Friday, August 25, 2023

#నమస్తేతెలంగాణ#అకుంఠిత_పాలనపై_ఆత్మవిశ్వాసం#వెంకట్గుంటిపల్లి_94949 41001

నమస్తే తెలంగాణ: అకుంఠిత పాలనపై ఆత్మవిశ్వాసం : వెంకట్ గుంటిపల్లి - 94949 41001 చరిత్రను మలుపు తిప్పడంలో, గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపడంలో సీఎం కేసీఆర్ తర్వాతే ఎవరైనా. తన వెంట నడిచే ప్రజా సమూహాలకు ఆశావాదం, ధైర్యం నూరిపోయడంలో తనకు తానే సాటి అని ఆయన మరోసారి నిరూపించారు. దశాబ్దాల తెలంగాణ ఆకాంక్షను సాకారం చేసి దశాబ్దకాలం అధికారంలో ఉన్నా మరోసారి ప్రజల విశ్వాసాన్ని చూరగొనబోతున్నారు. మరోసారి ఎన్నికల కదనరంగంలోకి అడుగుపెట్టారు. తన పాలనకు అద్దంపట్టే కార్యక్షేత్రాన్ని ఎంచుకోవటంలో కేసీఆర్కు సాటి మరెవ్వరూ ఉండబోరనే విషయాన్ని అభ్యర్థుల ప్రకటనతో తేల్చిచెప్పారు. అభ్యర్థులపై వ్యతిరేకత ఉందని కొందరు, మూడోసారి ఎలా అధికారంలోకి వస్తారని ఇంకొందరు, సర్వేల్లో బాగలేదని మరికొందరు చర్చ పెడుతున్న క్రమంలో ఆ చర్చలు పసలేనివని నిరూపించదలచుకున్నారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ సకలజనుల ఇంటి పార్టీ అని, కేసీఆర్ అంటే సబ్బండ వర్గాల నాయకుడని అభ్యర్థుల ప్రకటన ద్వారా ఆయన చెప్పకనే చెప్పారు. ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆదరణ, పాలకుడిగా తాను అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే గీటురాయిగా ఎన్నికలను ఎదుర్కోబోతున్నామని ఆయన నిశ్చితాభిప్రాయంతో వెల్లడించిన తీరు తెలంగాణ ప్రజలపై ఆయనకున్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నది. ఒకేసారి 115 సీట్లు, ఇందులో 98 శాతానికి పైగా సిట్టింగ్లకు అవకాశం ఇచ్చి మరోసారి తన చతురతను చాటడమే గాక విపక్షాలను డైలమాలో పడేశారు. ఎన్నికలకు మూడు నెలల ముందే ఒక రాజకీయ పార్టీ 119 సీట్లకు గాను 114 మంది అభ్యర్థులను ప్రకటించి విపక్ష పార్టీలకు సవాల్ విసరడంతో వ్యూహకర్తలు, విశ్లేషకులు కూడా కేసీఆర్ ఆలోచనలను అంచనా వేయలేకపోతున్నారు. సిట్టింగ్లకు పీట్టివ్వరని, కేసీఆర్ గజ్వేల్లో పోటీ చేయబోరని రకరకాల రాజకీయ ప్రచారాలు చేసిన వాళ్ల నోళ్లు ఇవాళ మూత బడ్డాయి. తెలంగాణ భవన్ వేదికగా అభ్యర్థుల ప్రకటనతో కేసీఆర్కు ఉన్న ఆత్మవిశ్వాసంపై ఇవాళ చర్చ జరుగుతున్నది. తన బలం, బలగం విశ్వాసాన్ని మూడున్నర కోట్ల తెలంగాణ జనం ముందు ఆవిష్కరించి కొత్త చరిత్రను సృష్టించారు. కేసీఆర్ అంటేనే గురిపెట్టిన బాణం లాంటి వ్యూహం, కాలాన్ని సైతం మార్చగల కర్తవ్యం, మంత్రముగ్ధం చేసే మాట, మాటఇస్తే తప్పని కమిట్మెంట్కు నిదర్శనం. తన ప్రజలకు కించిత్తు హాని జరిగినా ఉపేక్షించరని తన రాజకీయప్రత్యర్థులు సైతం ఒప్పుకునే మాటను కేసీఆర్ మరోమారు నిజం చేశారు. కేవలం 9 ఏండ్లలోనే తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దటమన్నది కేసీఆర్కు మినహా మరెవ్వరికీ సాధ్యం కాని మాట. 20 ఏండ్ల కిందట మన మనస్సెట్ల గడబిడ పడ్తుందె? ఇప్పుడేమంటున్నది! మార్పు జరిగిందా? అందులో నిజానిజాలు ఏమిటి? ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలెన్ని? అభూత కల్పనలెన్ని? అనేది తేల్చాల్సింది ప్రజలేనని ఆయన గతానికి వర్తమానానికి మధ్య జరిగిన ప్రగతిని అద్దంలో సాక్ష్యంగా చూపారు. 