Sunday, May 11, 2025

*అమ్మ గాయపడిన కావ్యం* - వనపట్ల సుబ్బయ్య 9492765358

 *అమ్మ గాయపడిన కావ్యం*

•••••••••••••••••••••••••••••






అమ్మకు చదువు రాదు

అమ్మ చేసే పనులన్నీ కవిత్వమే

పొరుకాట చేతపట్టి కల్లాపు చల్లి

వాకిటిని శ్వేతపత్రం చేస్తుంది

రంగుల ముగ్గేస్తే

పదాలు వాక్యాల్ని అల్లినట్లుంటది

తల్లెలు చెంబులు తోమితే

సంగీతం వినిపిస్తున్నట్లుంటది

పుటలను  పేర్చినట్లుంటది

కొడవలి చేతపట్టి

వరి మెద‌లను కట్టకట్టుతుంటే

కవితలను సంకలనంగా పేర్చినట్లుంటది


అమ్మ 

పాటలు పాడుతది

కథలు కూడ చెపుతుంది

విత్తనం నాటినా కోతలకు వొంగినా

ఇసుర్రాయి ఇసిరినా

వడ్లు దంచినా పాటలే పాటలూ...

పొయ్యి దగ్గర రొట్టెలు  ఒక కథ

అమ్మ ప్రతి క్రియలో పదాలు నలుగుతాయి

వంటింట్లో పోపు డబ్బాల్లోంచి మసాల దినుసులు తీసినట్టు

సమాసానికి శబ్దాలంకారాల్ని  తాపిపినట్లుంటది

నోట్లో నీళ్లూరినట్లు 

ఎదనిండా నిండా పదాలే


అమ్మేడుంటే

అక్కడొక గుంపు 

అదొక కవిసమ్మేళనం

భిన్న చర్చలు విభిన్న వాదాలు ఒడువని జీవితాలు

అమ్మను యాది చేసుకోవడం

అమ్మ లేని నేను

అమ్మ గాయపడిన జీవితం

రాస్తే

కన్నీళ్ల  కావ్యం


అమ్మకు వందనాలు

పొద్దుకు విరామం వుంది

విశ్రాంతి  లేనిది అమ్మే

ప్రవహించే నది గురించి

నడిచే దేవత గురించి 

కంటికి వెలుగైన అమ్మ గురించి ఏమి రాయగలం

నా విజయాలన్నింటికి కారణం  అమ్మనే !


అమ్మ జీవితానికి మాటలు సరిపోవు

బొమ్మ వేయాలంటే రంగులు సరిపోవు

అమ్మ గురించి రాయాలంటే 

పదాలు, వాక్యాలుగా, వాక్యాలు కావ్యాలుగా 

ఒక్కరోజు సరిపోదు అమ్మకోసం

అన్నీ రోజులు అమ్మవే

అమ్మకు వందనాలు

◆మాతృదినోత్సవం శుభాకాంక్షలు

వనపట్ల సుబ్బయ్య

11.05.2025

9492765358

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.

NAMASTHE TELANGANA 17JULY2025