యర్థం చేయకూడదు. సాధకుడైన వ్యక్తి మనస్ఫూర్తిగా సాధన చేయాలి. భగవదేతర విషయాలను ఏమాత్రం మనస్సులో చొరనీయరాదు. సాధన కొనసాగించాలి, పురోగమించాలి. అప్పుడే మనోవికాసం కలుగుతుంది. అంతమాత్రంతో తృప్తి చెందరాదు. నీలో తీవ్రమైన, మిక్కుటమైన అసంతృప్తి పెల్లుబకాలి. 'నేను సాధించినది ఏం ఉంది? ఏమీ లేదు' అనే మధన ఉండాలి. శ్రీరామకృష్ణులు కూడ జగజ్జననితో, “అమ్మా! జీవితంలో మరో రోజు గడచిపోయింది. కాని నిన్ను దర్శించలేకపోయాను తల్లీ!" అంటూ తీవ్రవ్యాకులతతో మొరపెట్టుకొనేవారట. కాబట్టి నిత్యం మంచి పనుల కోసం ఎంత సమయం వినియోగించావో, నిరర్ధకమైన వాటికోసం కాలాన్ని ఎంత వ్యర్థం చేశావో, ధ్యానంలో ఎంత సమయం గడిపావో, ప్రాలుమాలుతూ ఎంత వమ్ము చేశావో రాత్రి నిద్రపోయేముందు ఒక్కసారి సింహావలోకనం చేసుకోవాలి. ధ్యానాన్ని, బ్రహ్మచర్య దీక్షను చేదోడుగా తీసుకొని మనస్సును పటిష్ఠం చేసుకోవాలి. శ్రీమంతులు తమ దివాణాలకు కావలివారిని నియమించుకొంటారు. ఎందుకు? దొంగలు, పశువులు ఆవరణలోకి జొరబడకుండా చూసుకోడానికి. అట్లే మనిషికి కావలి మనస్సు. ఈ మనస్సు ఎంత దృఢమైతే అంత మంచిది. మనస్సన్నది నిజానికి తంటాలమారి గుర్రం లాంటిది. ఆ గుర్రం రౌతును పెడదారిన పట్టించగలదు. అలాంటప్పుడు రౌతు, చేత కళ్ళేలు బిగించి గుర్రం పెడదారిపట్టకుండా నిరోధించ గలిగినప్పుడే, తాను సరైన దారిలో పయనించ గలుగుతాడు. అవునా? దీనికంతటికీ ముఖ్యం అభ్యాసం, అదే సాధన. సాధనతో ముందడుగు వెయ్యాలి. ఇల్లు అలకగానే పండగయ్యేనా? చెప్పు. కాషాయాంబరాలు ధరించినంత మాత్రం చేత, ఇల్లూ వాకిలి విడిచిపెట్టినంత మాత్రంచేత వైరాగ్యం ఊడిపడుతుందా? పొరబాటు. ఇంతవరకు అనుష్ఠించిన సాధనల వల్ల ఆధ్యాత్మికానుభూతి ఏ మేరకు నీలో కలిగింది? కాలం అనుక్షణం పరుగు తీస్తుంది కనుక క్షణం కూడ వృథా చెయ్యరాదు. స్థిరచిత్తం లేకుండా, నిరాసక్తతతో ఇలా జపతపాదులు మహా అయితే మూడు నాలుగేళ్ళు చేస్తావు, అంతే. ఆ తరువాత వయస్సు పైబడేకొద్దీ శరీరదార్ధ్యం సన్నగిల్లుతుంది, మనోబలం తగ్గుతుంది. కాబట్టి శ్రద్ధతో చెయ్యనిది ఏదీ సిద్ధించదని బాగా గుర్తుంచుకో. మొదట మోక్షాసక్తి, భగవద్భక్తి, జపతపాలపై అనురక్తి ఉంటే చాలు, సాధన తరువాత చూసుకోవచ్చులే అనుకొంటే చాలదు. ఆశయం ఎంత ముఖ్యమో, ఆచరణా అంతకంటే ముఖ్యం అన్న విషయం మరచిపోకూడదు. వేకువ కాకుండా పగటిని చూడగలమా? చూడలేము. ఈ ప్రేమ, శ్రద్ధాభక్తులు అనేవి భగవంతుని పరివారం కదా! నియమనిష్ఠలు తపస్సాధనలు లేకుండా ఏదీ సిద్ధించదు. శ్రమించకుండా ఎవ్వరూ దేన్నీ సాధించలేరు! భగవత్సాక్షాత్కారం