Saturday, September 30, 2023

అలుపెరగని పోరాటంతోనే..సిరికొండ మధుసూదనాచారి


 నమస్తే తెలంగాణ

అలుపెరగని పోరాటంతోనే..

సిరికొండ మధుసూదనాచారి

(ఎమ్మెల్సీ, తెలంగాణ తొలి స్పీకర్, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు)

రాజకీయ పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రజలకు చేస్తున్న మోసాన్ని పొత్తుల ద్వారా బయటపెట్టి ఉద్యమాన్ని ఉధృతం చేసిన చాణక్యం కేసీఆర్ ది. కమిటీల పేరుతో, ప్రకటనల పేరుతో కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాలయాపన చేసినా త్యాగాల పంథా వీడకుండా పోరాడిన సహనం ఆయన సొంతం. తన ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ప్రజల సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ప్రపంచ ఉద్యమాల చరిత్రలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక అపురూప ఘట్టంగా నిలిపారు.

గాంధీజీ ప్రవచించిన అహింసా పంథాలోనే

తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉద్యమించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఉద్యమం హింసకు దారితీసి, ఏ ఒక్కరికి నష్టం కలిగించినా అది ఉద్యమ స్ఫూర్తికే విఘాతమని

కేసీఆర్ భావించారు. అందుకే నాయకులను, కార్యకర్తలను

శాంతియుత మార్గంలో ముందుకు నడిపించారు. 1969 ఉద్యమంలో తెలంగాణ వ్యతిరేకులు హింసకు పాల్పడి దానిని తెలంగాణవాదులపై మోపారు. అలాంటి ప్రమాదానికి ఆస్కారం లేకుండా జాగ్రత్తపడి, గాంధేయ మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని తీరానికి చేర్చారు కేసీఆర్. ఆ తరువాత 2009 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పోటీ చేసింది. టీఆర్ఎస్ అనుకున్నన్ని స్థానాలు సాధించకపోవడంతో దాన్ని ఆసరాగా చేసుకొని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ను కనుమరుగు చేసే కుట్ర పన్నింది! ఆ సందర్భంగా నిరాశలో ఉన్న నేను ఆచార్య జయశంకర్ సార్ను కలిశాను. ఆందోళనతో 'తెలంగాణ సాధ్యమా?' అనే సంశయాన్ని వెలిబుచ్చాను.

'రాష్ట్ర సాధన పట్ల పూర్తి నిబద్ధత కలిగి, తెలంగాణ సమస్యల పట్ల, వనరుల పట్ల,

ప్రజల పట్ల సంపూర్ణమైన అవగాహన గల నాయకుడు కేసీఆర్. తెలియని విషయాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలనే జిజ్ఞాస ఉన్న వ్యక్తి. తనకు తెలిసిన అంశాన్ని ప్రజలకు అర్థమయ్యే భాషలో గుండెకు హత్తుకునేలా చెప్పడంలో దిట్ట. ప్రజలను సమీకరించడంలో, వారిని శక్తిగా మలచడంలో, ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే పసిగట్టి వాటికి పైఎత్తులు వేసి చిత్తు చేయగల రాజకీయ దురంధరుడు. నిధులు సమకూర్చడంలో, ఎన్నికల్లో పార్టీని గెలిపించడంలో, వ్యూహరచనలో అపారమైన ప్రజ్ఞాశాలి. తనవల్ల, తనతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమవుతుంది, కేసీఆర్ తో  సాధ్యం కాకుంటే తెలంగాణ 'రాష్ట్రం కల్ల' అని జయశంకర్ సార్ అన్నారు. కేసీఆర్ సామర్థ్యాన్ని ఆయన ప్రబలంగా విశ్వసించారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో త్యాగాల చరిత్రకు ఆద్యుడు ఆచార్య జయశంకర్ సార్. నూనూగు మీసాల ప్రాయంలోనే తెలంగాణను ఆంధ్రాతో కలిపితే నీళ్లు,నిధులు, నియామకాలు కొల్లగొట్టబడతాయని గ్రహించి జ్ఞాని. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ వాదమనే దీపాన్ని ఆరిపోకుండా కాపా డి, ఎందరిలోనో స్ఫూర్తిని నింపారు. కేసీఆర్కు మార్గదర్శి అయ్యారు. మహాకవి కాళోజీ నారాయణరావు అన్న 'పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది' మాటలు ఆచార్య జయశంకర్ సార్కు వర్తిస్తాయి. తెలంగాణ కోసం బ్రహ్మచారిగా ఉండి జీవితాన్ని తెలంగాణ వాదానికి అంకితం చేసిన ఆయన, రాష్ట్రం సాకారమవడానికి మూడేళ్ల ముందు మరణించారు.

2004లో కాంగ్రెస్, 2009లో తెలుగుదేశం తెలంగాణకు అనుకూలమని ప్రకటించి టీఆర్ఎస్ తో  పొత్తుపెట్టుకున్నాయి. ఎన్నికలలో గెలిచి కాంగ్రెస్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి తెలుగుదేశం ద్రోహం చేశాయి. రెండు పార్టీలతో పొత్తు పెట్టుకొని వారి ద్రోహ స్వరూపాన్ని బట్టబయలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నిఖార్సైన పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని ప్రజలు గ్రహించేలా చేయడం కేసీఆర్ వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యం.