50 ఏండ్లకు పైగా కాంగ్రెస్ పాలన, పదేండ్లు బీజేపీ అధికారంలో ఉండి కేవలం తొమ్మిదేండ్లు ఈ తెలంగాణకు బీఆర్ఎస్ ఏంచేసిందన్న చర్చమీదే ఎన్నికలు జరుగబోతున్నాయి. కేసీఆర్కు ముందు పాలనా, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక పాలనా అనే చర్చ ఇవాళ దేశమంతటా సాగుతున్నది. తెలంగాణలో ఉన్న సబ్బండ వర్గాలన్నీ ఆయన పాలనకు జేజేలు కొడుతున్నాయి. అందుకే ఆ ప్రజల ఆశీర్వాదంపైనే ఆత్మవిశ్వాసాన్ని కనబర్చి ఆప్రజల సహకారంతోనే 115 సీట్లకు అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం ఎంతో సాహసమనే చెప్పాలి. అందుకే కేసీఆర్ ఏది చేసినా, దాని ఆంతర్యం తెలంగాణ అంతరార్థం తెలంగాణ అని చెబుతుంటారు. తన అధికారాన్ని కాదు; తన తెలంగాణ శాశ్వతంగా ఉండేటట్టు చేస్తున్నాడు కేసీఆర్. అంతేకాదు సహజంగా రాజకీయ పార్టీల విమర్శలు, పార్టీల ప్రచారాలు ఎన్నికలకు అనుగుణంగా, గెలుపోటములను ప్రభావితం చేసేలా ఉంటాయి. కానీ ఇవాళ ప్రగతి నమూనా మీద చర్చ జరుగుతూ తెలంగాణ బాగు కోసం, భవిష్యత్తు కోసం ఎన్నికల కదనరంగం కనపడుతుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. వివేకవంతమైన పాలకులు సరైన సమయాల్లో సమయోచిత నిర్ణయాలే తీసుకుంటారు. ఆ నిర్ణయాలు విశాల ప్రజానీకానికి ఉపయోగకారులుగా నిలుస్తాయి. వ్యూహాత్మకమైన ఈ నిర్ణయాలు ఆయా వర్గాలకు నూతనోత్తేజాన్ని కలిగిస్తుంటే మరో పక్క విమర్శకుల నోళ్లను మూయించే రీతిలో భవిష్యత్ దిశానిర్దేశణాలుగా నిలుస్తున్నాయి. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అది దీర్ఘకాలికం, సమయోచితం అని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అద్భుతమని ఆర్బీఐ, కాగ్, కేంద్ర నివేదికలు కితాబులిస్తున్నాయి. ఈదేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే పెద్దసంఖ్యలో అవార్డులు, రివార్డులు దక్కాయి. అసాధ్యమన్న చోట తన సుపరిపాలనతో సాధ్యమని అనేక రంగాల్లో నిరూపించారు. తెలంగాణలో కేసీఆర్ ఏది చేసినా అది సంచలనమే. ఎన్ని అవాంతరాలొచ్చినా దీర్ఘకాలిక సంక్షేమపథకాలు, పాలనా సంస్కరణలను కొత్త పుంతలు తొక్కించారు. అంతేకాదు ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న అతి ముఖ్యమైన సమయోచిత నిర్ణయాలు 'ఆర్టీసీ ప్రభుత్వపరం చేయటం', 'రైతురుణ మాఫీ' 'వీఆర్ ఏ వ్యవస్థను రద్దు చేసి వారికి ప్రత్యామ్నాయ బదలాయింపు' లపై ఎన్ని విమర్శలొచ్చినా కేసీఆర్ ముందుకే సాగారు. దళారుల బెడద లేకుండా ప్రతి పథకం నేరుగా ప్రజలకు చేరడం, విద్య, వైద్య, సాగు, తాగు నీటి రంగం బలోపేతమవ్వడం, ప్రతి రంగంలో కేసీఆర్ మార్కు పాలన కనపడుతున్న నేపథ్యంలో అదే ఆత్మవిశ్వాసంతో మరోసారి జనం వద్దకు వెళ్తున్న కేసీఆర్ను తెలంగాణ ఆశీర్వదిస్తుందన్న నమ్మకం బలంగా ఉన్నది. మొత్తంగా అద్దం ముందు నిలబడి తన ప్రతిబింబం కాదని అబద్ధం చెప్పి ఎవరికి వారు బుకాయిస్తే ఎలా ఉంటుందో ప్రజల ముందు కనిపిస్తున్న వాస్తవిక ప్రగతిని కాదంటే కూడా అలానే ఉంటుంది. తెలంగాణకు అద్దమే కేసీఆర్. దేశంలో ప్రగతికి ప్రతిరూపమే తెలంగాణ.

No comments:

Post a Comment

Note: Only a member of this blog may post a comment.