పొందడానికి అవతారపురుషులు సైతం ఎంతటి కఠోర తపస్సు చేయవలసి వచ్చిందో లోకవిదితమే కదా! బుద్ధుడు, ఆదిశంకరుడు ప్రభృతులు తమ జీవితంలో ఎంతటి కఠోర నియమాలను పాటించారు! వారిది ఎంతటి మహోన్నత వైరాగ్యం! అందుకే ప్రారంభంలోనే లక్ష్యం కుదరదు, క్రమక్రమంగా తప్ప అంటున్నాను. అనుభూతి కలగాలి. విశ్వాసం ఏర్పడాలి. సాధకునిది గుడ్డినమ్మకంగా తోచవచ్చు. కాని గురూపదేశాన్ని గాని లేదా మహనీయుల బోధనలనుగాని ఆలంబనగా చేసుకొని ముందంజ వేయడం నేర్వాలి. ముత్తెపు చిప్పను ఉదహరిస్తూ శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు: స్వాతి వానచినుకు కోసం సముద్ర ఉపరితలంపై ముత్యపు చిప్ప విచ్చుకొని తేలుతూ ఉంటుంది. దాన్లో చినుకు పడగానే అది దాన్ని పదిలంగా సముద్ర గర్భంలోకి తీసుకునిపోయి చక్కని ముత్యంగా మలచుకొంటుంది. అట్లే గురుకృప అనే వానచినుకు నీకు లభించినప్పుడు ముత్తెపు చిప్పలా నువ్వూ ఆనందసాగరంలో మునిగి బ్రహ్మసాక్షాత్కారమనే ముత్యాన్ని సంతరించుకోగలవు. అందుకు ముఖ్యంగా ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి. తీవ్రంగా ప్రయత్నించాలి. ప్రయత్నం లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో విజయం సాధించలేవు. తీరైన నిష్టను చేపట్టి, సాధనను అనుష్టించాలి. కనీసం మూడు నాలుగేళ్ళపాటు అయినా కృషి చేయాలి. అంత సాధనానుష్ఠానం చేసినా నీకు ప్రత్యక్షంగా ఎలాంటి అనుభూతి, ఆనందం కలుగకుంటె, అలా బోధించినందుకు వచ్చి నన్ను నిందించు. రజో, తమోగుణాలను దాటి సత్త్వగుణాన్ని అలవరచుకొని నిష్టాపరుడవు కానిదే, జపధ్యానాలు సాధ్యం కావు. ఆ తరువాత సత్త్వగుణానికీ అతీతుడవై పునరావృత్తి రహితమైన తురీయావస్థకు చేరుకోవాలి. మానవజన్మ ఎంతో పావనమైంది. ఎంతో సుకృతం ఉంటేగాని మానవజన్మ లభించదు. మానవుడు ఒక్కడే పరమాత్మను దర్శించగలడు. భగవత్సాక్షాత్కారం పొందడమే మానవజన్మకు పరమ లక్ష్యం కావాలి. ఆ పరమాత్మ దివ్యదర్శనం నిమిత్తం తిరుగులేని ప్రయత్నం చేసి ఈ జన్మలోనే తరించాలి, స్థూలావస్థ నుండి సూక్ష్మావస్థను, అక్కడ నుండి కారణావస్థను, పిదప అంతకు మించిన మహాకారణావస్థను, చివరకు సమాధి స్థితిని పొందేటట్లు మనస్సును పరిపక్వం చేసుకోవాలి. భగవంతునికి పరిపూర్ణంగా ఆత్మార్పణం గావించుకోవాలి. భగవంతుడే సర్వం. 