తన చివరి అస్త్రంగా 2009 నవంబర్ 29న తెలంగాణ జైత్రయాత్రో-కేసీఆర్ శవ యాత్రో' అనే కఠిన నిర్ణయంతో ఆమరణ నిరాహారదీక్షకు బయలుదేరిన కేసీఆర్ను అలుగునూరు వద్ద అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలించారు. దీంతో భగ్గుమన్న తెలంగాణ ఉద్యమంతో అట్టుడికింది. ఈ క్రమంలో శ్రీకాంతాచారి ఎల్బీ నగర్ చౌరస్తాలో తనను తాను కాల్చుకొని తొలి అమరుడయ్యాడు. సత్వరమే కేంద్రం తెలంగాణ ప్రకటన చేయాలనే డిమాండ్తో యువకులు అత్మబలిదానాలకు పాల్పడ్డారు. ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్ ఆరోగ్యం క్షణక్షణానికి క్షీణిస్తూ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని గమనించిన కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. అయితే ఈ ప్రకటనను జీర్ణించుకోలేని తెలంగాణ వ్యతిరేకులు మరో కుట్రకు తెర లేపారు. నకిలీ ఉద్యమాలు, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో కేంద్రంపై ఒత్తిడి పెంచి తెలంగాణపై యూటర్న్ తీసుకునేలా చేశారు. ఈ దుర్మార్గపు చర్యలతో తెలంగాణ ఉద్యమం మరో మారు తీవ్ర రూపం దాల్చింది. కేంద్రం ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి శ్రీకృష్ణకమిటీని నియమించి కాలయాపన చేసే కుట్ర చేసింది.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత కూడా కేంద్రం నిర్లిప్త వైఖరి ప్రదర్శించడంతో కేసీఆర్, ఇతర ఉద్యమ నాయకుల పిలుపుతో యావత్ తెలంగాణ జాతి ఏకమైంది. సంవత్సరాల తరబడి నిరసనలు, నిరాహార దీక్షలు కొనసాగాయి.

ఏక కాలంలో ఒక నిరసన దీక్షలో ఒకే కుటుంబానికి చెందిన నాలుగు తరాల వారు భాగస్వామ్యం కావడం ప్రపంచ ఉద్యమాల చరిత్రలో అపురూప ఘట్టం. మిలియన్ మార్చ్, సాగర హారం, సకల జనుల సమ్మె, వంటా వార్పు, రాస్తారోకోలు, రైల్ రోకోలు, బతుకమ్మ, బోనాలు, ఆటపాటలు, ధూంధాం, జాతీయ రహదారుల దిగ్బంధం, సకల జనుల సమ్మె వంటి నిరంతర ఆందోళనలతో పల్లెలు, పట్టణాలు అట్టుడికాయి. వ్యక్తిగత లాభనష్టాలను పట్టించుకోకుండా తెలంగాణ సాధనే పరమార్థంగా యావత్ తెలంగాణ జాతి చైతన్యాన్ని ప్రదర్శించింది. ఉద్యమ తీవ్రతతో దేశ, విదేశాల దృష్టిని ఆకర్షించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో మార్గం లేదని భావించిన కేంద్రం 2014లో పార్లమెంట్ ఉభయ సభల్లో తెలంగాణ బిల్లు ప్రవేశ పెట్టింది. చివరగా పార్లమెంటులో అతి హేయమైన పెప్పర్ స్ప్రే వంటి వెకిలి చేష్టలతో ఆ బిల్లును అడ్డుకునే కుట్రలు కూడా జరిగాయి. అటు ఢిల్లీ పాలకులు, ఇటు తెలంగాణ వ్యతిరేకులు ఎన్నెన్నో కుట్రలు పన్నినా వాటన్నింటినీ కేసీఆర్ వజ్ర సంకల్పంతో, త్యాగాల ఆయుధంతో, వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో తుత్తునియలు చేసి, పట్టు వదలని విక్రమార్కుడై జూన్ 2న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు.

ఎండకు ఎండి, వానకు తడిచి, చలికి వణికి తెలంగాణను శిల్పంగా చెక్కింది మన కేసీఆర్. ప్రజలందరినీ సమైక్యపరచి ఉద్యమాన్ని విజయవంతంగా నడిపిన నిజమైన ప్రజాఉద్యమ నాయకుడు ఆయన. యూపీఏ ప్రభుత్వం సజావుగా సాగడానికి నౌకాయాన పోర్ట్ ఫోలియోను తృణప్రాయంగా వదిలిపెట్టడంతో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేసీఆర్ ను  రాజకీయాల్లో కర్మయోగిగా అభివర్ణించారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన ఆత్మకథలో తెలంగాణ రాష్ట్ర సాధన పట్ల కేసీఆర్ కనబర్చిన నిబద్దత, అకుంఠిత దీక్షా దక్షతలను ప్రశంసించారు. తెలంగాణ గత ఉద్యమాలు ఆవేశపూరితం. అందువల్ల ఫలితం సాధించలేక పోయాయి! కేసీఆర్

నాయకత్వంలో సాగిన ఉద్యమం శాంతియుతం, ఆలోచనాభరితం, వ్యూహాత్మకం, జన ప్రభంజనం. ఫలితంగా విజయం సాధించాయి.


No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

Sri Vinayaka Chavithi Puja Vidhanam & Katha

  Vinayaka Chavithi Pooja Vidaanam, Story Vinayaka Chavithi Pooja Vidaanam Vinayaka Chavithi is also known as Vinayaka Chaturthi is the Hind...