'సర్వం ఖల్విదం బ్రహ్మం' - సకలమూ ఆ బ్రహ్మమే, అంతా ఆయనదే అనుకోవాలి. లాభనష్టాల గురించి లేనిపోని బేరీజులు వేస్తూ కూర్చోరాదు. అపోహలు పెంచుకోరాదు, తటపటాయించరాదు. పటిష్టమైన, నిర్దిష్టమైన సాధనను అనుష్ఠించాలి. సాధనలు అనుష్ఠించకుండా అనుకోగానే ఆత్మార్పణం చేయడం సాధ్యం కాదు నాయనా! అదే సాధ్యమైతే సర్వం సిద్ధించినట్లే. కనుక అందుకు వలసినంత ప్రయత్నం చేయాలి. మానవుడి ఆయుశ్శు మహా అయితే నూరేళ్ళు. సార్థకమైన జీవితాన్ని శాశ్వతమైన ఆనందాన్ని పొందగోరితే ఈ లౌకికమైన, అస్థిరమైన నూరేళ్ళ సుఖభోగాలకు స్వస్తి చెప్పాలి. * భగవంతుడు ఉన్నాడు స్వామి : సర్వదా భగవంతుని పాదపద్మాలనే ఆశ్రయించు; ఎలాంటి పరిస్థితుల్లోను వాటిని వీడకు, భగవన్నామాన్ని సదా జపిస్తూ ఉండు. లౌకిక వ్యవహారాల్లోపడి నీ అమూల్యమైన సమయాన్ని వ్యర్థం చేయకు. ఇతర విషయాల నుంచి నీ మనస్సును నియంత్రించి, భగవంతునిపై లగ్నం చేయడానికి ప్రయత్నించు, తీవ్రంగా ప్రయత్నించు. ఆధ్యాత్మిక జీవనంలో, తదనుభూతిలో ఎంత ఆనందం నిక్షిప్తమై ఉందో, మహత్తు ఉందో అప్పుడు గాని నీకు బోధపడదు. ఈ జన్మలోనే, అంటే ఈ జీవితంలోనే మాయకు అతీతుడవైపోవాలి. ఆధ్యాత్మిక సాధనానుష్ఠానాలకు పూనుకొంటేనేగాని, ఆత్మనిష్ఠను పాటిస్తేనేగాని మాయను అతిక్రమించడం సాధ్యం కాదు. అందుకు ముఖ్యంగా కావలసింది విశ్వాసం, పరిపూర్ణ విశ్వాసం. ఎలాంటి సంశయాన్నీ మనస్సులో చొరనీయరాదు. శిష్యుడు : ఒకవేళ సంశయం కలిగితే? స్వామి : ఆత్మసాక్షాత్కారం పొందనంత వరకు మనస్సును అనేక సంశయాలు తొలుస్తూనే ఉంటాయి. అలా సంశయాలు తలఎత్తినప్పుడే భగవంతుని 'సర్వం నువ్వే' అంటూ శరణువేడాలి. ఇలా సమాధానపరచు కోవాలి. 'భగవంతుడు ఉన్నాడు. నా మనస్సు మలినంగా ఉన్నందుననే భగవంతుని దర్శించలేకపోతున్నాను. ఆయన నన్ను అనుగ్రహించిన నాడు, నా మనస్సు పరిశుద్ధమై తీరుతుంది. అప్పుడు నేనా పరంధాముని దర్శించే అదృష్టానికి నోచుకొంటాను.' భగవంతుడు మనోబుద్ధులకు అతీతుడు. నీకు కనిపించే ఈ బాహ్యప్రపంచం యావత్తు కల్పితమైనది. కళ్ళ ముందు కనబడే ప్రపంచం మాత్రమే మనిషి మనస్సుకు అవగతమౌతుంది. ఆ మనస్సుకు ఉన్న శక్తి అంతవరకే పరిమితం. అన్నిటికీ కర్త మనస్సే, ఆ పరిధిని అది దాటిపోలేదు, అధిగమించలేదు. కాని మనిషి హృదయం వెనుక సూక్ష్మరూపంలో మరో హృదయం ఉంది. అదే మూలాధారం. జపధ్యానాదుల వలనా, ప్రార్ధనల చేతా హృదయవికాసం కలుగుతుంది. దానివలన ఒక నూతన దృష్టి దివ్యదృష్టి, అంటే జ్ఞానదృష్టి జనిస్తుంది. అప్పుడు సాధకుడు అనేక ఆధ్యాత్మిక రహస్యాలను ఆవిష్కరించుకో గలుగుతాడు. అంతమాత్రాన లక్ష్యం సిద్ధించినట్లు భావించరాదు. బీజరూపంలో ఉన్న సూక్ష్మ అంతఃకరణానికి భగవంతుని దర్శించగలిగినంత శక్తిలేదు. అది మానవుణ్ణి భగవంతునికి సన్నిహితుణ్ణి చేస్తుంది. అంతే. ఆ స్థితిని చేరుకొన్నప్పుడు మనిషికి ప్రపంచం యావత్తు నిస్సారంగా కానవస్తుంది. ఇక ఇప్పుడతడి మనస్సు భగవచ్చింతనలో లగ్నమైపోతుంది. తరువాత స్థితి సమాధి స్థితి. ఆ స్థితిలో కలిగే అనుభవం, ఆనందం వర్ణనాతీతం; మాటల్లో చెప్పలేనిది, అనుభవైకవేద్యమే. ఈ దివ్యానుభూతిలో సుఖదుఃఖాలుగాని, చీకటి వెలుగులు గాని ఉండవు. సమస్తం భగవత్స్వరూపంగానే గోచరిస్తుంది. అది అనిర్వచనీయం. శిష్యుడు : అయితే మా సాంసారిక విధులను మేము ఎలా నిర్వర్తించాలి స్వామీ? స్వామి : కర్తవ్య దృక్పథంతో నిర్వర్తించాలి. మనిషి భగవంతుని చేతిలోని ఒక ఉపకరణం మాత్రమే అన్న సంగతి నిరంతరం గుర్తుంచుకోవాలి. అన్నిటికీ భగవంతుడే కర్త, నువ్వు నిమిత్తమాత్రుడవు అన్న సంగతి నీ హృదయంలో పాదుకోవాలి. నీ మనస్సు సదా ఆసచ్చిదానంద స్వరూపునిపై కేంద్రీకృతమై ఉండాలి. ఐహిక కార్యకలాపాలలో మునిగిపోయి నువ్వు నీమనస్సును భగవంతుని మీద లగ్నం చేయలేకపోవచ్చు; నీలో అహంకారం తలెత్తవచ్చు; అపజయం ఎదురుకావచ్చు. అయినా అధైర్యం చెందకూడదు, పట్టువీడరాదు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరాదు, బెంబేలు పడకూడదు. మరింతగా ప్రయత్నం చేయాలి. ఎన్నిసార్లయినా సరే ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే ఉండాలి. 'హతోవా జిత్వావా' అన్నట్లు మరణమో, జయమో తేల్చుకోవాలి అంతే. ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారం పొందాలి అన్నదే నీకు మూలమంత్రం కావాలి. 'భగవత్ప్రాప్తికి తోడ్పడని శరీరం, మనస్సు ఉండి ఏం ప్రయోజనం?' అన్న భావన రావాలి. ఒకవేళ లక్ష్యం సిద్ధించకుండానే, ప్రయత్నంలో ఉండగానే మరణం సంభవిస్తే! ఇక దాన్ని గురించిన ఆలోచన అసంగతం, అప్రస్తుతం. భగవత్రాప్తికి మార్గాలు శిష్యుడు : స్వామీ! లక్ష్మీనారాయణాది దేవతామూర్తులు పురాణ కల్పితాలా? యథార్థాలా? పూజాది కర్మకాండ పట్ల నా భావన ఏ రీతిలో ఉండాలో సెలవియ్యండి. స్వామి : ఈ దేవతామూర్తులన్నీ కూడ ఒకే పరతత్త్వానికి చెందిన వివిధ తేజోరూపాలే నాయనా! మానవులు తమ తమ మనోభావాలను బట్టి భగవంతుని అనేక రీతుల్లో ఉపాసిస్తూ ఉన్నారు. విభిన్న మనోప్రవృత్తులను సంతృప్తి పరచడానికి, భగవత్ప్రాప్తికి వేదశాస్త్రాలు నాలుగు ప్రధాన మార్గాలను సూచిస్తున్నాయి. ఆ మార్గాలలో ఒకటి కర్మకలాప సంబంధమైన ఉపాసనామార్గం. భగవంతుణ్ణి విగ్రహరూపంలోగాని, చిత్రపటం రూపంలోగాని ఆరాధించడం. జపం, ప్రార్థనల ద్వారా దైవారాధన చేయడం ఇంకా ఉత్కృష్టమైనది. సాధకుడు తన ఇష్టదేవతా స్వరూపాన్ని ధ్యానించడం, ప్రార్ధించడం, జపించడం అన్నమాట. వీటన్నిటికంటె విశిష్టమైనది ధ్యానమార్గం. 'ధ్యానం' తైలధారావదవిచ్ఛిన్న స్మృతి సంధాన రూపమ్' - అంటే ఒక పాత్రనుంచి మరొక పాత్రలోకి ఏకధారగా పోసే చమురులా ఇష్టదైవాన్ని గురించిన ఎడతెగని భావపరంపరా ప్రవాహమే ధ్యానం. ఈ రకమైన ఉపాసనా పద్దతిని అవలంబించినప్పుడు సాధకుడు ఇష్టదేవతా సందర్శనలాలసుడై భావనాప్రవాహంలో మునిగిపోతాడు. అప్పుడిక ప్రార్ధనకుగాని, జపానికిగాని అవకాశం ఉండదు. కాని తాను వేరు, భగవంతుడు వేరు అంటే “నువ్వు, నేను' అనే ద్వైత భావాన్ని కలిగి ఉంటాడు. గురుకృప - స్వామి : నేడు అనేకులు తమ జీవితాన్ని దేశ సేవకు, మానవ సేవకు అర్పించాలని భావిస్తున్నారు. ఆధునిక విద్యాప్రభావం చేతనే ఈ భావన దేశీయుల మెదడుల్లోకి జొరబడిందేమోనని నా నమ్మకం. సహృదయుడు, సద్వర్తనుడు అయివుంటేగాని ఇతరులకు మేలు ఒనరించలేడు. భగవంతుని శరణుపొంది, భగవత్కృపాపాత్రుడైన వాడెన్నడూ తప్పటడుగు వెయ్యలేడు. అలాంటి వ్యక్తుల జీవితమే లోకకళ్యాణానికి వినియోగపడుతుంది. అతడి ప్రతి చర్యా, ప్రతి మాటా, అంతదాకా ఎందుకు అతడి జీవిత విధానమే లోకుల క్షేమానికే వినియోగపడుతుందనడం తథ్యం. మొదట మూలస్తంభాన్ని పుచ్చుకోమనేవారు శ్రీరామకృష్ణులు. అంటే ఈ దుర్లభమైన మానవ జన్మను ప్రసాదించిన ఆ సర్వేశ్వరుని సాక్షాత్కారం పొందమని భావం. మాధవునిలో ప్రగాఢ విశ్వాసం అలవరచుకొని మానవసేవ ఒనరించు. భగవత్ప్రేరణ జనించి, తాను కేవలం నిమిత్తమాత్రుడననే భావన కలిగితే తనకూ శాంతి, తనవల్ల ఇతరులకూ శాంతిని చేకూర్చినవాడు కాగలుగుతాడు. 'తన అనుంగు బిడ్డలైన భక్తుల హృదయసీమలో భగవంతుడు విరాజిల్లుతూ ఉంటాడు' అనేవారు శ్రీరామకృష్ణులు. కనుక మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధ హృదయమే భగవన్నిలయం. అపవిత్రమైన హృదయానికి భగవంతుడు సుదూరంలో ఉంటాడు. మన హృదయం మాలిన్యరహితమై, అద్దంలా స్వచ్ఛంగా మెరుస్తూ, పూర్వవాసనలన్నీ తొలగిపోతేనే, భగవంతునికి అది నివాసయోగ్యం అవుతుంది. అప్పుడే భక్తునికి భగవత్సాక్షాత్కారం కలుగుతుంది, నాయనా! మనస్సు నిర్మలంగా ఉన్నప్పుడే భగవద్రూపం విస్పష్టంగా గోచరిస్తుంది; అద్దం కనుక మలినంగా ఉంటే ప్రతిబింబం కనబడుతుందా? ఆ అద్దం అసలు దేనినీ ప్రతిబింబింప చేయలేదు కదా! అట్లే హృదయం మలినమైనప్పుడు భగవంతుని ప్రతిబింబం భాసించదు. ఇప్పుడు మీరందరూ పిన్నవయస్కులు. మీలో ఏ మాలిన్యం సోకదు. కాబట్టి మీ హృదయ పీఠాన్ని భగవన్నివాసానికి అనువుగా సంసిద్ధం చేయండి. అప్పుడు దాన్లో మరిదేనికీ స్థానం ఇవ్వరాదు. మీరందరూ పరిశుద్ధులై, శాంతచిత్తులై ఉండండి. ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారం పొందండి. పవిత్ర గ్రంథాలను పఠించడం అలవరుచుకోండి. పనికిమాలిన పుస్తకాలు చదువుతూ కాలాన్ని వృథా చేసుకోకండి. భగవంతునిపట్ల భక్తి విశ్వాసాలు ప్రేరేపించని గ్రంథాలు నిరుపయోగం. అవి పాండిత్య పటాటోపానికి మాత్రమే తగును. నాయనా! దుర్లభమైన ఈ మానవ జన్మను ధన్యం చేసుకోవాలనే తలంపే ఉంటే, ఆత్మోన్నతిని పొందాలనుకొంటే భగవన్నామాన్ని ఆశ్రయించు. ధ్యానసాగరంలో మునిగిపో, ఉత్తినే పైపైనే తేలుతూ ఉండిపోక, అట్టడుగుదాకా రత్నాకరంలో మునిగితేగాని దాన్లోని రత్నాలు చేజిక్కవు సుమా! 'సంగరాహిత్యమే' మానవ జీవిత ఆదర్శమని చాటిచెప్పడానికే శ్రీరామకృష్ణులు ఈ యుగంలో అవతరించారు. మనిషి విషయ సుఖాల వెంట పరుగులు పెడుతూ పశుప్రాయుడైపోతున్నాడు. నీ జీవితాన్ని సార్థకం చేసుకోదలిస్తే, భగవంతుని ఆశ్రయించు. క్షణికమైన ఈ విషయ సుఖాలను విడిచిపెట్టి నీ జన్మహక్కు అయిన శాశ్వతానందాన్ని సముపార్జించుకో. విడిచిపెట్టు, ఈ సంసార మోహాన్ని విడిచిపెట్టు. భగవత్ప్రప్తికోసం సమస్తం విడిచిపెట్టవలసిందే. త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ నువ్వే తల్లివి, నువ్వే తండ్రివి, నువ్వే నా సఖునివి, బంధువు, నువ్వే నాకు సర్వస్వం అని హృదయపూర్వకంగా భావన చేయాలి. తుచ్ఛమైన లౌకిక భోగాల జోలికి పోక, భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆయన గుణాలను మననం చేస్తూ కాలం గడిపి మానవజన్మను ధన్యం చేసుకోవడంలోనే నిజమైన సౌఖ్యం ఉంది నాయనా! దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహహేతుకమ్ | మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయమ్ || -వివేకచూడామణి మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయం - భగవత్సాక్షాత్కారం పొందాలంటే ఈ మూడే ప్రధానమైన సాధనాలని తెలుసుకో. భగవదనుగ్రహం చేత ఈ మూడు లభించాయి కనుక వీటిని సద్వినియోగం చేసి నీ జీవితం వ్యర్ధం కాకుండా నిన్ను ఉద్ధరించుకోవాలి. తాత్కాలికమైన సుఖాలకై దేవులాడక, శాశ్వతానందంకోసం ప్రాకులాడు. మరో మానవజన్మలో మోక్షం దక్కవచ్చునేమోగాని నీకిప్పుడు లభించిన మహాపురుష సాంగత్యం మాత్రం లభ్యం కాకపోవచ్చు అనే సంగతి మాత్రం మరచిపోకు. ఇది మహాదుర్లభం, అనేక జన్మార్జిత పుణ్యఫలం. అనన్య సామాన్యమైన అదృష్టం. అందుకే శ్రీరామకృష్ణుల శిష్యబృందంలో చేరి ఆయన అండను పొందగలిగావు. కొరగాని పనులు చేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు నాయనా! శ్రద్ధ! గురువు వచనాల మీద అత్యంత శ్రద్ధ కలిగి ఉంటే, నీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు. గురువాక్యంపట్ల శ్రద్ధ లుప్తమైతే పరమార్థాన్ని సాధించలేవు. జీవితం నిష్ఫలమైపోతుంది. మార్జాల కిశోరం తల్లిని ఆశ్రయించినట్లు జీవి భగవంతుణ్ణి ఆశ్రయించాలి, అంటిపెట్టుకొని ఉండాలి. అలా ఆశ్రయించిన నాడు భగవంతుడే నీకు అండగా, తోడునీడగా ఉండి నిన్ను పరిరక్షిస్తాడు. నీకున్న తెలివి జ్ఞానసాగరంలో ఎంత దూరం తోడ్కొని పోగలదో తెలియదు కనుక గురువు సాయం అవసరం. భగవంతుడు అవాజ్మానసగోచరుడు కనుక భగవదనుగ్రహం పొందాలంటే గురువు సాయం ఉండేతీరాలి. ఆయన నీ బాధ్యతను స్వీకరిస్తాడు. తన అశేషప్రజ్ఞతో నువ్వు భ్రాంతి ప్రమాదాలకు లోనుకాకుండా, నీస్థితిగతులను అవగతం చేసుకొని నిన్ను కాపాడతాడు. జ్ఞాన సాధనలో గురువు నీ కంటె ఎంతో అధికుడు కనుక అటువంటి సద్గురుచరణాలను ఆశ్రయించిన వారికి ఎలాంటి అధోగతీ వాటిల్లదు. ఆ దేవదేవుని జాడ తెలుసుకునే వరకు మానవుడు నానా రకాల భ్రాంతులకు, ప్రమాదాలకు గురికావలసిఉంటుంది, ఎదుర్కోవలసి ఉంటుంది. అతడు కనుక సద్గురువు శరణు పొందితే చాలు, ప్రమాదాలకు గురికావలసి ఉండదు. 'తండ్రి బిడ్డ చెయ్యిపుచ్చుకొన్నప్పుడు బిడ్డ క్రిందపడిపోయే ప్రమాదం ఉండదు’ అనేవారు శ్రీరామకృష్ణులు. తెలిసో తెలియకో నువ్వు తప్పులు చేసినా గురువు వాటిని సరిదిద్దుతాడు. త్యాగం వల్లనే శాంతి చేకూరుతుంది. శ్రేయస్సిద్ధిని, శాంతిని పొందాలనుకొంటె వైరాగ్యం అవలంబించు. భగవన్నిమిత్తం సర్వమూ త్యజించాలి సుమా! మనస్సు రాగద్వేషాధీనం అవుతూ ఉంటుంది. కాని మానవుడు దాన్ని నిగ్రహించగలగాలి. సంకల్పశక్తిని సంతరించుకొని, భగవంతుని నిమిత్తం సర్వమూ త్యజించి మనిషి నిస్సంగి, విరాగిగా మారితే తప్పక నారాయణుని దర్శించ గలుగుతాడా నాయనా! సన్న్యాసానికి, కాషాయాంబరధారణకు నిజానికి ఎటువంటి సంబంధమూ లేదు. కావిగుడ్డలు కట్టినంత మాత్రాన కామినీ కాంచన త్యాగినని చెప్పనగునా? సన్న్యాసం, త్యాగం ఆడంబరార్థం కావని గుర్తుంచుకో. కించిత్తు స్వార్ధం కూడ లేకుండా భగవంతునికి పూర్తిగా తనను అర్పించుకొన్నవాడే, ఆత్మార్పణ చేసుకొన్నవాడే నిజమైన సన్న్యాసి. “సర్వేశ్వరా! ఈ నా దేహం, బుద్ధి సర్వం నీకు సమర్పించుకొంటున్నాను. ఇవన్నీ నువ్వే, వీటిని ఉపకరణాలుగా వినియోగించుకో” అంటూ సదా సర్వవేళలా భగవంతుని ప్రార్థించాలి. “పరమేశ్వరా! నాకు శుభాశుభాలంటే ఎలాంటివో తెలియదు. నేను నీ వాణ్ణి. పాలముంచినా, నీటముంచినా నీదే భారం తండ్రీ!" అంటూ వేడుకోవాలి, సదా ఇట్లే ఉండాలి నీ ప్రార్ధన. భగవంతుడు తప్ప వేరే గతి లేదని భావించాలి. మరో ముఖ్య విషయం గమనించాలి. భగవత్సాక్షాత్కారమే మానవ జీవిత పరమ లక్ష్యమని తెలుసుకొన్నావు కదా! జనం నిన్ను దూషించినా, గౌరవించినా, తృణీకరించినా, సముచిత స్థానం లభించినా లభించకున్నా, శరీరం ఉన్నా - శిథిలమైపోయినా నీ ఆదర్శాలను నియమనిష్ఠలను ఏమాత్రం విడిచిపెట్టరాదు సుమా! ఎట్లైనా ఈ జన్మలోనే భగవత్సాక్షాత్కారం పొందితీరాలనే దృఢనిశ్చయంతో ఉండాలి. నీ జీవితాన్ని ఈ తీరుగా మలచుకోగల శక్తిమంతుడవైతే నువ్వు భగవాన్ శ్రీరామకృష్ణుల సంతతి అని నమ్ముతాను; సాధుసాంగత్యంలో నీ జన్మ పావనం చేసుకొన్నావని గ్రహిస్తాను. మరో సంగతికూడ గమనించు. గురువు అంటే ఎవరు? బ్రహ్మజ్ఞాని. నీకే తెలుసు కదా! తనకే దారి తెలియనివాడు ఇతరులకు దారి చూపగలడా? కనుక గురువు సర్వవిదుడన్న విషయం గుర్తుంచుకోవాలి. మంత్రానికి ఎంతో మహిమ ఉంటుంది. కాని జ్ఞానహీనులు కొందరు స్వార్థపరులై మతం, ధర్మం పేరిట శ్రీరంగనీతులు వల్లిస్తూ, బూటకపు గురువులై మంత్రోపదేశం చేస్తుంటారు. ఆ ఉపదేశాలకు బలం, శక్తి ఉండదు. అవి నీకు శాంతిని చేకూర్చలేవు, జ్ఞానాన్ని కలిగించేపాటి సమర్థత వాటికి ఉండవు. శ్రీరామకృష్ణుల శిష్య, ప్రశిష్యుల సన్నిధికి వచ్చిన నువ్వు నిజంగా ధన్యుడవు నాయనా! శ్రద్ధాభక్తులు కలిగి, నిష్కపటి అయితే అతడు శ్రీరామకృష్ణుల అండను చేరవలసినవాడే సుమా! ఈ యుగంలో నిజమైన శాంతి లభించేది ఆ ఒక్క చోటనే. శ్రీరామకృష్ణులు మహోన్నత ఆదర్శాలకు ప్రతిరూపం, శాశ్వతానందానికి సర్వాధికారి. భగవంతుని ప్రాప్తించుకోవడానికి వలసిన వివిధ సాధనా మార్గాలు శ్రీరామకృష్ణుల శిష్యులకు కరతలామలకమే. నీ అదృష్టంకొద్దీ నీకు ఏ మార్గం ఉపదేశం ద్వారా నిర్దేశించారో, నువ్వు ఆ మార్గంలోనే పురోగమించు. మనసారా గురువును ప్రార్థించు. ఆయన భౌతికంగా ఉన్నా, లేకపోయినా కూడ నీకు మార్గం చూపుతాడు. నిజమైన గురువు శరీరం త్యజించిన పిదప కూడ తాను అదృశ్యంగా ఉండి తన శిష్యులను తరింప తోడునీడై ఉంటాడు నాయనా! సాధనలు అనుష్ఠించు, తీవ్రంగా అనుష్ఠించు. సమస్త సంశయాలను వదలిపెట్టు. గురువు చూపిన మార్గంలో సాధన కొనసాగించు. నీ సాధన తీరుతెన్నులను వెల్లడించకు, గుప్తంగా ఉంచు. ఏకాంతంగా ఏ మూలనో, లేదా ఏ వనానికో వెళ్ళి గోప్యంగా నీ హృదయాంతరాళంలో ధ్యానించమని గురుదేవుల వాక్కు. కొంతకాలం ఆ రకంగా ధ్యానాన్ని కొనసాగించు. ఆ ధ్యానలీనమైన జీవితం ఎంత వినోదంగా, ఆహ్లాదకరంగా ఉంటుందో అప్పుడు నీకే తెలుస్తుంది. నీ మనస్సులో, ఆలోచనల్లో, ఆచరణలో ఎంతో మార్పు పొందుతావు. బ్రహ్మజ్ఞాని అండ లభించిన వారు ఆందోళన చెందనక్కరలేదు. వారు ఎన్నటికీ విజయులే! గురుకృప అంటే అదే!

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.